సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేరును సీఎం కేసీఆర్ పదే పదే ప్రస్తావించారు. డైట్ చార్జీలపై ఈటల సూచనలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఈటలను సంప్రదించి వివరాలు తీసుకోవాలని మంత్రి హరీష్‌రావుకు చెప్పారు.
అసెంబ్లీలో కేసీఆర్ తన పేరును ప్రస్తావించడంపై ఈటల రాజేందర్ స్పందించారు. తనను డ్యామేజ్ చేసే వ్యూహంతోనే కేసీఆర్ అలా మాట్లాడాని అన్నారు. రకరకాల పద్దతుల్లో మమ్మల్ని హేళన చేశారని పేర్కొన్నారు. ఈటల అనే వ్యక్తి కేసీఆర్ మెతక మాటలకు పడిపోడని స్పష్టం చేశారు. పలకరించుకుంటే, పక్కన కూర్చుంటే పార్టీలు మారే వ్యక్తిని కాదని అన్నారు.
పార్టీలు మారే కల్చర్ ఉన్న వ్యక్తిని కాదు
బడ్జెట్ సమావేశాల అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తాను బీఆర్‌ఎస్ పార్టీని వీడలేదని, వాళ్లే బయటకు పంపారని మరోసారి ఈటల గుర్తుచేశారు. తనపై వాళ్ళు చేసిన దాడి, ఖర్చు, పెట్టిన ఇబ్బంది ప్రజలు మర్చిపోలేదని అన్నారు. పార్టీలు మారే కల్చర్ ఉన్న వ్యక్తి తను కాదని.. మళ్ళీ పిలిచినా బీఆర్‌ఎస్‌లోకి వెళ్లనని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి తన స్టైల్ లో మాట్లాడారని.. భట్టి, అక్బరుద్దీన్ ఒవైసీ, జగ్గారెడ్డి పేర్లను కూడా అలానే పిలుస్తారని తెలిపారు.
ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తిట్టడమే టార్గెట్
‘నా 20ఏళ్ల రాజకీయ జీవితంలో బడ్జెట్ సమావేశాలు ఇంత తక్కువ పనిదినాలు జరగలేదు. సభలో అధికారపార్టీ సభ్యులకే మాట్లాడే అవకాశం ఇచ్చారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే మోదీపై తిట్ల పురాణం. బిల్లులు రాక స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చింది. సభలో ఎమ్మెల్యేలు స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి ఉండాలి.. అది లేదు. మందబలం ఉందని ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అవమానించడం, తిట్టడమే టార్గెట్‌గా సాగింది.
ముఖ్యమంత్రి, మంత్రులు సభలో చెప్పింది ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు ఉన్నవనేది వాస్తవం. 2లక్షల 90వేల కోట్ల బడ్జెట్‌లో 55వేల కోట్లు నిధులు బక్వాజ్ మాత్రమే. బడ్జెట్‌లో సగానికి పైగా లెక్కలు తప్పుల తడక. 2024 కేసీఆర్ తెలంగాణలో గెలవమనండి. దేశం తరువాత. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ రెడీగా ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది’ అని ఆశాభావం వ్యక్తం చేశారు.
చదవండి: కూల్చివేస్తామంటూ రేవంత్, సంజయ్ కామెంట్లు.. అసెంబ్లీలో సీరియస్ అయిన కేసీఆర్
Comments
Please login to add a commentAdd a comment