గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ధ్వజం
పాల్వాయిగేట్‌లో యథేచ్ఛగా టీడీపీ రిగ్గింగ్
మా ఏజెంట్లను బయటకు లాగి దాడి చేశారు
రిగ్గింగ్‌ను అడ్డుకుని ప్రతిఘటించిన పిన్నెల్లిపై కేసులా?
అక్కడ ఆ రోజు ఉదయం నుంచి వీడియోలన్నీ బయటపెట్టాలి
పల్నాడులో ఈవీఎంల ధ్వంసాలపై వీడియోలన్నీ ఈసీ విడుదల చేయాలి
అక్రమ కేసులతో మాచర్లలో మా విజయాన్ని ఆపలేరు
నరసరావుపేట: ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడిన వారిని వదిలేసి అడ్డుకున్న వారిపై ఈసీ కన్నెర్ర చేయడం ఏమిటని గురజాల ఎమ్మెల్యే అభ్యర్థి కాసు మహేష్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు.
బుధవారం నరసరావుపేటలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా పిన్నెల్లి నాలుగు సార్లు ప్రజాబలంతో ఎమ్మెల్యేగా గెలిచారని గుర్తు చేశారు. ఈవీఎం ఘటనను పదేపదే చూపిస్తున్న టీడీపీ అనుకూల మీడియా అదేచోట వైఎస్సార్ సీపీ ఏజెంట్లపై జరిగిన దాడులను ఎందుకు దాచి పెడుతోందని నిలదీశారు.
మిగతా వాటి సంగతేంటి?
ఒక్క ఈవీఎం ఘటనను చూపిస్తూ పిన్నెల్లి నిందితుడిగా చేర్చారు. మరి పల్నాడులో పలుచోట్ల ఈవీఎంలు ధ్వంసమైతే ఆ వీడియోలను ఎందుకు బయట పెట్టడం లేదు? టీడీపీ నేతలు దౌర్జన్యాలకు తెగబడి ఈవీఎంలను పగులకొట్టిన వీడియోలు ఎందుకు బహిర్గతం చేయడం లేదు? పోలింగ్ కేంద్రాల్లో వీడియో కెమెరాలు అమర్చిన ఈసీ పది రోజులుగా మేం ఘోషిస్తున్నా ఎందుకు స్పందించలేదు?
రిగ్గింగ్ జరగలేదని నిరూపించాలి..
మాచర్లలో ఈసీకి ఇప్పటి వరకు ఎన్ని ఫిర్యాదులొచ్చాయి? వాటిపై ఏం చర్యలు తీసుకున్నారో వెల్లడించాలి. పాల్వాయి గేటుతో సహా మేం చెబుతున్న చోట్ల రిగ్గింగ్ జరగలేదని వెబ్ కెమెరా వీడియోలను బయటపెట్టి నిరూపించగలరా? ప్రజాస్వామ్య వ్యవస్థలో దీన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీదే.
కొత్త గణేశునిపాడులో మహిళల నిర్బంధం
పోలింగ్ రోజు మాచవరం మండలం కొత్త గణేశునిపాడులో అర్ధరాత్రి యాదవులు, ఎస్టీల ఇళ్లపై టీడీపీ మూకలు దాడులకు దిగి స్వైరవిహారం చేశాయి. మహిళలు ప్రాణభయంతో 24 గంటల పాటు ఓ దేవాలయంలో తల దాచుకుంటే ఇరువర్గాలపై కేసులు పెడతారా? ఇదేనా ఈసీ చేసే న్యాయం? పోలింగ్‌కు ముందు పల్నాడులో పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేసిన ఈసీ ఆ స్థానంలో తాను నియమించిన వారు విధుల్లో అలసత్వం ప్రదర్శించారంటూ సస్పెండ్ చేసింది. ఈసీ నియమించిన అధికారులే సస్పెండ్ అయ్యారంటే ఎవరు విఫలమైనట్లు?
రీపోలింగ్‌కు హైకోర్టుకెళ్లి పోరాడతాం..
ఎన్నికల కమిషన్‌కు వైఎస్సార్ సీపీ అందించిన ఫిర్యాదులన్నింటికీ సమాధానం చెప్పాల్సిందే. రిగ్గింగ్ జరిగినట్లు మేం ఫిర్యాదు చేసిన ప్రతి పోలింగ్ కేంద్రం వీడియోలను ఎన్నికల కమిష¯Œన్ బహిర్గతం చేయాల్సిందే. అధికారుల నియామకాలు, ఆ తర్వాత వారిని సస్పెండ్ చేయడం, ఎన్నికల ప్రక్రియలో లోపాలపై కచ్చితంగా హైకోర్టును ఆశ్రయిస్తాం. రీపోలింగ్ నిర్వహించేలా పోరాటం చేస్తాం.
రిగ్గింగ్ ఆరోపణలు వచ్చిన చోట వెబ్ కెమెరాలను తనిఖీ చేసి రీపోలింగ్ నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉంది. పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో టీడీపీ నేతలు, ఏజెంట్లు కలసి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. వైఎస్సార్ సీపీ ఏజెంట్లను బయటకు లాగి దాడి చేయడంతో పిన్నెల్లి అక్కడకు చేరుకుని తీవ్రంగా ప్రతిఘటించారు. మేం చెప్పేది నిజం కాకుంటే పూర్తి నిడివి వీడియోలను ఈసీ బయట పెట్టాలి.
పిన్నెల్లి నాలుగు సార్లు ప్రజాస్వామ్యబద్ధంగా మాచర్ల ఎమ్మెల్యేగా గెలిచారు. ఐదోసారి కూడా కచ్చితంగా విజయం సాధిస్తారు. నలుగురు అధికారులను మేనేజ్ చేసి ఎడిటెడ్ వీడియోలు లీక్ చేసినంత మాత్రాన భయపడే ప్రసక్తే లేదు. ఇలాంటి రాజకీయాలు చాలా చూశాం.
బాబు నోట నీతులా..?
నరసరావుపేటలో కోడెల ఇంట్లో బాంబులు తయారు చేస్తుండగా నలుగురు చనిపోతే ఆయనకు మంత్రివర్గంలో స్థానం కల్పించిన చంద్రబాబు నీతులు చెబుతున్నారు. ఏడుగురి హత్య కేసులో నిందితుడైన మాచర్ల టీడీపీ అభ్యర్థి బ్రహ్మారెడ్డిపై ఏ 1గా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించిన చంద్రబాబు ఇప్పుడు అదే వ్యక్తికి పార్టీ టికెట్ ఇచ్చారు. ఫ్యాక్షనిజం, ఫ్యాక్షన్ లీడర్లను ప్రోత్సహించేది చంద్రబాబేనని అందరికీ తెలుసు.
'గేట్’ వీడియోలన్నీ బయట పెట్టాలి..
మాచర్ల నియోజకవర్గంలోని తుమృకోట, వెల్దుర్తి, చింతపల్లి, వేపకంపల్లె, ఒప్పిచర్లలో టీడీపీ నేతలు యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. వైఎస్సార్ సీపీ ఏజెంట్లను బూత్‌ల నుంచి బయటకు లాక్కెళుతున్న వీడియోలను ఎన్నికల కమిష¯Œన్ దృష్టికి తెచ్చాం. పాల్వాయిగేట్‌లో మా పార్టీ ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల నుంచి బయటకు లాక్కెళ్లి కొడుతుంటే పిన్నెల్లి రిగ్గింగ్‌ను అడ్డుకునేందుకు వెళ్లారు.
ఈవీఎం ధ్వంసం ఘటనకు ముందు రెండు మూడు గంటల పాటు సాగిన టీడీపీ మూకల దౌర్జన్యాలు, విధ్వంసకాండను ఎందుకు బయట పెట్టడం లేదు? అక్కడ ఉదయం నుంచి జరిగిన ఘటనల వీడియోలన్నీ బహిర్గతం చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment