ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లను మారుస్తారనే వార్తలు పార్టీలో కలకలం రేపుతున్నాయా? పార్టీ కోసం కష్టపడిన నేతలను పక్కన పెట్టాలనే ఆలోచన ఎందుకు చేస్తున్నారు? ఇంతకాలంగా కష్టపడుతున్న తమను తొలగిస్తే సహించబోమంటూ తిరుగుబాటు చేస్తారా? అలాగే సైలెంట్‌గా ఉండిపోతారా? అసలు ఈ మార్పుల వల్ల నష్టం జరిగేదెవరికి?
ఉమ్మడి విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీలో అనిశ్చితి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీ అధినేత చంద్రబాబు నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మాత్రం సీట్లు ఇస్తానని భరోసా ఇవ్వడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. రూరల్ జిల్లాలోని ఇన్చార్జిల్లో కొంతమందిని తప్పించడానికి చంద్రబాబు సిద్ధమవుతున్నారు. సిట్టింగ్‌లకు సీట్లు ఓకే, మరి తమ పరిస్థితి ఏంటని మిగతా నేతలు ప్రశ్నిస్తున్నారు. నాలుగేళ్ళుగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పార్టీ కార్యక్రమాలు నిర్వహించామని, తమను ఎలా తప్పిస్తారని ప్రశ్నిస్తున్నారు. పార్టీని కాపాడుకునేందుకు నానా తంటాలు పడ్డామని, కీలక సమయంలో హ్యాండిస్తే తమ రాజకీయ భవిష్యత్ ఏంకావాలంటూ ఆందోళన చెందుతున్నారు. హైకమాండ్ నిర్ణయాలకు అనుగుణంగానే తమ రియాక్షన్ వుంటుందనే స్ట్రాంగ్ సంకేతాలు పంపుతున్నారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలకు గాను..నగర పరిధిలో ఉన్న నాలుగు సీట్లను టిడిపి గెలుసుకుంది. రూరల్‌లోని 11 స్థానాల్లో వైఎస్ఆర్సిపి విజయం సాధించింది. పరిపాలనా రాజధానిగా విశాఖను వ్యతిరేకిస్తున్న చంద్రబాబు తీరును తప్పుబడుతూ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ టిడిపికి గుడ్ బై చెప్పారు. మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. విశాఖ తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబులు తమ స్థానాల నుంచి మరోసారి పోటీకి సిద్ధమవుతున్నారు. ప్రతి సారి నియోజకవర్గాన్ని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ సారి నార్త్ నియోజకవర్గం నుంచి కాకుండా..భీమిలి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. దీనికి చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో భీమిలి ఇన్‌చార్జ్ కోరాడ రాజబాబు అలెర్ట్ అయ్యారు. నాలుగేళ్ళుగా పార్టీని మోస్తుంటే.. ఇప్పుడెవరికో టిక్కెట్ ఇస్తే మేము చూస్తూ ఊరుకోవాలా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గత ఎన్నికల తర్వాత చోడవరంలో బత్తుల తాతయ్య బాబుకు ఇన్చార్జ్ బాధ్యతలను అప్పగించారు. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఓడిపోయాక నియోజకవర్గంలో కనిపించని మాజీ ఎమ్మెల్యే రాజు యాక్టివేట్ అవుతున్నారు. తమ సీటును రాజుకు సీటు ఇస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలంతా చంద్రబాబును హెచ్చరిస్తున్నారు. విశాఖ సౌత్ లో మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీకి ఇన్చార్జ్ బాధ్యతలను అప్పగించారు. అయితే గత ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన నారా లోకేష్ తోడల్లుడు భరత్ విశాఖ సౌత్ సీటును ఆశిస్తున్నారు. గండి బాబ్జితో కలిసి భరత్ కూడా నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆఖరి నిముషంలో బీసీ వర్గానికి చెందిన గండి బాబ్జికి గండి కొట్టడం ఖాయమనే టాక్ ఇప్పుడు నడుస్తోంది. ఇక యలమంచిలిలో ఇన్‌చార్జ్‌గా ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రగడ నాగేశ్వరరావు సీటును పొత్తులో భాగంగా జనసేన ఆశిస్తోంది.
మాడుగుల నియోజకవర్గ టీడీపీలో అయితే మూడు ముక్కలాట నడుస్తోంది. మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు, ఇన్చార్జ్ పీవీజీ కుమార్, NRI పైలా ప్రసాదరావులు సీటు ఆశిస్తున్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న తనను కాదని పార్టీకి కోటి రూపాయలు ఇచ్చాడని.. ముక్కు మొహం తెలియని పి వి జి కుమార్‌కు గాని సీటు ఇస్తే కచ్చితంగా రెబల్‌గా బరిలో ఉండాలని రామానాయుడు నిర్ణయించుకున్నారు. ఎన్నికల కాలం దగ్గరపడుతుండటంతో నాలుగేళ్ళుగా పార్టీ కోసం కష్టపడినవారిని పక్కన పెడితే ధిక్కరించడానికి సిద్ధమని పలువురు ఇన్‌చార్జ్‌లు పార్టీ నాయకత్వానికి సంకేతాలు పంపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment