సాక్షి,హైదరాబాద్: అన్నదాత పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానిది పచ్చి మోసమని, తొమ్మిది నెలల కాంగ్రెస్ పాలన రైతుల పట్ల యమపాశంగా మారిందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఆదివారం(సెప్టెంబర్8) తెలంగాణభవన్‌లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
‘మేడ్చల్‌లో వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు లేఖ రాసి మరీ సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. సురేందర్‌రెడ్డికి ఏపీజీవీబీలో అప్పు ఉంది. సురేందర్ రెడ్డి తల్లికి లక్షా 15 వేలు ,సురేందర్ రెడ్డికి లక్షా 92 వేలు అప్పు ఉంది. బ్యాంకు మేనేజర్‌ను అడిగితే కుటుంబ సభ్యుల్లో ఒక్కరికే రుణమాఫీ అవుతుందని చెప్పడంతో సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు.
సురేందర్‌రెడ్డి ఆత్మహత్య లేఖలోని ప్రతి అక్షరం రేవంత్‌రెడ్డి నగ్న స్వరూపాన్ని బయటపెట్టింది. రేవంత్‌రెడ్డిది పూటకో మాట. ఆయన వైఖరి పొద్దు తిరుగుడు కంటే వేగంగా మారుతోంది. రుణమాఫీకి రేషన్ కార్డు లింకు లేదని అసెంబ్లీ సాక్షిగా చెప్పావ్. సురేందర్ రెడ్డి ఆత్మహత్యతో రుణమాఫీకి రేషన్ కార్డుకు లింక్ ఉన్నదని నిరూపితం అయ్యింది. రేవంత్ పాలనకు సురేందర్‌రెడ్డి లేఖ ఓ పంచనామా లాంటిది.
రైతు రుణమాఫీ ఆంక్షలతో రేవంత్ కుటుంబ బంధాల్లో చిచ్చు పెట్టారు. కేసీఆర్ కుటుంబ బంధాలు బలోపేతం చేస్తే వాటిని విచ్ఛిన్నం చేసిన దరిద్రపు గొట్టు ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం. సిద్దిపేటలో నియోజకవర్గంలో జక్కాపూర్ గ్రామంలో గురజాల బాల్‌రెడ్డి కుటుంబంలో ముగ్గురికి రుణం ఉంది. వారికి ఆరు లక్షల అప్పు ఉంటె కేవలం రెండు లక్షలే మాఫీ అవుతోంది. ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఇది రైతుల పాలిట రేవంత్ చేసిన మోసం ,దగా కాదా ?
రైతు రుణ మాఫీ ఎగ్గొట్టడానికి రేవంత్ ప్రభుత్వం 31 సాకులు చూపెడుతోంది. నారాయణ్‌పేట గ్రామంలో నల్ల మణెమ్మ అనే రైతుకు లక్ష రూపాయల అప్పు ఉంది. ఆమె భర్త 2010 లో మరణించారు. ఆయన ఆధార్ కార్డు తెస్తేనే రుణ మాఫీ చేస్తామని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. 2010లో ఆధార్ కార్డు ఇవ్వనప్పుడు ఆధార్ కార్డు ఎలా తెస్తారు ? కుంభాల సిద్ధారెడ్డి ,చాట్ల హరీష్ అనే రైతులకు భార్యల ఆధార్ కార్డులు తెమ్మంటున్నారు. వారికి పెళ్లిళ్లే కాలేదు. భార్యల ఆధార్ కార్డులు ఎక్కడ్నుంచి తెస్తారు ?
ఇలాంటి వాళ్ళు ఎంత మందో ఉన్నారు. రుణ మాఫీ కోసం వాళ్ళు పెళ్లిళ్లు చేసుకోవాలా ? 20 లక్షల మందికే ఇప్పటిదాకా రుణ మాఫి అయ్యింది. 21 లక్షల రైతుల మందికి ఇంకా కావాలి. రుణ మాఫీ అయ్యింది నన్ను బావిలో దూకమని రేవంత్ అంటున్నారు. ఇప్పుడు ఎవరు బావిలో దూకాలి. కాంగ్రెస్ సర్కార్ కంజూస్ సర్కార్. ఇది కటింగ్ ప్రభుత్వం. కాంగ్రెస్ అంటే కోతలు అన్నట్టుగా తయారైంది ..
ఎన్నికలపుడు కట్టు కథలు చెప్పారు. చేతి గుర్తుకు ఓటేస్తే కోతలే మిగిలాయి.
సురేందర్‌రెడ్డిని చంపిందే కాంగ్రెస్ ప్రభుత్వం. అది ఆత్మహత్య కాదు. ప్రభుత్వం చేసిన ఆత్మహత్య. 2 లక్షల రుణం పైన ఉన్న వారు మిగతా డబ్బు బ్యాంకులకు కట్టాలి అంటున్నారు. ఎందుకు కట్టాలి. మోకాలికి బోడి గుండుకు ఎందుకు లింక్ పెడుతున్నారు ?
కేసీఆర్ హయాంలో ఇలాంటి నిబంధనలు ఏవైనా ఉన్నాయా ?వ్యవసాయ రంగంలో కొత్త కొత్త పదవులు ఏర్పాటు చేస్తున్నారు. రైతు రుణమాఫీ చేయని వారికి ఇన్ని పదవులు ఎందుకు? రైతుల ఆత్మహత్యలు పెంచడానికా ఈ పదవులు ?
ఇప్పటిదాకా 470మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతు భరోసా అనేది బ్రహ్మ పదార్థం అయ్యింది. పెట్టుబడి సాయం అర్థం తెలుసా ? కేసీఆర్ పదకొండు విడతలుగా రైతు బంధు ఇచ్చారు. యాసంగి పంట వేసే టైం వస్తోంది.. వానా కాలం రైతు బంధు ఇవ్వరా ? వడ్లకు బోనస్ బోగస్‌గా మారింది.
సన్న వడ్లకే బోనస్ అని సన్నాసులే అంటారు. ఆగస్టు 15 లోగా రుణ మాఫీ చేస్తానని చెప్పి చేయనందుకు రేవంత్‌రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలి. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి గురించి మాట్లాడాను .ఇది వాస్తవం కాదా ? రేవంత్ పాలనలో మత కలహాలు పెరిగి పోయింది నిజం కాదా? తొమ్మిది నెలల రేవంత్ పాలన లో 247 ఇల్లీగల్ వెపన్ కేసులు నమోదవలేదా’అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment