ముంబై: మహారాష్ట్రలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు అధికార మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యసభ ఎన్నికల్లో తమ కూటమి అభ్యర్థిని ఎంవీఏ గెలిపించుకోలేకపోయింది. బీజేపీ మూడు స్థానాల్లో విజయకేతనం ఎగురువేసి అధికార పక్షానికి గట్టి షాక్ ఇచ్చింది. ఎంవీఏ కూటమిలోని కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన తలొక సీట్ దక్కించుకున్నాయి.
ఎవరెవరికి ఎన్ని ఓట్లు?
ఆరో స్థానానికి జరిగిన పోటీలో బీజేపీకి చెందిన ధనంజయ్ మహాడిక్.. శివసేన అభ్యర్థి సంజయ్ పవార్‌పై విజయం సాధించారు. అధికార, విపక్షాల ఆరోపణలు, ప్రత్యారోపణల నేపథ్యంలో ఓట్ల లెక్కింపు ఎనిమిది గంటల ఆలస్యంగా ప్రారంభమైంది. శనివారం తెల్లవారుజామున ఫలితాలు వచ్చాయి. ఒక అభ్యర్థి గెలవడానికి 41 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. బీజేపీ నుంచి గెలిచిన పియూష్ గోయల్, డాక్టర్ అనీల్ బోండేలకు 48 ఓట్ల చొప్పున వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి ఇమ్రాన్ ప్రతాప్‌ఘరీకి 44, ఎన్సీపీ అభ్యర్థి ప్రఫుల్ పటేల్‌కు 43 ఓట్లు, శివసేన అభ్యర్థి సంజయ్ రౌత్ 41 దక్కించుకున్నారు. ధనంజయ్ మహాడిక్ 41.56 ఓట్లతో విజయం సాధించారు.
బీజేపీ విజయం చాలా చిన్నది
ఆరో స్థానంలో పోటీ చేసిన ధనంజయ్ మహాడిక్ గెలిచారని తాము భావించడం లేదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. తమ అభ్యర్థి సంజయ్ పవార్‌కు 33 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయని, మహాడిక్ 27 ఓట్లు మాత్రమే తెచ్చుకున్నారని వెల్లడించారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో బీజేపీ అభ్యర్థి గట్టెక్కారని ఎద్దేవా చేశారు. బీజేపీ విజయం చాలా చిన్నదని వ్యాఖ్యానించారు.
ట్రైలర్ మాత్రమే.. సినిమా ముందుంది..
రాజ్యసభ ఎన్నికల ఫలితాలపై బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తనదైన శైలిలో స్పందించారు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని అసలు సినిమా ముందు ఉందని వ్యాఖ్యానించారు. హనుమాన్ చాలీసాను అవమానించిన వారు ఓడిపోయారని.. దానిని గౌరవించి, దాని కోసం పోరాడిన వారు గెలిచారని అన్నారు. ‘ఎన్నికలు కేవలం పోరాటం కోసమే కాదు గెలుపు కోసమే. జై మహారాష్ట్ర’ అంటూ ట్వీట్ చేశారు. శివసేన నుంచి గెలిచిన సంజయ్ రౌత్ కంటే ఆరో స్థానంలో విజయం సాధించిన తమ అభ్యర్థికే ఎక్కువ ఓట్లు వచ్చాయని వెల్లడించారు. (క్లిక్: బీజేపీ ఎమ్మెల్యే సస్పెండ్.. ఎందుకో తెలుసా..?)
ఫడ్నవీస్‌కు పెద్దాయన ప్రశంస
రాజ్యసభ ఎన్నికల్లో దేవేంద్ర ఫడ్నవీస్ అద్భుతం చేశారని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రశంసించారు. స్వతంత్ర ఎమ్మెల్యేలను ప్రత్యర్థి శిబిరాల నుండి ‘విభిన్న మార్గాల’ ద్వారా దూరం చేసి ‘అద్భుతం’ చేశారని కొనియాడారు. ఆరో స్థానంలో శివసేన అభ్యర్థి ఓడిపోడం తనకు ఆశ్చర్యం కలిగించలేదని పేర్కొన్నారు. సంఖ్యా బలం లేకపోయినప్పటికీ ఆరో సీటును గెలవడానికి తమ కూటమి సాహసోపేతమైన ప్రయత్నం చేసిందన్నారు. అయితే తమ కూటమి నుంచి ఒక్క ఓటు కూడా బీజేపీకి పడలేదని, స్వతంత్రులను బీజేపీ తమవైపు తిప్పుకోవడం వల్లే విజయం సాధ్యమైందని వెల్లడించారు. రాజ్యసభ ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలోని ఎంవీఏ ప్రభుత్వ స్థిరత్వాన్ని ప్రభావితం చేస్తాయా అన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు జవాబిస్తూ.. అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాదని శరద్ పవార్ స్పష్టం చేశారు. (క్లిక్: బీజేపీకి బూస్ట్.. కాంగ్రెస్‌కు ఊహించని షాక్)
Comments
Please login to add a commentAdd a comment