సాక్షి, చెన్నై: తమిళనాడులో మంత్రి సెంథిల్ బాలాజీ వ్యవహారం వేడి చల్లారకముందే.. మరో మంత్రిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ టార్గెట్ చేసింది. సోమవారం ఉదయం చెన్నైలోని తమిళనాడు ఉన్నతవిద్యాశాఖ మంత్రి పొన్ముడి ఇంటిలో, ఆఫీసులు.. మొత్తం మూడు ప్రాంతాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి.
మంత్రి పొన్ముడితో పాటు ఆయన తనయుడు గౌతమ్ సిగమణి ఇంటా, ఆఫీసుల్లోనూ సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలోనే ఈ సోదాలు జరుగుతున్నట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి.
2007-11 మధ్య పొన్ముడి గనుల శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో గనుల లైసెన్స్‌లను నిబంధనలకు విరుద్ధంగా మంజూరు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు అడ్డగోలు రేటుకు ఇసుక అక్రమ రవాణాకు పాల్పడినట్లు తేలింది. ఈ వ్యవహారంలో ఆయన తనయుడు గౌతమ్ సహ నిందితుడిగా ఉన్నాడు. ఇదిలా ఉంటే.. మంత్రి పొన్ముడి వ్యవహారంపైనా విపక్ష బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది.
రాజకీయాల్లోకి రాకముందు పొన్ముడి విల్లాపురం ప్రభుత్వ కళాశాలలో ప్రొఫెసర్‌గా పని చేశారు. తమిళనాడు అసెంబ్లీకి ఐదు సార్లు ఎన్నికయ్యారాయన.
ఇదిలా ఉంటే.. అవినీతి ఆరోపణల కేసులో ఊరట కోసం పొన్ముడి మద్రాస్ హైకోర్టును జూన్ నెలలో ఆశ్రయించారు. అయితే కోర్టులో ఆయనకు ఉపశమనం దక్కలేదు.
2011-15 మధ్య అన్నాడీఎంకే ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా పని చేసిన వీ సెంథిల్ బాలాజీ.. క్యాష్ ఫర్ జాబ్స్ స్కాంలో ఇన్‌వాల్వ్ అయ్యారు. దీంతో డీఎంకే ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న ఆయన నివాసాలు, ఆఫీసులపై జూన్ నెలలో ఈడీ తనిఖీలు చేపట్టి.. మనీల్యాండరింగ్ ఆరోపణలపై అరెస్ట్ చేసింది కూడా.
Comments
Please login to add a commentAdd a comment