సాక్షి, హైదరాబాద్: జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో పార్టీకి కీలకంగా మారిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అధినాయకత్వం యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుందన్న దానిపై అంతర్గత చర్చ సాగుతోంది. ప్రాంతీయ పార్టీగా ఆర్థికంగా, ఇతరత్రా రూపాల్లో బలంగా ఉన్న బీఆర్‌ఎస్‌ను, రాజకీయ చతురుడు సీఎం కేసీఆర్ వ్యూహాలను ఢీకొనేందుకు ప్రస్తుతం ఇక్కడ పార్టీ అనుసరిస్తున్న విధానాలు, పని పద్ధతులు సరిపోవనే అభిప్రాయంతో కొందరు ముఖ్య నేతలున్నట్టు సమాచారం.
ఇటీవల పలువురు నేతలను ఢిల్లీకి పిలిపించి బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర సంస్థాగత ఇన్‌చార్జి సునీల్ బన్సల్ వివిధ అంశాలపై సమాలోచనలతో పాటు, ముఖ్యమైన విషయాలపై అభిప్రాయసేకరణ జరిపారు.
ముఖ్య నేతల ఒంటెద్దు పోకడలు..
రాష్ట్ర పార్టీలో కీలక బాధ్యతల్లో ఉన్న ముఖ్య నేతలు కొందరు ఒంటెద్దుపోకడలతో అన్ని కార్యక్రమాల్లో తామే ఫోకస్ అయ్యేలా, మిగతా వారెవరికీ ప్రాధాన్యత రాకుండా అనుసరిస్తున్న పద్ధతులను ముఖ్యనేతలు జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. దీనితో పాటు రాష్ట్ర నాయకుల మధ్య సరైన పని విభజన లేకపోవడం, ముఖ్య నేతల మధ్య సమన్వయ లేమి, తెలంగాణలో అతిగా హిందుత్వ ఎజెండా ఎత్తుకోవడం వల్ల ఇబ్బందులు తదితర అంశాలను గురించి నాయకత్వానికి వివరించినట్టు తెలిసింది.
పీడన, అణచివేతకు వ్యతిరేకంగా దశాబ్దాల పోరాట చరిత్ర, చైతన్య, ప్రగతిశీలమైన తెలంగాణ సమాజం కరడుగట్టిన మతవాదాన్ని, అతి హిందుత్వ భావజాలాన్ని అంగీకరించదని స్పష్టం చేసినట్టు సమాచారం. దీనికి తగ్గట్టుగా లౌకికవాద ముద్రతో రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న ఎస్సీ,ఎస్టీ, బీసీ, వర్గాలను ఆకట్టుకునేలా ఎన్నికల వ్యూహాలు సిద్ధం చేసుకుంటేనే ఫలితం ఉంటుందనే వాదనను కూడా కొందరు నేతలు బలంగా వినిపించినట్టు చెబుతున్నారు.
ప్రాంతీయ పార్టీ రాజకీయాల నేపథ్యంలో బయటి రాష్ట్రాలు, జాతీయపార్టీ నేతల ప్రమేయం తగ్గించి స్థానిక నేతలకు ప్రాధాన్యత పెంచి, స్థానిక అంశాలపైనే అధిక దృష్టి కేంద్రీకరించాలని సూచించినట్టు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో జాతీయ నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది, ముఖ్యనేతల్లో ఏర్పడిన అసంతృప్తిని దూరం చేసేందుకు ఎలాంటి ఫార్మూలాను ముందుకు తేనుంది అనే అంశాలు ఇప్పుడు చర్చకు తెరలేపాయి.
అదేవిధంగా ఎవరెవరికి ఎలాంటి బాధ్యతలు అప్పగించబో తోంది... అధికార బీఆర్‌ఎస్‌ను ఢీకొట్టేందుకు ఎలాంటి కార్యాచరణ ప్రణాళికను అమలుచేయబోతున్నదనేది ప్రస్తుతం పార్టీలో చర్చనీయాంశమైంది.
ఈటలకు కీలక బాధ్యతలు ?
ఎన్నికలకు సన్నద్ధమౌతున్న సందర్భంలో రాష్ట్ర అధ్యక్షుడి మార్పు వంటి వాటితో పార్టీలో, కేడర్‌లో అయోమయం, అసందిగ్ధత ఏర్పడే అవకాశాలున్నందున మరో ప్రత్నామాయ మార్గాన్ని ఎంచుకుని ముందుకు సాగాలని జాతీయపార్టీ నిర్ణయించినట్టు పార్టీవర్గాల సమాచారం. ఉద్యమ కాలంతో సహా రెండుదశాబ్దాల పాటు టీఆర్‌ఎస్‌లో వివిధ దశల్లో ప్రయాణం సాధించి అగ్రనేతగా ఎదిగిన ఈటల రాజేందర్‌కు ఎన్నికల కమిటీ లేదా ప్రచార సారథ్య బాధ్యతలు వంటి కీలకబాధ్యతలు అప్పగించవచ్చునని జోరుగా ప్రచారం సాగుతోంది.
ప్రధాని మోదీ విదేశీ పర్యటనను ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చాక... అంటే వారం, పదిరోజుల వ్యవ ధిలోనే దీనికి సంబంధించిన నిర్ణయాన్ని నాయకత్వం వెల్లడిస్తుందనే ఊహాగానాలు సాగుతున్నాయి. ఈటలతో పాటు... మరికొన్ని బాధ్యతల్లో పనిచేసేందుకు ఉత్సాహం కనబరుస్తున్న ఇతర¯ó తలకు కూడా సమన్వయం, పర్యవేక్షణ, ఇతర ముఖ్యమైన విధులు అప్పగించే ఆలోచనతో నాయకత్వం ఉన్నట్టు తెలిసింది.
‘ఇంటి’ సమావేశాలు ఎక్కడ?
గతంలో ఢిల్లీలో జరిగిన ప్రత్యేకభేటీలో ముఖ్యనేతలంతా తరచుగా ఒక్కోసారి ఒక్కొక్కరి నేత ఇంట్లో సమావేశం కావాలని అమిత్‌షా చేసిన సూచన కూడా నేతలంతా పెడచెవినపెట్టారు. అలా ఒక్క సమా వేశం కూడా జరిగిన దాఖలాల్లేవు దీంతో నేతల మధ్య సమన్వయం సాధించి, ఐకమత్యంతో వారు ఉమ్మడిగా ముందుకు సాగేందుకు చేపట్టాల్సిన చర్యలపై నాయకత్వం దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment