
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘పూటకో పార్టీ మార్చి.. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియనివారికి.. అవకాశవాద రాజకీయనేతలకు తెలంగాణ గడ్డ మీద స్థానం లేదు’అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై మంత్రి హరీశ్‌రావు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో కాంగ్రెస్ పార్టీ ఎంపీపీ యాదమ్మతోపాటు పలువురు సర్పంచ్‌లు శనివారం మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.
ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో టీడీపీ అధినేత చంద్రబాబు వస్తే తెలంగాణ పొలిమెరల వరకు ప్రజలు తరమికొట్టారని గుర్తు చేశారు. ‘కొత్త, కొత్త పార్టీలు వచ్చాయి.. వారికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత ఉందా.. వంద కోట్లమంది ఒప్పుకుంటేనే తెలంగాణ రాష్ట్రం అన్న వైఎస్సార్ వారసులను ఇక్కడి ప్రజలు ఎందుకు ఆశీర్వదించాలి’ అని ప్రశ్నించారు. తెలంగాణపై అసెంబ్లీలో మాట్లాడితే గొంతు నొక్కింది వైఎస్సార్ కాదా అని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.