Congress Is Planning To Give More Seats To BCs In Telangana - Sakshi
Sakshi News home page

TS: కాంగ్రెస్‌ కొత్త ప్లాన్‌.. కర్ణాటక తరహాలో వారికి ఎక్కువ సీట్ల కేటాయింపు!

Published Sun, Jun 4 2023 7:44 AM | Last Updated on Sun, Jun 4 2023 11:53 AM

Congress Is Planning To Give More Seats To BCs In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాల ఓట్లను రాబట్టుకునే దిశలో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమవుతోంది. కర్ణాటక తరహాలో తెలంగాణలో కూడా కులాల ప్రాతిపదికన ఓట్ల సమీకరణ జరుగుతుందన్న అంచనాల మేరకు రాష్ట్రంలో పార్టీకి చెందిన బీసీ నేతలకు వీలైనన్ని ఎక్కువ టికెట్లు కేటాయించాలని భావిస్తోంది. 

టికెట్ల కేటాయింపుతోపాటు విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీ వర్గాల రిజర్వేషన్లను 40 శాతానికి పెంచాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇటీవల జరిగిన టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో ఈ అంశంపై చర్చించిన కాంగ్రెస్‌ కీలక నేతలు 40 శాతం రిజర్వేషన్ల పెంపునకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని పార్టీ మేనిఫెస్టోలో చేరుస్తారని సమాచారం. ఇదే అంశంపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే ఇటీవల విలేకరులతో ఇష్టాగోష్టి మాట్లాడుతూ రిజర్వేషన్ల పెంపు అంశంపై చర్చిస్తున్నామని, కర్ణాటక తరహాలోనే జనాభా ప్రాతిపదికన టికెట్ల కేటాయింపుపై కూడా అధిష్టానం స్థాయిలో చర్చ లు జరుగుతున్నాయని చెప్పారు. 

బీసీలకు 50 శాతం టికెట్లు ఇవ్వాలన్న అంశం ప్రధానం కానుందన్నారు. బీసీ వర్గాలకు రిజర్వేషన్ల పెంపు, టికెట్ల కేటాయింపుతోపాటు ఇతర వర్గాల ప్రజలకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చలు జరుగుతున్నా యని చెప్పారు. త్వరలోనే మేనిఫెస్టో కమిటీ ఏర్పా టు చేస్తామని, ఇది విస్తృతంగా చర్చించి టీపీసీసీ ఆమోదంతో పార్టీ హామీలను మేనిఫెస్టోలో చేరుస్తుందని కూడా ఆయన పేర్కొనడం గమనార్హం.  

ప్రభుత్వ అప్పులను ఎజెండాగా.. 
ప్రచారంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులను కూడా కాంగ్రెస్‌ ఒక ఎజెండాగా తీసు కోనుంది. తక్కువ కాలంలో బీఆర్‌ఎస్‌ చేసిన అప్పులు, వాటి వినియోగంపై ప్రజల్లో విస్తృతంగా చర్చించేలా కార్యక్రమాలు రూపొందించనుంది. దీంతోపాటు తెలంగాణ సెంటిమెంట్‌ను కూడా వినియోగించుకోవాలని యోచిస్తోంది. తెలంగాణ ఇచి్చన పార్టీగా గత 2 ఎన్నికల్లోనూ ప్రజలు ఆదరించని పరిస్థితుల్లో ఈసారి ఎన్నికల్లో భాగంగా తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్‌ పాత్రను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన రోజున జరిగిన నాటకీయ ఘటనలు, అప్పటి పార్టీ ఎంపీల పాత్ర, బీఆర్‌ఎస్‌ క్రియాహీనతలాంటి అంశాలు ప్రస్ఫుటమయ్యేలా వీడియోలు రూపొందించి గ్రామగ్రామాన ప్రచారం నిర్వహించే బాధ్యతలను మాజీ ఎంపీలకు అప్పగించారు. 

సూర్యాపేటలో సభ..
సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్‌మార్చ్‌ పాదయాత్ర ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో సాగుతోంది. ఈ యాత్ర ఒకట్రెండు రోజుల్లో నల్లగొండ జిల్లా లో ప్రవేశించనుంది. ఉమ్మడి నల్లగొండలో 10 రోజులకుపైగా యాత్ర నిర్వహించనున్న సందర్భంగా నల్లగొండ, సూర్యాపేటల్లో రెండు భారీ సభలకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

సూర్యాపేట సభకు కాంగ్రెస్‌పాలిత రాష్ట్రాల బీసీ ముఖ్యమంత్రులను ఆహా్వనించి ఆ సభలోనే రైతు, యువ డిక్లరేషన్‌ల తరహాలో బీసీ డిక్లరేషన్‌ చేయాలని భావిస్తున్నారు. ఈ సభ నిర్వహణ బాధ్యతలను మాజీ ఎంపీ వి.హనుమంతరావుకు అప్పగించనున్నారు. ఆ తర్వాత పీపుల్స్‌మార్చ్‌ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఈనెల 20–25 తేదీల మధ్య ఖమ్మంలో భారీ సభ నిర్వహించి ఆ సభకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాం«దీని ఆహా్వనించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రియాంక షెడ్యూల్‌ కూడా దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. 

ఇది కూడా చదవండి: ‘గులాబీ’కి చికాకు తెప్పిస్తున్నారా?.. బీఆర్ఎస్‌ ప్లాన్ ఏంటి?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement