బీఆర్‌ఎస్‌పై డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఫైర్
ఖమ్మంవన్‌టౌన్/సాక్షిప్రతినిధి, ఖమ్మం: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ స్ఫూర్తితో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యయుతంగా పాలన అందిస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అసమానతలు, అంతరాలు లేకుండా రాజ్యాంగం అనే గ్రంథాన్ని దేశానికి అందించిన మహనీయుడు అంబేడ్కర్ అని కొనియాడారు.
ఆదివారం ఆయన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, గత బీఆర్‌ఎస్ పాలకులు యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ప్లాంట్‌ల వ్యయాన్ని అపరిమితంగా పెంచారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలను పెంచి రాష్ట్రంలో విపరీతమైన ఆర్థిక దోపిడీకి కల్వకుంట్ల కుటుంబం తెరలేపిందని ఆరోపించారు. రూ.లక్ష కోట్లతో అనాలోచితంగా నిర్మించిన కాళేశ్వరం ఇప్పుడు నిరుపయోగంగా మారిందన్నారు.
అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని తమ చేతిలో పెడితే, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టుకుంటూ ఒక్కొక్కటిగా సంక్షేమ ఫలాలను పేదలకు అందిస్తున్నామని వివరించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకపాలనను అందించిన పార్టీలకు గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం కాంగ్రెస్ కార్యాలయంలో ‘గ్రీవెన్స్’
తమ పార్టీ కార్యకర్తల సదుపాయంకోసం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ప్రతి ఆదివారం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కాంగ్రెస్ కార్యకర్తల నుంచి విజ్ఞప్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ సమయంలో తన దృష్టికి తెచ్చే సమస్యలను నోట్ చేయించను న్నట్లు చెప్పారు. పార్టీ శ్రేణుల సమస్యలు ఏమి ఉన్నా స్వయంగా వినేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment