ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంపై కృత్రిమ వ్యతిరేకతను సృష్టించడానికి ఈనాడు మీడియా పడరాని పాట్లు పడుతోంది. వీరు ఇచ్చే వార్తా కథనాలను గమనిస్తేనే అర్ధం అవుతుంది. జగన్ ఏపీలో ఎంత బలంగా ఉన్నది. ప్రజలు ఆయనను ఆదరిస్తున్నారన్న అక్కసుతో ఈ మీడియా విపరీతంగా విషం కక్కుతోంది. ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలపై ఈ మీడియా పగబట్టి దాడి చేస్తోంది.
కొద్ది రోజుల క్రితం అరాచకాల అడ్డా.. వైకాపా.. అంటూ నానా చెత్త అంతా రాసిపారేసింది. ఆ తర్వాత ఎస్టీ, ఎస్టీల హత్యలు జరుగుతున్నాయని ఒక స్టోరీని వండింది. ఇలా చేయడం మొదటి సారి కాదు. ప్రతి వారానికి, పది రోజులకు అదే పనిలో ఉంటోంది. పాడింది పాడరా పాసిపళ్ల దాసుడా అన్నట్లు రాసిందే రాయరా రామోజీ అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. తద్వారా తమ పరువు తాము తీసుకోవడానికి సిగ్గుపడకపోవడమే ఇందులో ప్రత్యేకత. ప్రస్తుతం ఈనాడు మీడియాలో పనిచేయడమే పెద్ద పనిష్‌మెంట్ అనుకునే పరిస్థితి వచ్చిందని అంటున్నారు.
ఒకప్పుడు విలువలు, పద్దతులు అని ప్రచారం చేసిన ఈనాడు ఇప్పుడు అన్నిటిని వదలివేసి కేవలం తెలుగుదేశం కరపత్రిక మాదిరి మారడం ఏ జర్నలిస్టుకు మాత్రం నచ్చుతుంది? అటు యాజమాన్య ఒత్తిడికి ఏదో ఒక చెత్త రాయలేక, ఇటు ఆత్మను చంపుకోలేక ఈనాడు జర్నలిస్టులు సతమతమవుతున్నారన్న అభిప్రాయం కలుగుతుంది. తమకు ఇలా వార్తలు ఇవ్వడం సఫకేషన్‌గానే ఉందని ఈనాడు మీడియా మిత్రులు వాపోతున్నారని తెలిసింది. అయినా రామోజీ మాత్రం తగ్గడం లేదట. ఇంకా జగన్‌పై రాయాల్సిందేనని పట్టుబడుతున్నారని ప్రచారం జరుగుతోంది.
దాంతో ఉన్నవి, లేనివి కలిపి పచ్చి అబద్దాలైనా సరే రాసి రామోజీని సంతృప్తిపరచవలసి వస్తోంది. అందులో భాగంగానే అరాచకాల అడ్డా వైకాపా అనే చండాలపు వార్తను కొద్ది రోజుల క్రితం రాసింది. దీనిపై సోషల్ మీడియాలో ఒక జర్నలిస్టు మిత్రుడు ఆసక్తికరమైన విశ్లేషణ చేస్తూ ఈనాడు తీరును తప్పుపట్టారు. ఈనాడు పత్రిక ఇంత అడ్డగోలు కారుకూతలు రాస్తున్నా, నిజంగానే బీహారు మాదిరి పరిస్థితి ఇక్కడ ఉంటే వీళ్లు బతికి ఉండేవారా అని ఆయన ప్రశ్నించారు. ఒకసారి నితీష్, మమత పాలన అద్భుతమని రాస్తుంటారని, మరోసారి అక్కడ అధ్వాన్న మని అంటారని ఆయన అన్నారు.
ఒక ఐపీఎస్ అధికారిపై ఎంపీ, ఎమ్మెల్యేలు చంద్రబాబు టైమ్‌లో దాడి చేస్తే అసలు కేసే పెట్టలేదు. ఒక టీడీపీ ఎమ్మెల్యే ఎంఆర్.ఓ వనజాక్షిపై దౌర్జన్యం చేసినప్పుడు ఈ పత్రిక ఏమి రాసింది? కొన్ని కేసులలో, ఫ్యాక్షనిష్టు డబ్బు పంపిణీ వ్యవహారాలలో చంద్రబాబే ముఖ్యమంత్రి హోదాలో ఉండి రాజీలు చేసిన సందర్భాలను కూడా ఆయన గుర్తు చేశారు. అనాడు జరిగినవన్నీ దేశోద్దరణ అవుతుందా? ఏదో రకంగా భయభ్రాంతులు క్రియేట్ చేయడం కోసమే ఇలా రాస్తున్నారని ఆ ఇండిపెండెంట్ విశ్లేషకుడు వ్యాఖ్యానించారు.
రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈనాడు పేపర్ చదివేవారిలో, ఈటివి చూసేవారిలో ఇలాంటి అభిప్రాయమే కలుగుతోందని అంటున్నారు. అందువల్లే ఈనాడు సర్కులేషన్ కూడా తగ్గుతోందని, ప్రజలు రోజూ వీరి గోల చూసి భరించలేకపోతున్నారని చెబుతున్నారు. అయినా రామోజీరావు కసి, కక్ష నానాటికి పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదట. మార్గదర్శి చిట్ పండ్ కేసులో రామోజీ, ఆయన కోడలు శైలజతో పాటు కొందరు సిబ్బందిని నిందితులుగా చేర్చిన నేపథ్యంలో ఈనాడు మీడియా మరింతగా రెచ్చిపోతోందన్న అభిప్రాయం కలుగుతోంది. అక్కడికి మార్గదర్శికి మద్దతుగా అప్పుడప్పుడు పేజీలకొద్ది వార్తలు రాసుకుంటున్నా వారు ఆశించిన సపోర్టు ప్రజల నుంచి రావడం లేదు. దాంతో ఏమి చేయాలో తోచక వైసీపీ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి జగన్‌పై అరాచకంగా వార్తలు ఇస్తున్నారు.
ఏ ప్రభుత్వంలో నేరాలు జరిగినా అంగీకరించరు. అన్ని నేరాలు ప్రభుత్వంలోనివారి ప్రమేయంతో జరగవు. ఎక్కడ ఏది జరిగినా అదంతా వైసీపీవారికి, ప్రభుత్వానికి అంటగట్టి ఈనాడు కాని, ఆంధ్రజ్యోతి, టివి 5 వంటివి ఆత్మ సంతృప్తి చెందుతున్నాయి. వెంటనే చంద్రబాబు అందుకుంటారు. ఈ మధ్య జూనియర్ ఎన్.టి.ఆర్. అభిమాని ఒకరు ఏదో కారణం వల్ల ఆత్మహత్య చేసుకున్నారు. అంతే! దొరికిందే చాన్స్ అని చంద్రబాబు దానిని వైసీపీకి అంటకట్టారు. తీరా సంబంధిత వీడియోలు బయటపడడంతో కిక్కురుమనలేదు. రామోజీ రావు ఇంతకాలం గాజుభవంతి లో కూర్చుని ఎవరిపై దాడి చేసినా ఎవరికివారు ఎందుకులే ఆయనకు మీడియా ఉందని సరిపెట్టుకున్నారు.
నాలుగేళ్లుగా రామోజీ మీడియా వేధింపులు భరిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి మార్గదర్శి కేసు చిక్కింది. అందులో ప్రజల డబ్బును ఎలా అక్రమంగా తమ వేరే వ్యాపారాలకు మళ్లిస్తున్నది వెల్లడైంది. దాంతో రామోజీపై ఆయన కోడలిపైన, మార్గదర్శి ఫోర్ మెన్, మేనేజర్లు, ఆడిటర్లపై కేసులు వచ్చాయి. గతంలో జగన్‌పై అక్రమంగా పెట్టిన కేసులను పట్టుకుని ఎ1, ఎ2 అని వ్యంగ్యంగా రాస్తుండేవారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఇతర టీడీపీ నేతలు అలాగే అంటుండేవారు. పరిస్థితులు మారాయి. ప్రస్తుతం మార్గదర్శి కేసులో రామోజీ, శైలజలే ఎ1, ఎ2 ముద్దాయిలుగా బోనులో నిలబడే పరిస్థితి తెచ్చుకున్నారు.
అలాగే జగన్ కంపెనీల ఆస్తులు సుమారు 1100 కోట్లను సీబిఐ జప్తు చేసినప్పుడు ఈనాడు ఎంతో సంబరపడిపోయి, ఉన్నవి, లేనివి రాసేసేది. ఇప్పుడు దాదాపు అంతే మొత్తంలో రామోజీ ఆస్తులు కూడా జప్తునకు గురయ్యాయి. అయితే ఇప్పుడు జరుగుతున్నది కక్ష అని, తాము జగన్‌పై రాస్తున్నాము కనుక ఇలా దాడి చేస్తున్నారని ఈనాడులో కథనాలు ఇచ్చుకుంటున్నారు. మరి జగన్ కేసులన్ని వాస్తవమైనవి అన్నట్లు ఇప్పటికీ తీర్పులు ఇచ్చేస్తూ ఈనాడు మీడియా ప్రచారం చేస్తుంటుంది కదా!. తమ మీద రాస్తే మాత్రం మీడియా ట్రయల్స్ అట.
చదవండి: జగన్ క్లీన్ దెబ్బ.. పవన్ విలవిల.. అందుకే అలా..
ఎదుటివారిపై దాడులు జరిగితే అదంతా కరెక్టు, తమ అక్రమాలు బయటపెడితే మాత్రం అది కక్ష అని చెబుతున్నారు. అంతే తప్ప ఏపీ సీఐడి అడిగిన ప్రశ్నలకు స్పష్టంగా జవాబులు ఇవ్వలేకపోతున్నారు. అద్దాల మేడలో కూర్చుని రాళ్లు వేద్దామనుకుంటే అన్నివేళలా కుదరదని ఈ అనుభవం రుజువు చేస్తుంది. ఈనాడు బేసిక్ గా పద్దతిగా వార్తలు ఇచ్చి ఉంటే ఇన్ని విమర్శలకు గురి అయ్యేది కాదు. అలాగే మార్గదర్శిలో అక్రమ డిపాజిట్లు తీసుకోకుండా ఉంటే రామోజీకి ఇన్ని కష్టాలు వచ్చేవి కావు. దీనినే స్వయంకృతాపరాధం అని అంటారు. ఎవరి అధికారం కోసమో తాపత్రయపడి, చివరికి తన విలువను తానే కోల్పోవడం , ప్రజలలో పలచన అవడం వల్ల ఏమి ప్రయోజనం అన్న సంగతి ఇప్పటికైనా ఈనాడు మీడియా గమనిస్తే మంచిది.
మరో విషయాన్ని కూడా ప్రస్తావించాలి. ఏపీలో ఓట్ల నమోదు గురించి కూడా ఒక పెద్ద సంపాదకీయం రాశారు. గత కొద్ది రోజులుగా ఈనాడు మెయిన్ పేజీలో వచ్చిన నిజమైన వార్తలో, తప్పుడు వార్తలో.. వాటి ఆధారంగా రాసిన సంపాదకీయం. దాని సారాంశం ఏమిటంటే టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల బోగస్ ఓట్లు తొలగిస్తే అది అక్రమమట. అదే వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నచోట ఎక్కడైనా అదనపు ఓట్లు ఉంటే బోగస్ ఓట్లను ప్రోత్సహించడమట. ఏ పత్రిక అయినా ఏమని చెప్పాలి. ఏ పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గం అయినా బోగస్ ఓట్లు లేకుండా చూడాలని, నిజమైన ఓటర్ కు ఓటు హక్కు ఉండాలని కదా కోరుకోవాలి. అలా కాదట. వారు రాస్తే బోగస్ ఓట్లు, వారు రాస్తే నిజమైన ఓట్లు తీసేసినట్లట.
గత టరమ్‌లో చంద్రబాబు టైమ్‌లో కొందరు సేవామిత్రల పేరుతోనో, మరో పేరుతోనో ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలు తెలుసుకుని వారు టీడీపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తారని అనిపిస్తే వెంటనే తీసివేస్తున్న విషయాన్ని అప్పట్లో వైసీపీ నేత బొత్స సత్యనారాయణ వెల్లడిచేశారు. ఆ క్రమంలోనే డేటా చౌర్యం కేసు కూడా వెలుగులోకి వచ్చింది. అవన్ని ఎందుకు! ఈనాడు వారు ఆరాధించే చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పంలో సుమారు 30 వేల బోగస్ ఓట్లు ఉన్నట్లు గతంలో ఆరోపణలు రాలేదా?
సరిహద్దున ఉన్న తమిళనాడుకు చెందినవారిని కూడా ఓటర్లుగా చేర్చిన ఘనత కూడా పొందారు కదా! అందులో గత టరమ్ లోనే రిటైర్డ్ ఐఎఎస్ అధికారి చంద్రమౌళి పోరాడి పదిహేడువేల బోగస్ ఓట్లను తొలగించేసరికి తల ప్రాణం తోకలోకి వచ్చింది కదా! ఆ సంగతి ఎప్పుడైనా ఈనాడు రాసిందా? ఈ ప్రభుత్వం వచ్చాక కుప్పంలో ఓటర్ల జాబితాను శుద్ది చేసే క్రమంలోఅనేక బోగస్ ఓట్లను కనుగొన్నారన్న వార్తలు వచ్చాయి.
చంద్రబాబు నాయకత్వంలో బోగస్ ఓట్లు చేర్చితే అదంతా వ్యూహం, అదే జగన్ చేసినా, చేయకపోయినా కుట్ర అని ఈనాడు దిక్కుమాలిన ప్రచారం. ఇదంతా దేనికి.. వచ్చే ఎన్నికలలో జగన్‌ను ఓడించడం అసాధ్యమని తెలిసి, ఎలాగైనా ఆయన ప్రభుత్వాన్ని బదనాం చేయాలన్న దుష్ట తలంపుతోనే ఈనాడు మీడియా అడ్డగోలు వార్తలు, సంపాదకీయాలు రాస్తోంది. ప్రజస్వామ్యాన్ని ఓడించి అయినా తాను గెలిచి తీరాలనుకునే జగన్ కుట్రలు నెగ్గితే ప్రజాకాంక్షలు కరిగిపోతాయని రామోజీ అన్నారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన జగన్‌ను ఎలాగైనా గద్దె దించాలని కుట్రలు చేస్తున్న రామోజీకి, మరోసారి జగన్ గెలిస్తే తన పప్పులుడకవన్నదే అసలు బాధ అన్న విషయాన్ని ప్రజలు ఇప్పటికే పసికట్టారు.
-కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment