పోలీసులతో వాదులాడుతున్న టీడీపీ నేతలు
గుడివాడ టౌన్: కృష్ణా జిల్లా గుడివాడలో నిజ నిర్ధారణ కమిటీ పేరుతో విజయవాడ నుంచి తెచ్చిన నాయకులతో రచ్చ చేయాలని చూసిన తెలుగుదేశం పార్టీ భంగపాటుకు గురైంది. కాసినో సాకుగా మంత్రి కొడాలి నానిని టార్గెట్ చేయాలన్న టీడీపీ ఎత్తుగడలు ఫలించలేదు. శుక్రవారం ఉదయం పట్టణంలోకి టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యులు చేరుకున్నప్పటికీ స్థానిక క్యాడర్ రాకపోవడంతో వారి ప్లాన్ బెడిసికొట్టింది. ప్రధానంగా గుడివాడ టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి రావి వెంకటేశ్వరరావు అనారోగ్య కారణాలతో నిజనిర్ధారణ కమిటీకి దూరంగా ఉన్నారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు రాంబాబు జాడ కనిపించలేదు. విజయవాడ నుంచి టీడీపీ నాయకులు వచ్చినట్లు తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నాయి. బెజవాడ రౌడీలు, టీడీపీ గూండాలు పట్టణం విడిచి పోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు ప్రతిఘటించడంతో ఉద్రిక్తత నెలకొంది.
రచ్చ చేసేందుకే..
సంక్రాంతి సందర్భంగా గుడివాడ పట్టణంలో పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని)కి చెందిన కే కన్వెన్షన్ కల్యాణ మండపంలో కాసినో నిర్వహించినట్లు టీడీపీ ఆరోపిస్తోంది. దీనిని నిర్ధారించే పేరుతో ఆ పార్టీ నాయకులు నక్కా ఆనంద్‌బాబు, కొనకళ్ల నారాయణ, వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, బొండా ఉమ, ఆలపాటి రాజేంద్ర, తంగిరాల సౌమ్యతో నిజనిర్ధారణ కమిటీని శుక్రవారం పట్టణానికి పంపింది. అయితే, అక్కడకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలెవరూ రాకపోవడంతో కమిటీ సభ్యులు చాలా సేపు గుడివాడలోని పార్టీ ఆఫీసులో కూర్చొన్నారు. ఫోన్లు చేసి స్థానిక నాయకులు, కార్యకర్తలు రావాలని కోరారు. అయినా, పార్టీ కార్యకర్తల నుంచి స్పందన రాలేదు. నిజ నిర్ధారణ కమిటీ పేరిట పట్టణంలో అలజడి సృష్టించడానికే టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. కే కన్వెన్షన్‌లో ఏ విధమైన జూద క్రీడలు జరగలేదని, తమ నేతను అప్రతిష్ట పాల్జేసేందుకు టీడీపీ నాయకులు కుట్ర చేస్తున్నారంటూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు నిరసన వ్యక్తంచేశారు. టీడీపీ నాయకులను తక్షణమే పట్టణం నుంచి పంపేయాలని డిమాండ్ చేశారు.
వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు మండలి హనుమంతరావు నేతృత్వంలో పార్టీ కార్యకర్తలు నాగవరప్పాడు వంతెన వద్ద లింగవరం రోడ్‌లో బైఠాయించారు. అనంతరం కొత్త మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకుని టీడీపీకి, చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బెజవాడ రౌడీలు, టీడీపీ గూండాలు పట్టణం విడిచి పోవాలంటూ డిమాండ్ చేశారు. ఈలోగా బయటి నుంచి వచ్చిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకొన్నారు. నిజనిర్ధారణ కమిటీని కల్యాణ మండపానికి వెళ్లనివ్వాలంటూ నినాదాలు చేస్తూ హైడ్రామాకు తెరలేపారు. ఇరువర్గాలు ఒకే చోటకు చేరడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు టీడీపీ నాయకులకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. వారు ససేమిరా అనడంతో నాయకులను అరెస్ట్ చేసి పెదపారుపూడి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం వైఎస్సార్సీపీ నాయకులను సైతం పోలీసులు అక్కడి నుండి పంపించివేశారు. బెజవాడ నుంచి వచ్చిన నేతలు కల్యాణ మండపం వరకు వెళ్లకుండానే వెనుదిరగాల్సి వచ్చింది.
కుట్రపూరితంగా వ్యవహరించిన టీడీపీ : ఏలూరు రేంజి డీఐజీ
ప్రజాస్వామ్యంలో వ్యక్తులకు ఉన్న స్వేచ్ఛను రాజకీయాలకు వాడుకోవాలని చూస్తే దుష్పరిణామాలు చోటుచేసుకుంటాయని ఏలూరు రేంజ్ డీఐజీ కె.వి.మోహన్‌రావు చెప్పారు. శుక్రవారం రాత్రి ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. టీడీపీ నాయకులు కుట్ర పూరితంగా వ్యవహరించారని అన్నారు. వారు ప్రజాస్వామ్యబద్ధంగా ఆరుగురితో నిజనిర్ధారణ కమిటీగా గుడివాడ వెళ్తామని కోరితే అనుమతి ఇచ్చిన మాట వాస్తవమేనన్నారు. కానీ వారు ఇచ్చిన మాటకు కట్టుబడలేదని చెప్పారు. కార్యకర్తలను పిలిపించి, ప్రభుత్వానికి, స్థానిక నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంలో కుట్ర ఉందని తెలిపారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే వారిలా చేసినట్లు తమకు అర్థమైందన్నారు. స్థానిక పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి శాంతి భద్రతలు అదుపు తప్పకుండా వ్యవహరించారని అభినందించారు.
టీడీపీ నేత వర్ల రామయ్య తనను గృహ నిర్భంధం చేయాలని ముందుగానే ఎందుకు కోరారని ప్రశ్నించారు. మరి కొందరు టీడీపీ నేతలు కూడా ముందుగానే అరెస్ట్ చేయాలని కోరారని, పోలీసులను అపఖ్యాతిపాలు చేసేందుకే ఇలా చేశారని చెప్పారు. రాజకీయాల కోసం శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. శుక్రవారంనాటి ఘటనలపై ఎస్పీ ఆధ్వర్యంలో విచారణ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ మాట్లాడుతూ పోలీసులు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పెద్ద సమస్య తలెత్తేదన్నారు. ఎక్కడా పక్షపాత ధోరణి ప్రదర్శించకుండా, చాకచక్యంగా వ్యవహరించడంవల్లే ఈ సమస్యను పరిష్కరించగలిగామన్నారు.
కల్యాణ మండపాన్ని పరిశీలించిన పోలీసు బృందం
కాసినో నిర్వహించారన్న టీడీపీ నాయకుల ఆరోపణల మేరకు పోలీసు శాఖ నియమించిన ప్రత్యేక పోలీసు బృందం శుక్రవారం కళ్యాణ మండపం పరిసర ప్రాంతాలను పరిశీలించింది. దిశ డీఎస్పీ రాజీవ్‌కుమార్ ఆధ్వర్యంలో నూజివీడు డీఎస్పీ, ట్రైనింగ్ ఏఎస్పీతో కూడిన బృందం కల్యాణ మండపం బయట, లోపల పరిశీలించింది. తమ నివేదికను ఎస్పీకి అందజేస్తామని ఆ బృందం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment