సూత్రధారి, పాత్రధారి చంద్రబాబే  | CM YS Jagan Fires On Chandrababu And Pawan Kalyan | Sakshi
Sakshi News home page

సూత్రధారి, పాత్రధారి చంద్రబాబే 

Published Sun, Sep 17 2023 2:31 AM | Last Updated on Sun, Sep 17 2023 7:13 AM

CM YS Jagan Fires On Chandrababu And Pawan Kalyan - Sakshi

తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో కాపు నేస్తం చెక్‌ను లబి్ధదారులకు అందజేస్తున్న సీఎం జగన్‌

ప్రజల సొమ్ము, ఇంత అడ్డగోలుగా ఎలా దోచేశారు? ఎవరి జేబులోకి ఈ డబ్బులు పోయాయి? దోచేసిన వాళ్లను జైళ్లలో పెట్టకపోతే మరెక్కడ పెట్టాలి? అని ప్రశ్నించాల్సిన వారు ములాఖత్‌లో మిలాఖత్‌ అయిపోతే పరిస్థితి ఏమిటని ఆలోచన చేయండి. వీళ్లందరి కండకావరం ఏమిటంటే.. మాకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ– 5 అండగా ఉంది.. ఓ దత్తపుత్రుడి సపోర్టు ఉంది.. కాబట్టి మేం దోచేసి పంచుకున్నా కూడా ఎవరూ మాట్లాడరనే ధీమా వాళ్లకుంది.   

ఇవాళ రూ.371 కోట్లు ప్రజలకు చెందాల్సిన ప్రభుత్వ ధనం ఎక్కడికి పోయింది? చంద్రబాబు నడిపిన కథలో చంద్రబాబును కాక మరెవరిని అరెస్టు చేయాలి? ఈ విషయంలో ఈ దొంగల ముఠా సభ్యులు నోరెత్తరు. ఎల్లో మీడియాకు ఇది కనిపించదు. కారణం దొంగ వాళ్ల వాడే కాబట్టి. వాటాలు పంచుతాడు కాబట్టి నోరు విప్పరు. పైగా నిస్సిగ్గుగా పేపర్లో ఎడిటోరియల్స్‌ రాస్తారు. మా బాబు లంచాలు తీసుకుంటే తప్పేంటని ఒకరు చెత్త పలుకులు రాస్తే.. మరొకరు బాబు అవినీతిని దాచడానికి అష్టకష్టాలు పడుతున్నారు. నేరుగా జైలుకు వెళ్లి ములాఖత్‌లో మిలాఖత్‌ చేసుకుని పొత్తు పెట్టుకునేవారు ఇంకొకరు. ఎలాంటి మనుషులున్నారో ఆలోచించండి.  
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

నిడదవోలు నుంచి సాక్షి ప్రతినిధి: ‘స్కిల్‌ స్కామ్‌ సూత్రధారి, పాత్రధారి చంద్రబాబే. ఫేక్‌ అగ్రిమెంట్‌తో ప్రభుత్వ ఖజానా దోచేశారు. సీమెన్స్‌ కంపెనీ మాకు సంబంధం లేదని చెప్పింది. ఎన్ని దొంగతనాలు చేసినా, ఎంత దోపిడీ చేసినా, ఎన్ని వెన్నుపోట్లు పొడిచినా చంద్రబాబునాయుడు అనే వ్యక్తిని రక్షించుకునేందుకు పలుకుబడి కలిగిన దొంగల ముఠా సభ్యులు ఉన్నారు. చంద్రబాబును వెనకేసుకు వచ్చిన వారంతా గజదొంగలే. రూ.371 కోట్ల ప్రజా ధనం దోచేసిన వాళ్లను జైళ్లో కాకుండా మరెక్కడ పెట్టాలి? పవన్, ఎల్లో మీడియా.. బాబును వెనకేసుకు రావడానికి కారణం వాళ్లు కూడా దొంగల ముఠాలో వాటాదారులు కావడమే’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు.

శనివారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో కాపునేస్తం నిధుల విడుదల సందర్భంగా జరిగిన సభలో చంద్రబాబు అవినీ­తిని ఆయన తూర్పారబట్టారు. ‘ప్రజలను వంచించి 45 ఏళ్లుగా దోపిడీనే రాజకీయంగా మార్చుకుని ఇటీవలే అవినీతి కేసులో సాక్ష్యాధారాలతో అరెస్టు అయిన ఒక మహానుభావుడి గురించి నాలుగు మాటలు చెబుతాను. చట్టం ఎవరికైనా ఒక్కటే. దురదృష్టమేమిటంటే ఎన్ని దొంగతనాలు చేసినా, ఎంత దోపిడీ చేసినా, ఎన్ని వెన్నుపోట్లు పొడిచినా చంద్రబాబునాయుడు అనే వ్యక్తిని రక్షించుకునేందుకు పలుకుబడి కలిగిన దొంగల ముఠా సభ్యులు రంగంలోకి దిగారు.

ఒక మామూలు వ్యక్తి ఇదే తప్పు చేస్తే ఏ రకమైన శిక్ష పడుతుందో.. తప్పు చేస్తే అధికారంలో ఉన్న వాళ్లకు కూడా అదే శిక్ష పడాలని, చట్టం ఎవరికైనా ఒకటే అని చెప్పే వారే ఇంతకాలం లేరు. ఇప్పుడు చట్టం ఎవరికైనా ఒక్కటే అని చెప్పే గొంతుకలు గళం విప్పుతున్నాయి. ఇలా గళం విప్పడాన్ని ఈ దొంగల ముఠా సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు’ అని అన్నారు. ఈ సభలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 
సీఎం జగన్‌ వస్తున్న వాహనంపై పూలవర్షం కురిపిస్తున్న జనం  

ఓటుకు కోట్లు గుర్తుండే ఉంటుంది.. 
► తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కోసం కోట్లు ఇస్తూ చంద్రబాబు దొంగగా అడ్డంగా, నిలువుగా దొరికిన విషయం మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. నల్లధనం ఇస్తూ ఆడియో, వీడియో టేపులతో అడ్డంగా దొరికారు. చివరికి ఆ ఆడియో టేపుల్లో ఉన్న వాయిస్‌ చంద్రబాబుదే అని ఫోరెన్సిక్‌ వాళ్లు సర్టిఫికెట్‌ ఇచ్చారు.  

► అది దోపిడీ సొమ్ము అని ప్రజలందరికీ అర్థం అయింది. అయినా కూడా బాబు చేసింది అసలు నేరమే కాదని వాదించడానికి.. 10 కోట్ల మంది ప్రజల కళ్లకు గంతలు కట్టడానికి ఆ దొంగతనాల్లో వాటాదారులు పది మంది వెంటనే సిద్ధం అయ్యారు. అరడజను ఎల్లో చానెళ్లు, రెండు ఎల్లో పత్రికలు రెడీగా నిలబడ్డాయి.
 
► కానీ నిజం నిర్భయంగా చెప్పడానికి ఈ పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న వారిలో ఏ ఒక్కరూ సిద్ధంగా లేరు. ఎందుకంటే బాబు దొంగతనాల్లో వీళ్లు కూడా వాటాదారులు కాబట్టి. ఇంత అడ్డగోలుగా నల్లధనం ఇస్తూ ఆడియో, వీడియో టేపుల సాక్షిగా దొరికినా, ఆ వాయిస్‌ చంద్రబాబుదేనని ఫోరెన్సిక్‌ వాళ్లు నిర్ధారించినా వారు నీతి, న్యాయం, ధర్మం వైపు నిలబడలేదు.  

ఆధారాలు చూపిస్తున్నా బుకాయింపే 
► లేని కంపెనీని ఉన్నట్టుగా ఒక ఫేక్‌ అగ్రిమెంటు సృష్టించి, ప్రభుత్వ నిబంధనలు అన్నింటినీ సాక్షాత్తూ చంద్రబాబే పక్కన పెట్టించారు. చివరకు ఆ సీమెన్స్‌ కంపెనీయే మాకు రూ.371 కోట్లు డబ్బు ముట్టలేదని, ఆ అగ్రిమెంట్‌తో మాకు ఎలాంటి సంబంధం లేదని లిఖిత పూర్వకంగా చెప్పింది.  

► సాక్ష్యాత్తు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఈడీ రూ.371 కోట్ల స్కిల్‌ స్కాంలో ఆ ఫేక్‌ అగ్రిమెంట్‌ చేసిన దొంగలను ఇప్పటికే అరెస్టు చేసింది. ఈ స్కిల్‌ స్కామ్‌ సూత్రధారి, పాత్రధారి చంద్రబాబే అని చెప్పేందుకు సాక్ష్యాలు, ఆధారాలు, నోట్‌ ఫైల్స్‌ ఉన్నప్పటికీ.. బాబు స్వయంగా ఈ ఫేక్‌ అగ్రిమెంట్‌ నిబంధనలన్నింటికీ విరుద్ధంగా అధికారులంతా డబ్బులు ఇవ్వొద్దని సలహా ఇచ్చినా.. వాటిని కూడా పక్కన పెట్టారు. 

► ఏకంగా 13 సందర్భాల్లో ఒత్తిడి తెచ్చిమరీ సంతకాలు పెట్టారు. సీఐడీ వారు ఇవన్నీ స్వయంగా చూపిస్తున్నా, ఆ డబ్బును డొల్ల సూట్‌ కేసు కంపెనీలకు ఎలా మళ్లించారో వివరిస్తున్నా ఈ దొంగల ముఠా ఒప్పుకోవడం లేదు.  

► దీంతో సంబంధం ఉన్న వ్యక్తులతో సెల్‌ఫోన్లలో చాట్‌లు, ఈ మెయిల్స్‌తో చంద్రబాబు పీఏ అడ్డంగా  దొరికిపోయారు. ఐటీ విచారణలో, ఐటీఏఆర్‌లో బాబు పీఏ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ విషయాలను ఇన్‌కంటాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ వాళ్లు చూపించి బాబుకు నోటీసులిస్తున్నారు. చివరకు కోర్టుల్లో సుమారు 10 గంటలపాటు ఇరువైపులా వాదనలు జరిగాయి. ఆ వాదనలు విని సాక్ష్యా­లు, ఆధారాలు చూసిన తర్వాతే కోర్టు చంద్రబాబును రిమాండ్‌కు పంపించింది.
 
► ఇంత బాహాటంగా దొరికినా కూడా ప్రశ్నిస్తా.. ప్రశ్నిస్తా.. అన్నవాడు ప్రశ్నించడు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5.. ఈ ఎల్లో మీడియా పత్రికలు, టీవీ చానెళ్లు నిజాన్ని చూపవు. వినిపించవు. నోరెతవు. పైగా నిస్సిగ్గుగా ఆ పని సబబే అని సపోర్టు చేస్తారు. మనం ఎలాంటి ప్రపంచంలో బతుకుతున్నామన్నది ఆలోచించండి.  

మీరే నా బలం 
మీ బిడ్డ దేవుడి దయను, మిమ్నల్ని తప్ప ఇతరులెవరినీ నమ్ముకోలేదు. జరగబోయేది కురుక్షేత్ర యుద్ధం. ఈ యుద్ధంలో న్యాయం, ధర్మం మీ బిడ్డ పక్షాన ఉంది. అన్యాయం, మోసం, వెన్నుపోట్లు అటువైపు ఉన్నాయి.  మిమ్మల్ని కో­రే­ది ఒక్కటే. మీ బిడ్డ ప్రభుత్వంలో మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా? లేదా? అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి.  మంచి జరిగి ఉంటేనే మీ బిడ్డకు మీరే సైనికులు కావాలని  కోరుతున్నాను. పే­దల గుండె చప్పుడుగా, సామాజిక న్యాయానికి చిరునామాగా మీ బిడ్డ ప్రభుత్వం పని చేసింది. రాబోయే రోజుల్లో  కూడా ఇంకా మెరుగైన పాలన సాగించేలా మీరంతా ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాను.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement