సాక్షి, పల్నాడు: పేదపిల్లల చేతుల్లో ట్యాబులు కనిపిస్తే ఓర్వలేని బుద్ధి చంద్రబాబుదని అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. అన్నింట్లోనూ.. పేదల పట్ల వ్యతిరేకత బుద్ధి ప్రదర్శించాడని, అందుకు కారణం ఆయనలోని పెత్తందారీ మనస్తత్వమని చెప్పారు సీఎం జగన్. సోమవారం పల్నాడు క్రోసూర్‌లో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు తీరును సీఎం జగన్ ఏకిపారేశారు.
‘‘చంద్రబాబుకు మంచి చేయాలన్నది ఏనాడూ లేదు. గతంలో ఇది చూశాం. ఆయన 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నా కూడా.. ఏ ఒక్క మంచి, పథకం కూడా గుర్తుకు రాదు. చంద్రబాబు నాయుడు ఏ ఒక్క వర్గాన్ని కూడా వదకులండా ‘‘ఎన్నికలకు ముందు వాగ్ధానం చేశారు.. ఎన్నికల తర్వాత మోసం చేశాడ’’ని సీఎం జగన్ ఉద్ఘాటించారు. ఇది కళ్ల ముందు కనిపిస్తున్న సత్యమన్నారు.
గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడా గుర్తించండి. అవినీతి, వివక్షకు తావులేకుండా నేరుగా లబ్ధి దారులకు సంక్షేమం అందించిన ప్రభుత్వం మనది. అక్కచెల్లెమ్మల దగ్గరి నుంచి అన్ని వర్గాలకూ లబ్ధి చేకూరుస్తున్నాం. మేనిఫెస్టోలో ప్రకటించిన అన్ని హామీలను అమలు చేస్తున్నాం. కానీ, చంద్రబాబు బతుకే మోసం, అబద్ధం, కుట్ర, వాగ్ధానాలు, వెన్నుపోటులు. ఒక ఈనాడు, ఒక టీవీ5, ఒక ఆంధ్రజ్యోతి, ఒక దత్తపుత్రులు.. ఈ గజదొంగల ముఠా ఆయనకు అండగా వస్తోంది. మూసేయడానికి సిద్ధంగా ఉన్న టీడీపీ దుకాణంలో పక్కరాష్ట్రం నుంచి మేనిఫెస్టో తీసుకొచ్చి.. బిసిబిల్లాబాత్‌గా వండుతున్నారు. మనం చేసిన మంచిని, అందిస్తున్న సంక్షేమ పథకాలను కిచిడీ, పులిహోరగా వండే ప్రయత్నం చేస్తున్నారు.
సీఎం అయిన 28 సంవత్సరాల తర్వాత.. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత రాయలసీమ, బీసీ, ఎస్సీఎస్టీ డిక్లరేషన్‌లు అంటూ ఇవాళ మొదలుపెట్టారు. ఆ 14 సంవత్సరాలు ఏం గాడిదలు కాసావా చంద్రబాబు? అంటూ నిలదీశారు సీఎం జగన్. కేవలం ఎన్నికలప్పుడే వాగ్ధానాలు.. వెన్నుపోట్లతో చంద్రబాబు చట్రం నడుస్తోందని ఎద్దేవా చేశారు సీఎం జగన్.
చంద్రబాబునాయుడుగారి పెత్తందారీ వ్యవస్థకు X పేదల ప్రభుత్వానికి జరుగుతున్న యుద్ధం. డీపీటీ(దోచుకో, పంచుకో, తినుకో) భావజాలానికి X లంచాలకు తావులేకుండా వివక్షకు చోటులేకుండా నేరుగా లబ్ధి అందిస్తున్న టీబీటీ సర్కార్‌కు జరుగుతున్న యుద్ధం. సామాజిక అన్యాయానికి X సామాజిక న్యాయానికి మధ్య జరుగుతున్న యుద్ధం. యెల్లో మీడియా విష ప్రచారానికి X ఇంటింటికీ జరిగిన మంచికీ మధ్య జరుగుతున్న యుద్ధం. ఈ యుద్ధం.. ఈ కురుక్షేత్ర మహాసంగ్రామ యుద్ధం.. ఇది జగన్‌పై జరుగుతున్న యుద్ధం కాదు.. పేదలపై జరుగుతున్న యుద్ధం. మీ జగనన్నకు ఈనాడు తోడు లేదు, టీవీ 5 అండ లేదు, ఏబీఎన్ ఢంకా బజాయించడంలేదు, దత్తపుత్రుడు అసలే లేడు. మీ జగనన్నకు బీజేపీ అండగా ఉండకపోవచ్చు.. వీటినేం మీ జగనన్న నమ్ముకోలేదు.
మీ జగనన్న నమ్ముకుంది దేవుడి దయను. మీ చల్లని దీవెనలు. నా ధైర్యం మీరు. నా బలం ఇంటింటికి మన ప్రభుత్వం అందించిన మంచి అని చెప్పడానికి గర్వపడుతున్నా. మిమ్మల్ని కోరేది ఒక్కటే.. వాళ్ల దుష్ప్రచారాలను నమ్మకండి. ఈ ప్రభుత్వం ద్వారా మీ ఇంట్లో జరిగిన మంచే కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మంచి జరిగితే మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి. మంచి గెలుస్తుందని మనసారా నమ్ముతూ.. దేవుడి దీవెనలు, ప్రజల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా. పిల్లలు మంచిగా చదువుకుని విద్యావేత్తలుగా ఎదగాలని, మంచి నాయకులు కావాలని.. మీ అందరికీ మరింత మంచి చేసే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నా.
గతానికీ ఇప్పటికీ తేడా....
గత ప్రభుత్వంలో ఇవన్నీ చేయాలని చంద్రబాబుకు మనసే లేదు. గతంలో చంద్రబాబుకు ఆలోచన వేరు. ఆయన మనస్తత్వం పూర్తిగా వేరు.
పేదలు చదువుకుంటే, అందులోనూ ఆ పేద పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదువుకుంటే.. వారికి గవర్నమెంట్ బడుల్లో డిజిటల్ బోధన వస్తే.. ఆ పేద పిల్లల చేతుల్లో కూడా ట్యాబ్స్ కనిపిస్తే తట్టుకోలేని మనస్తతత్వం చంద్రబాబుది.
చంద్రబాబు పేదల వ్యతిరేకి..
అన్ని విషయాల్లో చంద్రబాబు గారిది ఇదే వ్యవహారం, ఇదే బుద్ది. పేదలకు వ్యతిరేక బుద్ధి. పేదలు బాగు పడకూడదన్న దుర్బుద్ధి.
కారణం వారిది పెత్తందారీ మనస్తత్వం, వారు పేదలకు వ్యతిరేకం అని గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నా.
వాలంటీర్లు– లంచాలకు తావులేని వ్యవస్ధ...
మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఎక్కడా కూడా లంచాలకు, వివక్షకు తావుండకూడదని చెప్పి.. వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాం. గ్రామాల్లో అవ్వాతాతలకు పెన్షన్ దగ్గర నుంచి, అక్కచెల్లెమ్మలకు రేషన్ సరుకులు మొదలు పేదలు, రైతులందరూ ఎటువంటి ఇబ్బంది, లంచాలు ఉండకూడదని మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే వాలంటీర్ల వ్యవస్ధ, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాం. వెంటనే ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్‌లు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. నాడు–నేడు స్కూల్స్‌లో మార్పులు తీసుకొచ్చాం. ఇలా అనేక వ్యవస్ధలను గ్రామస్ధాయిలో మనందరి ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది.
మరి ఇవే ఆలోచనలు గతంలో చంద్రబాబు బుర్రకు ఎందుకు తట్టలేదో ఒక్కసారి ఆలోచన చేయాలి. కారణం వారిది పెత్తందారీ మనస్తత్వం, వారు పేదలకు వ్యతిరేకం.
ఈ నాలుగు సంవత్సరాల్లోనే మనం ఇళ్లపట్టాలు, ఇళ్ల నిర్మాణం, అక్కచెల్లెమ్మలకు ఇచ్చే అమ్మ ఒడి, ఆసరా, చేయూత, సున్నా వడ్డీ, దిశ యాప్.. ఇటువంటివన్నీ తీసుకొచ్చాం.
భారత దేశ చరిత్రలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా నిలబడనంత అండగా నా అక్క చెల్లెమ్మలకు మీ జగనన్న ప్రభుత్వం తోడుగా నిలబడింది.
చంద్రబాబు బ్రతుకే మోసం, అబద్దం ...
ఎన్నికలకు ముందు వాగ్దానం చేశాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత మోసం చేశాడు. రైతన్నలకు ఎన్నికలకు ముందు వాగ్దానం, ఎన్నికల తర్వాత మోసం చేశాడు.
యువతకూ ఎన్నికలకుముందు వాగ్దానం చేసి, ఎన్నికల తర్వాత మోసం చేశాడు.
ఇదే పెద్ద మనిషి చంద్రబాబు.. ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు, ఓసీలో నిరుపేదలకు ఏం చేశాడని చూస్తే.. ఎన్నికలకుముందు వాగ్దానం, ఎన్నికల తర్వాత మోసం చేశాడని మనకు కళ్లెదుటనే కనిపిస్తున్న సత్యం. కారణం ఈ పెద్దమనిషి చంద్రబాబు బతుకే మోసం, పెద్ద అబద్ధం.
చంద్రబాబుది పెత్తందారీ మనస్తత్వం, ఈ బాబు పేదలకు వ్యతిరేకమన్నది మర్చిపోవద్దని తెలియజేస్తున్నా.
14 సంవత్సరాలు ముఖ్యమంత్రి పోస్టులో ఉండి కూడా చంద్రబాబు గారి పేరు చెబితే ఏ ఒక్కసంక్షేమ పథకం మనకు గుర్తు రాదు. ఏ ఒక్క మంచీ గుర్తుకు రాదు.
బాబు పేరు చెబితే వెన్నుపోటు గుర్తు వస్తుంది..
చంద్రబాబు పేరు చెబితే 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నా కూడా ఆయన పేరు చెబితే గుర్తుకు వచ్చేది వెన్నుపోట్లు, మోసం, కుట్ర, దగా.
ఇంత దారుణంగా ప్రజలందరినీ మోసం చేస్తున్నా కూడా అన్ని విషయాల్లో బాబును వెనకేసుకురావడానికి బాబు వల్ల బాగా వెనుకేసుకున్న ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, టీవీ5, వీళ్లందరికీ ఒక దత్తపుత్రుడు ఉన్నారు.
ఈ గజదొంగల ముఠా, ఈదుష్ట చతుష్టయం మాత్రమే చంద్రబాబుకు తోడుగా ఉంది.
కానీ బాబు పాలన వల్ల, ఆయన చేసిన పనులు వల్ల తమకు మేలు జరిగిందని చెప్పే ఒక సామాజికవర్గంగానీ, ప్రాంతంగానీ, పేదలుగానీ, ఒక్కరంటే ఒక్కరు కూడా ఆయనకు తోడుగా లేరని ఈ సందర్భంగా చెబుతున్నాను.
టీడీపీ మూసేయడానికి సిద్ధంగా ఉన్న దుకాణం..
కాబట్టి మూసేయడాని సిద్ధంగా ఉన్న ఈ టీడీపీ దుకాణంలో ఈరోజు ఏం జరుగుతోందంటే.. పక్క రాష్ట్రాల్లోని మేనిఫెస్టో తెచ్చి బిస్ బేలా బాత్‌గా వండుతున్నారు.
ఈ రోజు మనం అమలు చేసిన పథకాలన్నింటినీ కూడా కిచిడీ చేసి పులిహోరగా వండే కార్యక్రమం చేస్తున్నారు.
నిస్సిగ్గుగా చంద్రబాబు...
నిజంగా బాబు ఎంత సిగ్గులేకుండా ఉన్నాడంటే.. ఆశ్చర్యం అనిపిస్తుంది. కారణం సీఎం అయిన 28 సంవత్సరాల తర్వాత, 14 సంవత్సరాలు సీఎంగా చేసిన తర్వాత ఈరోజు రాయలసీమ డిక్లరేషన్ అంటూ ఇవాళ మొదలు పెడతాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఏం చేశారు ? గాడిదలు కాశారా అని అడుగుతున్నా ?
14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఈరోజు బీసీ డిక్లరేషన్ అంటూ మొదలు పెట్టాడు. ఎస్సీ, ఎస్టీ, డిక్లరేషన్ అంటూ మొదలు పెట్టాడు, మైనార్టీ డిక్లరేషన్ అని మొదలు పెట్టాడు.
అక్కచెల్లెమ్మలు, రైతన్నలు చివరికి గ్యాస్ సిలిండర్ల డిక్లరేషన్ అంటూ ఇవాళ మొదలు పెట్టాడు.
వాగ్దానాలు, వెన్నుపోట్ల చక్రమే– బాబు సైకిల్ చక్రం..
14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు ఏమి గాడిదలు కాశావయ్యా చంద్రబాబూ ? అని అడుగుతున్నా.
ఇవాళ ప్రజల్ని మళ్లీ మోసం చేస్తూ మరోసారి అవకాశం ఇస్తే మయసభ నిర్మిస్తానంటున్నాడు.
మరోసారి అవకాశం ఇస్తే...
ఇంటింటికీ కేజీ బంగారం ఇస్తానంటున్నాడు. ఇంటింటికీ బెంజ్ కారు కొనిస్తానంటున్నాడు. ఈ కొత్త డ్రామాలు నమ్మవచ్చా ? అని అడుగుతున్నా. కనీసం ఇప్పటికైనా ఈ పెద్దమనిషి చంద్రబాబు మరోసారి మోసానికి తెరతీయడం ఆపేస్తాడేమో అని ఆశిద్దాం.
చంద్రబాబు గారి బ్రతుకంతా కూడా వాగ్దానాలు, ఆ తర్వాత వెన్నుపోట్లు, మళ్లీ ఎన్నికలొచ్చినప్పుడు మళ్లీ వాగ్దానాలు, మళ్లీ వెన్నుపోట్లు, ఈ చక్రమే బాబు సైకిల్ చక్రం.
మనపేదలకూ– బాబు పెత్తందార్లకూ యుద్ధం..
ఈ రోజు బాబు పెత్తందారీ భావజాలానికి, మనందరి పేదల ప్రభుత్వానికి మధ్య ఈ యుద్ధం జరుగుతోంది. గమనించమని, ఆలోచన చేయమని మిమ్నల్ని కోరుతున్నాను.
చంద్రబాబు గారి దోచుకో, పంచుకో, తినుకో అనే డీపీటీ భావజాలానికి, మన రూ. 2.16 లక్షల కోట్ల రూపాయలు ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా పంపించే డీబీటీ పద్ధతికి మధ్య యుద్ధం జరుగుతోంది.
చంద్రబాబు గారి మాదిరి దోచుకో, పంచుకో, తినుకో డీపీటీ కావాలా, మీ జగనన్న ప్రభుత్వం మాదిరిగా నేరుగా బటన్ నొక్కే మన డీబీటీ కావాలా ఆలోచన చేయండి.
మనది సామాజిక న్యాయం– వారిది అన్యాయానికి యుద్దం.
ఇది వారి సామాజిక అన్యాయానికి, మన సామాజిక న్యాయానికి మధ్య జరుగుతున్న యుద్ధం. ఇదే రాష్ట్రంలో ఇదే బడ్జెట్‌లో వారు చేసిన స్కామ్‌లకు, అదే బడ్జెట్‌లో మనం అందజేస్తున్న మంచి స్కీములకు మధ్య జరుగుతున్న యుద్ధం.
ఇది వారి ఎల్లో మీడియా.. వారి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 చేస్తున్న విష ప్రచారాలకు.. ఇంటింటికీ మనం చేసిన.. కనిపిస్తున్న మంచికి జరుగుతున్న యుద్ధం ఇది.
పేదలపై జరుగుతున్న యుద్ధం..
ఈ కురుక్షేత్ర మహాసంగ్రామ యుద్ధంలో వీరిది పేదలపై యుద్దం అని గుర్తుపెట్టుకోవాలి. ఈ యుద్ధంలో వారి మాదిరిగా మీ జగన్‌కు ఒక ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు, ఆంధ్రజ్యోతి తోడుగా ఉండకపోవచ్చు. టీవీ5 డంకా బజాయించకపోవచ్చు. ఒక దత్తపుత్రుడు అండగా నిలబడకపోవచ్చు. మీ జగనన్నకు బీజేపీ అనే పార్టీ అండగా ఉండకపోవచ్చు.
మీ ఆశీస్సులు– దేవుడి దయనే నమ్ముకున్నా...
మీ జగనన్న వీళ్లను నమ్ముకోలేదు. మీ జగనన్న దేవుడి దయను, మీ చల్లని ఆశీస్సులను మాత్రమే నమ్ముకున్నాడు.
ఈ కురుక్షేత్ర మహాసంగ్రామంలో నా ధైర్యం మీరు. నా బలం ఇంటింటికీ మనందరి ప్రభుత్వం చేసిన మంచి అని చెప్పడానికి మీ బిడ్డగా గర్వపడుతున్నాను.
మీకు మంచి జరిగిందా లేదా అన్నదే కొలమానం....
మీ అందరినీ ఒకటే కోరుతున్నా. వాళ్లు చేస్తున్న దుష్ప్రచారాలను నమ్మకండి. మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అనేది ఒక్కటే ప్రామాణికంగా తీసుకోండి. మీ బిడ్డ వల్ల మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడాలని కోరుతున్నాను. ఈ యుద్ధంలో చివరకు ఎప్పుడైనా మంచే గెలుస్తుందని మనసారా నమ్ముతున్నాను. మంచి చేస్తున్న మనందరి ప్రభుత్వానికి దేవుడి చల్లని దీవెనలు ఉండాలని, ప్రజలందరి చల్లని ఆశీస్సులు కలకాలం ఉండాలని కోరుకుంటున్నాను.
నా అక్కచెల్లెమ్మలకు ఒక మంచి అన్నగా, తమ్ముడిగా మీ పిల్లలంతా ఇంకా బాగా చదువుకోవాలని, ప్రతి కుటుంబంలోంచి ఒక మంచి ఇంజనీర్, డాక్టర్, సైంటిస్ట్, సాఫ్ట్‌వేర్ సీఈవో, ఎకానమిస్ట్, ఎంటర్‌ప్రెన్యుర్ రావాలని, ప్రతి పేద కుటుంబం నుంచి ఒక మంచి లీడర్ రావాలని చెప్పి కోరుకుంటున్నాను. దేవుడు ఇంకా మీ అందరికీ మంచి చేసే అవకాశం ఇవ్వాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను.
చివరిగా...
కాసేపటి క్రితం మాదిపాడు వద్ద రూ.60 కోట్లతో హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్ధాపన చేశాం. దీనివల్ల విజయవాడ, గుంటూరుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా హైదరాబాద్‌కు వెళ్లాలంటే 80 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ఈ నియోజకవర్గానికి మంచి చేస్తూ... హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి ఈరోజే శంకుస్ధాపన చేశాం. అదే మాదిరిగా అమరావతి – రాజుపాలెం... కీలకమైన రోడ్డును మరో రూ.150 కోట్లతో శంకుస్ధాపన చేసాం.
Comments
Please login to add a commentAdd a comment