సాక్షి, తిరుపతి: రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయన జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయో అందరికీ తెలుసు. చంద్రబాబు తప్పులను ఎల్లో మీడియా దాచేస్తోంది. తమపై పని కట్టుకుని కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.
‘‘అసత్యాలు ప్రచారం చేసేవారిపై చర్యలకు సిద్ధమయ్యాం. ఇప్పటికే నోటీసులు అందించాం. త్వరలో పరువు నష్టం దావా వేస్తాం. నాకు కోర్టు నుంచి ఎలాంటి నోటీసులు అందలేదు.. అందితే కచ్చితంగా న్యాయపరంగా సమాధానం ఇస్తా’’ అని పెద్దిరెడ్డి చెప్పారు.
‘‘రెండు నెలల్లో ఆరోగ్యశ్రీకి 2500 కోట్ల రూపాయలు ప్రభుత్వం బకాయి పడింది. ఆరోగ్యశ్రీని కూడా చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రులను పీపీపీ పద్ధతిలోకి తీసుకొస్తామని చెప్పారు. రానున్న రోజుల్లో పేదలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఫీజు చెల్లించి వైద్యం తీసుకునే పరిస్థితి వస్తుందేమో’’ అంటూ పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment