సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ట్రైనింగ్‌లో బలిపశువు కాబోతున్న వ్యక్తి పవన్ కల్యాణ్ అని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. తనకు పోటీ లేకుండా ఉండేందుకు పవన్‌ను బాబు వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. ఢిల్లీలో కాంగ్రెస్, బీజేపీతో చంద్రబాబు పైరవీలు చేస్తున్నారని మండిపడ్డారు. వీరి సంగతి ఢిల్లీలోని పెద్దలకు కూడా బాగా తెలిసొచ్చిందని, అందుకే దూరం పెట్టారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
‘చెడిపోయిన రాజకీయ వ్యవస్థను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాగుచేస్తున్నారు. హుందాతనానికి ఆయన ఇచ్చే విలువలు అందరికీ ఆదర్శం. సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు హుందాగా ఎప్పుడూ వ్యవహరించలేదు. వెన్నుపోటు, వ్యవస్థల మేనేజ్‌మెంట్‌కే ఆయన ప్రాధాన్యతనిచ్చారు. ఓటమి చెందినా దాన్ని అంగీకరించలేడు. ఎల్లోమీడియాను అడ్డం పెట్టుకుని ఏదైనా చేయొచ్చనుకుంటున్నారు.
పవన్ ఉన్మాదిలాగ మాట్లాడుతున్నారు ప్రజలు అధికారంలోకి వస్తే ఏం చేస్తాడో ప్రజలకు చెప్పకుండా.. చంద్రబాబును విమర్శించే వారినే ప్రశ్నిస్తానంటూ రాజకీయం చేస్తున్నారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టు చదవటమే తప్ప సొంతంగా పవన్ ఏమీ చేయటం లేదు. ఆయనకు మహిళలంటే ద్వేషం. మహిళా సీఐ అనే గౌరవం లేకుండా ఆ పార్టీ నేతలు విమర్శిస్తే వారిని పవన్ వెనుకేసుకు వచ్చారు. వ్యక్తిగతంగా దూషించటం వలనే ఆ సీఐ అలా వ్యవహరించారు. పవన్‌కు చిత్తశుద్ధి ఉంటే మహిళా సీఐకి క్షమాపణలు చెప్పాలి. ఆమెని దూషించిన జనసేన నాయకుడిని హెచ్చరించాలి.
చదవండి: టీడీపీలో టికెట్ వార్.. శ్రీకాళహస్తి అభ్యర్థి ఆయనేనా?
ఎన్ని సీట్లలో పోటీ చేసేదీ చెప్పే ధైర్యం లేని పవన్‌కు రాజకీయాలు ఎందుకు?. రాయలసీమలో ఒక ప్రాజెక్టునైనా చంద్రబాబు కట్టలేదు. పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా, గండికోట.. అన్నీ దివంగత వైఎస్ఆర్, సీఎం జగనే చేశారు. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా రాయలసీమ గూండాలు అంటూ మమ్మల్ని విమర్శిస్తుంటే పవన్ ఎందుకు మాట్లాడటం లేదు?. రాయలసీమలో అభివృద్ధి చేయని చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదు?. రాజకీయాల్లో హుందాతనాన్ని దిగజార్చవద్దు. ఊగిపోవటం, తిట్టటం, సాక్ష్యాలు లేకుండా విమర్శలు చేయటం రాజకీయాలు కాదు. మేనిఫెస్టో అమలు చేశామా లేదా అనేది చూడాలి.
2014లో మీరు ఇచ్చిన మేనిఫెస్టో, 2019లో మేము ఇచ్చిన మేనిఫెస్టో ప్రజల ముంగిట పెడదామా?. 30 లక్షలకుపైగా ఇళ్లు కట్టిస్తుంటే అడ్డుకుంటున్న నీచులు చంద్రబాబు బ్యాచ్. రాజధానిలో పేదలు ఉండటానికి వీల్లేదని అడ్డుకుంటున్నదీ వారే. ఏ అంశం మీదనైనా చర్చకు మేము సిద్దంగా ఉన్నాం. చంద్రబాబు 14 ఏళ్ల పాలన , వైఎస్ జగన్ 4 ఏళ్ల పాలనపై చర్చకు రాగలరా?. కనీసం శ్వేతపత్రమైనా విడుదల చేయగలరా?.
టీడీపీ, జనసేనలు తోడుదొంగల పార్టీలు. వేదికల మీద చెప్పులు చూపించటం రాజకీయమా? చంద్రబాబు శృతి మించి మాట్లాడుతున్నారు. కాలమే వారికి తగిన బుద్ది చెప్తుంది. హిందూ మతం గురించి పవన్ మాట్లాడటం సిగ్గుచేటు. పవన్, చంద్రబాబు ఏ సభలకు వెళ్లినా వారి గురించి మాట్లాడుతూ పక్కవారిని కించపరచటం అలవాటు. కులం, మతతత్వాలను రెచ్చగొట్టటం అలవాటు. బాబు హయాంలో పడగొట్టిన గుళ్లను వైఎస్ జగన్ కట్టిస్తున్నారు. పురంధేశ్వరి చేసే విమర్శలు ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నాం. మాది సెక్యులర్ పార్టీ. యూసీసీ గురించి మేము త్వరలోనే ప్రకటిస్తాం’అని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు.
చదవండి: చంద్రబాబుకు కొత్త ట్విస్ట్.. పార్టీ నేతనే ఓడిస్తానని సవాల్!
Comments
Please login to add a commentAdd a comment