
సాక్షి, న్యూఢిల్లీ: పూర్తిస్థాయిలో గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఆఫ్ ఇండియా ‘కాంగ్రెస్’ను ప్రక్షాళన చేయాలని అధిష్టానం నిర్ణయించింది. ఈ మేరకు శనివారం ఉదయం నుంచి జరుగుతున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇన్‌ఛార్జిల భేటీలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
సుమారు మూడు గంటలపాటు సాగిన అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ ఇన్‌ఛార్జిలు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శుల సమావేశం వాడీవేడిగా సాగింది. రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి పై పలు సూచనలు, అభిప్రాయాలను అధిష్టానానికి వెల్లడించారంతా. ఈ భేటీలో సంస్థాగత నిర్మాణంపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఏప్రిల్‌లో ధరల పెరుగుదలపై ఆందోళన చేపట్టాలని ఈ భేటీలో నిర్ణయించారు. ఏప్రిల్ 7న రాష్ట్రాల రాజధానుల్లో నిరసనలతో పాటు థాలీ బజావో పేరిటా నిరసనలకు పిలుపు ఇచ్చింది కాంగ్రెస్. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ త్వరలో పూర్తి కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత.. కాంగ్రెస్ పార్టీ గడ్డు స్థితిని ఎదుర్కొంటోంది. వరుసగా ఎన్నికల్లో ఓటమి పాలవుతూ వస్తోంది. ముఖ్యంగా తాజా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. పంజాబ్‌లో అధికారాన్ని సైతం కోల్పోయి.. అధికార రాష్ట్రాల సంఖ్యను 2కి చేర్చుకుంది. ఈ తరుణంలో.. సీనియర్ల రెబల్ గ్రూప్ జీ23 విమర్శలు ఎక్కుపెట్టడంతో ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పలు రాష్ట్రాల ఇన్‌ఛార్జిల మార్పునకు పచ్చాజెండా ఊపగా.. పూర్తి మార్పులను అతి త్వరలోనే ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment