
సాక్షి ప్రతినిధి కాకినాడ: యువత ఆవేశాన్ని ప్యాకేజీలతో సొమ్ము చేసుకుంటూ రాష్ట్రంలో అశాంతికి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా ధ్వజమెత్తారు. కాపులను మూడోసారి మోసం చేసి చంద్రబాబుకు గంపగుత్తగా అమ్మేందుకు సిద్ధంగా ఉన్న పవన్ నిజస్వరూపాన్ని కాపు అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు గుర్తించాలని, ఆయనకు యువత దూరంగా ఉండాలని హితవు పలికారు.
మంత్రి సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. పవన్ మాటలు విని ఒక్క కాపు కులస్తుడైనా చంద్రబాబుకు సహకరిస్తే రంగా ఆత్మ క్షోభిస్తుందని అన్నారు. రంగా హత్యలో ప్రధాన ముద్దాయి చంద్రబాబేనని, కాదని బాబు చెప్పగలరా అని ప్రశ్నించారు. రంగా హత్య జరిగినప్పుడు అనేక మంది కాపులపై కేసులు పెట్టి, సంవత్సరాలుగా కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని అన్నారు. నాడు ముద్రగడ పద్మనాభంను పలకరించడానికి దాసరి, చిరంజీవి వస్తే చంద్రబాబు ఆదేశాలతో ఎయిర్‌పోర్టులో ఆపేశారని తెలిపారు.
అందుకు భిన్నంగా నేడు పవన్ కల్యాణ్‌ను పూర్తి భద్రతతో నేరుగా హోటల్‌లో దింపారని చెప్పారు. అదే చంద్రబాబుకు, వైఎస్ జగన్‌కు తేడా అని అన్నారు. ఆకలి కేకలతో కోనసీమ మహిళలు రోడ్డెక్కితే చంద్రబాబు కేసులు పెట్టి వేధించిన విషయం మరచిపోవద్దన్నారు. వారిపై అన్యాయంగా చంద్రబాబు పెట్టిన కేసులను జగన్ సీఎం అయ్యాక మానవతా దృక్పథంతో ఎత్తేశారని తెలిపారు.
గవర్నర్ వద్దకు వెళ్లి పవన్ ఏమి చెబుతారని నిలదీశారు. ‘సీఎం జగన్ సంక్షేమ పాలనతో చంద్రబాబుకు దిక్కు లేకుండా పోయింది. నీవే బాబు చేతిలో పావుగా మారి రాష్ట్రంలో అశాంతికి కారణమవుతావని, బ్రోకర్లకు అమరావతి రాజధాని కావాలని చెబుతావా..’ అని నిలదీశారు. విశాఖ గర్జనలో కోట్లాది ప్రజల ఆకాంక్ష ప్రస్ఫుటమైందని అన్నారు. లక్షలాది ప్రజలు భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చి వికేంద్రీకరణకు మద్దతిచ్చారని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ కూడా అమరావతిలో శాసన రాజధాని ఉండాలని కోరుకుంటున్నారని తెలుసుకోవాలన్నారు.