శనివారం శాసనసభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి పునరుద్ఘాటించారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లతోపాటు మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఆర్థిక సాయం, రూ.500కే వంటగ్యాస్ సిలిండర్ వంటివన్నీ అమలు చేస్తామని ప్రకటించారు.
ప్రభుత్వం ఏర్పడిన తొలిరోజే మంత్రివర్గ సమావేశం నిర్వహించి ఆరు గ్యారంటీలకు ఆమోదం తెలిపామని.. వాటికి చట్టబద్ధత కల్పించే కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. శనివారం శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో రేవంత్ మాట్లాడారు. బీఆర్‌ఎస్ పాలనలోని వైఫల్యాలను ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. రేవంత్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
‘‘కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారు. ఓటమి తర్వాతైనా బీఆర్‌ఎస్‌లో మార్పు వస్తుందని ఆశించాం. శాసనసభలో గతంలో మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉన్న ఇతరులకు అవకాశం ఇస్తారనుకున్నాం. కానీ ఇప్పుడు కూడా ఆ కుటుంబ సభ్యులే మాట్లాడుతున్నారు. ‘మా పారీ్ట.. మా ఇష్టం’అనేది ఎక్కువకాలం చెల్లదు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అడుగుతాం, కడుగుతామని శ్రీశ్రీ అన్నారు.
నిరంకుశత్వం ఎక్కువకాలం ఉండదు. మేం ప్రగతిభవన్ గడీలను బద్దలుకొట్టాక ప్రజలు తమ సమస్యలు చెప్పుకొనేందుకు రావడాన్ని బీఆర్‌ఎస్ నేతలు సహించలేకపోతున్నారు. గతంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ప్రగతిభవన్‌కు వస్తే అనుమతి లేదని హోంగార్డే వెనక్కి పంపారు. నాటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సీఎంను కలిసేందుకు ప్రగతిభవన్‌కు వెళ్తే.. అనుమతి లేదని పోలీసులు వెనక్కి పంపిన చరిత్రను తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు.
ప్రజాయుద్ధనౌక గద్దర్‌ను కూడా ప్రగతిభవన్‌లోకి ప్రవేశం లేదని వెనక్కి పంపారు. మంత్రులు కూడా సీఎంను కలిసే అవకాశం లేని పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంది. ఇప్పుడా ఇనుప కంచెలను పగలగొట్టి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాం. ప్రజలకు స్వేచ్ఛ కల్పించాం. ఎవరైనా స్వేచ్ఛగా వచ్చి తమ సమస్యలు చెబితే వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
పదేళ్లలో 8 వేల మంది రైతుల ఆత్మహత్యలు
రైతుల ఆదాయంలో తెలంగాణ దేశంలో 25వ స్థానంలో ఉంది. గత పదేళ్లలో తెలంగాణలో 8వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఎన్‌సీఆర్‌బీ నివేదికలోనే వెల్లడైంది. 2018 నుంచి ఇప్పటివరకు 18–60 ఏళ్లమధ్య వయసున్న 1,12,965 మంది రైతులు చనిపోతే.. వారికి రైతుబీమా కింద పరిహారం ఇచ్చారు. చనిపోయాక ఇవ్వడమా రైతు ప్రభుత్వమంటే? అదే పంటల బీమా పథకం పెట్టి ఉంటే రైతుల ఆత్మహత్యలు జరిగి ఉండేవి కాదు. కేసీఆర్ వరి వేస్తే ఉరే అని చెప్పి.. తన ఫామ్‌హౌజ్‌లో మాత్రం 150 ఎకరాల్లో వరి పండించి, ఆ వడ్లను క్వింటాల్ రూ.4,250 లెక్కన అమ్ముకున్నారు. అదే రైతులకు మాత్రం రూ.1,400 లెక్కనే ఇచ్చారు. దీనిపై విచారణకు సిద్ధమా?
పాలమూరు ప్రజలు గెలిపించకపోయి ఉంటే..
తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్ వన్ అనేది పచ్చి అబద్ధం. యూటీలు, పలు రాష్ట్రాల తరువాత తెలంగాణ 10వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో కోటి ఎకరాలకు కాల్వల ద్వారా నీరిస్తే.. 2014లో 19 లక్షలున్న పంపుసెట్ల సంఖ్య ఇప్పుడు 29లక్షలకు ఎందుకు చేరింది? రాష్ట్రంలో పాలమూరు, చేవెళ్ల ప్రాంతాలపై ఎందుకు వివక్ష కొనసాగింది? పాలమూరులో వలసలు ఆగలేదు.
ఆర్‌డీఎస్ ప్రాజెక్టు ఇంకా పూర్తికాలేదు. కేసీఆర్‌ను పాలమూరు ప్రజలు ఎంపీగా గెలిపించకపోయి ఉంటే రాజకీయ భవిష్యత్తు ఏమై ఉండేది? ప్రాణహిత–చేవెళ్ల పథకాన్ని రద్దుచేసి ఈ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశారు. మిడ్ మానేరు నిర్వాసితులు పరిహారం కోసం ఇప్పటికీ ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. మిడ్‌మానేరు ఆర్ అండ్ ఆర్ పునరావాసంలో ఎంపీ సంతోష్‌కుమార్‌కు, ఆయన సోదరికి 250 గ జాల చొప్పున ఇళ్లస్థలాలు వ చ్చాయి. ఇసుక దోపిడీని ప్రశ్నించిన నేరెళ్ల ప్రజలను కే సులు పెట్టి హింసించారు. దళితులను లాకప్‌లలో పెట్టి, కరెంట్ షాక్ ఇచ్చి హింసించారు. బీఆర్‌ఎస్ సభ్యులెవరినీ సభ నుంచి బయటికి పంపించం. వారిని ఇక్కడే కూర్చోబె ట్టి కఠోర నిజాలు వినిపిస్తాం. వారికి ఇదే శిక్ష.
ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే..
గవర్నర్ ప్రసంగం వింటుంటే సిగ్గుపడ్డామని కేటీఆర్ అన్నారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు పదో తరగతి పరీక్షలు సరిగా నిర్వహించలేదు. ఇంటర్ పరీక్షలు సరిగా దిద్దక 25మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమయ్యారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా ఉద్యోగ నియామకాలు చేపట్టలేక ప్రశ్నపత్రాలు అమ్ముకున్నవాళ్లు సిగ్గుతో తలదించుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే.
మేనేజ్‌మెంట్ కోటాలో ఇక్కడ (సీఎం స్థానంలో) కూర్చోవాలనుకుంటే కేటీఆర్‌కు నిరాశ ఎదురైంది. పదవి దక్కలేదనే నిరాశతోనే ఆయన అక్కసు వెళ్లగక్కుతున్నారు. సోనియాగాంధీ దయ వల్లే తెలంగాణ వచ్చిందని గతంలో కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలో అంగీకరించారు. గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ మేనిఫెస్టోలా ఉందని కడియం శ్రీహరి అన్నారు. కాంగ్రెస్ విధానాలనే గవర్నర్ తన ప్రసంగంలో చెప్పారు. అందులో తప్పులేదు. ఆరు గ్యారంటీలతోపాటు ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని మేం చెప్తున్నాం..’’అని రేవంత్ చెప్పారు.
ధర్నాచౌక్‌ను పునరుద్ధరించాం
మేం నియంతృత్వం, నిర్బంధ పోకడకు వెళ్లం. గతంలో అసెంబ్లీలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్ నిరసన తెలిపితే వారి శాసనసభ సభ్యత్వాలు రద్దు చేసిన చరిత్రను ప్రజలు మర్చిపోలేదు. గతంలో అమరవీరుల కుటుంబీకులను ఎప్పుడైనా ప్రగతిభవన్‌కు పిలిచి బుక్కెడు బువ్వ పెట్టి గౌరవించారా? ఉద్యమంలో బిడ్డలను కోల్పోయిన కుటుంబాలను ఆదుకున్నారా? పదేళ్లు అధికారంలో ఉండి తెలంగాణ ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయలేదు.
తెలంగాణ కోసం ఉద్యోగం వదులుకున్న డీఎస్పీ నళినికి ఎందుకు న్యాయం చేయలేదు? కేసీఆర్ తన కుటుంబంలోని కుమారుడు, కుమార్తె, బంధువులకు మాత్రం మంత్రి పదవులు ఇచ్చారు. ఉద్యమ పార్టీ అని చెప్పుకొనే బీఆర్‌ఎస్ ప్రభుత్వం ధర్నాచౌక్‌ను ఎత్తివేసింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు మేం ధర్నాచౌక్‌ను పునరుద్ధరించాం. కావాలనుకుంటే కేటీఆర్, బీఆర్‌ఎస్ నేతలు ధర్నాచౌక్‌లో ఆమరణ నిరాహార దీక్షలు, ధర్నాలు చేసుకోవచ్చు.
శాసనసభ 20వ తేదీకి వాయిదా
ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని శాసనసభ శనివారం ఆమోదించింది. తర్వాత శాసనసభను ఈనెల 20వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ప్రకటించారు.
డ్రగ్స్ విషయంలో ఎవరినీ ఉపేక్షించం
‘‘బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రం గంజాయి, డ్రగ్స్‌కు అడ్డాగా మారింది. డ్రగ్స్ ఘటనపై సిట్ వేయాలని నేనే పోరాటం చేశాను. డ్రగ్స్ కోరల్లో చిక్కుకున్న పంజాబ్ మాదిరే మన రాష్ట్రాన్ని తయారు చేశారు. గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన టీఎస్ న్యాబ్ కాగితాలకే పరిమితమైంది. డ్రగ్స్ నివారణకు 319 మంది సిబ్బంది కావాలంటే ఇవ్వలేదు. న్యాబ్ రూ.29 కోట్ల నిధులు కోరితే ఇవ్వలేదు.
మా ప్రభుత్వం డ్రగ్స్‌ను అరికట్టేందుకు పటిష్ట ప్రణాళికతో వెళ్తుంది. డ్రగ్స్ విషయంలో ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదు. కఠినంగా శిక్షిస్తాం. రాష్ట్ర సరిహద్దుల్లోకి డ్రగ్స్, గంజాయి వస్తే ఊరుకోం. ప్రతిపక్షాలు సహకరించాలని కోరుతున్నా. మేం పాలకులం కాదు.. సేవకులం. నాలుగున్నర కోట్ల ప్రజలకు సేవ చేసేందుకే ఇక్కడికి వచ్చాం.’’
Comments
Please login to add a commentAdd a comment