
స్ట్రాంగ్ రూమ్ వద్ద బైనాక్యులర్‌తో చూస్తున్న యోగేశ్ వర్మ (ఏఎన్‌ఐ ఫొటో)
మీరట్: దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు యోగేశ్ వర్మ మాత్రం బైనాక్యులర్‌తో చూస్తున్నారు. నమ్మలేకపోతున్నారా? కానీ ఇది నిజం.
ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ఎదుట యోగేశ్ వర్మ, ఆయన మద్దతుదారులు గస్తీ కాస్తున్నారు. బైనాక్యులర్‌తో కనిపెట్టి మరీ చూస్తున్నారు. 8 గంటల చొప్పున షిప్టులవారీగా 24 గంటలూ కాపలా కాస్తున్నారు. ఎటువంటి అక్రమాలు జరగకుండా చూసేందుకే ఈ ఏర్పాట్లు చేసినట్టు ఆయన మద్దతుదారులు చెబుతున్నారు.
సొంతంగా భద్రత ఏర్పాటు చేయడంపై యోగేశ్ వర్మను ప్రశ్నించగా.. ఎన్నికల సంఘంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, ప్రజల తీర్పును జాగ్రత్తగా కాపాడాలన్న ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నట్టు తెలిపారు. ‘ఈవీఎం స్ట్రాంగ్ రూమ్, దాని చుట్టూ ఉన్న ఇతర కదలికలపై నిఘా ఉంచాలని మా పార్టీ అధ్యక్షుడు (అఖిలేష్ యాదవ్) ఆదేశించారు. ఎగ్జిట్ పోల్స్‌పై మాకు నమ్మకం లేదు, అఖిలేష్ యాదవ్ సీఎం అవుతారు. మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామ’ని యోగేశ్ వర్మ అన్నారు. (క్లిక్: ఏం జరగబోతోంది.. యోగికి మళ్లీ పట్టం కడతారా?)
తాజా ఎన్నికల్లో మీరట్ జిల్లాలోని హస్తినాపూర్ నుంచి సమాజ్‌వాదీ పార్టీ తరపున ఆయన పోటీ చేశారు. కాగా, ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ వద్ద యోగేశ్ వర్మ ఓవరాక్షన్‌పై ప్రత్యర్థి పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. (క్లిక్: మొదలైన నంబర్ గేమ్; ఎత్తుకు పైఎత్తులు.. ఎవరిది పైచేయి!)
Comments
Please login to add a commentAdd a comment