సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈనెల 14న బీజేపీలో చేరికకు సంబంధించి ముహూర్తం ఖరారు కావడంతో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేసిన ఈటల.. అసెంబ్లీ కార్యదర్శికి రాజీనామాపత్రం సమర్పించారు. ముందుగా ఈటల రాజేందర్ శనివారం ఆయన అనుచరులతో కలసి అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కులోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు.
కేసీఆర్ నియంతృత్వ పాలనకు ఘోరీ కడతా..
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేశానని తెలిపారు. కేసీఆర్ నియంతృత్వ ధోరణి అవలంభిస్తున్నారని మండిపడ్డారు. హుజూరాబాద్‌లో జరిగే ఎన్నికలు కురుక్షేత్రమేనన్నారు. కేసీఆర్ దగ్గర రూ.వందల కోట్లు ఉన్నాయని, అధికార దుర్వినియోగం చేసి ఉపఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ నియంతృత్వ పాలనకు ఘోరీ కట్టడమే తన అజెండా అని అన్నారు. హుజూరాబాద్‌లో గెలిచి ఆత్మగౌరవాన్ని నిలబెడతానని ఈటల తెలిపారు.
తమ సహచరులను అడ్డుకున్నారు..
అసెంబ్లీ కార్యదర్శికి రాజీనామాపత్రం సమర్పించిన అనంతరం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ, అసెంబ్లీ గేట్ వద్ద తమ సహచరులను అడ్డుకున్నారని మండిపడ్డారు. ఏనుగు రవీందర్‌రెడ్డిని కూడా అనుమతించలేదన్నారు. కేసీఆర్ వెకిలి చేష్టలు, చిల్లర ప్రయత్నాలు మానుకోవాలని ఈటల ధ్వజమెత్తారు.
14న బీజేపీలో చేరిక..
ఈ నెల 14న రాష్ట్రానికి చెందిన బీజేపీ ముఖ్య నేతలతో కలసి ఈటల రాజేందర్ ఢిల్లీకి బయల్దేరి వెళ్తారు. అదేరోజు సాయంత్రం బీజేపీ అగ్రనేతలు అమిత్‌షా, జేపీ నడ్డా, తరుణ్ ఛుగ్ తదితరుల సమక్షంలో ఈటల రాజేందర్ ఆ పార్టీలో చేరుతారు. ఇటీవల రెండు రోజుల పాటు హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన ఈటల.. వర్షాల కారణంగా పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చాక హుజూరాబాద్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించేందుకు ఈటల షెడ్యూలు సిద్ధం చేసుకుంటున్నారు. కాగా, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ఛుగ్, రాష్ట్ర పార్టీ సీనియర్ నేతలు శుక్రవారం షామీర్‌పేటలోని ఈటల నివాసానికి వెళ్లి చర్చలు జరిపిన సంగతి తెలిసిదే.
చదవండి: Huzurabad: ఈటలను దెబ్బకొట్టేందుకు టీఆర్‌ఎస్ రోడ్‌మ్యాప్
టీఆర్‌ఎస్ ఎంపీ నామా ఇంటిపై ఈడీ దాడులు
Comments
Please login to add a commentAdd a comment