సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో రైతులను ఆదుకొని వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. పంట రుణాలు తీసుకున్న రైతులకు బ్యాంకర్ల నుంచి వేధింపులు అధికమయ్యాయని, రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే లక్షలాది రైతులతో సెక్రటేరియట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
సాగునీరు లేక రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. పంటలు ఎండిపోతుంటే రైతన్నలు కన్నీటి పర్యంతమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ గత పదేళ్లలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదని రైతులే చెబుతున్నారని పేర్కొన్నారు. రైతులు కష్టాల్లో ఉంటే బ్యాంకుల వాళ్లు అప్పులు చెల్లించాలని రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు నోటీసులు జారీ చేస్తున్నారు. బకాయిలు కట్టకపోతే ఆస్తులు జప్తు చేస్తామని బెదిరిస్తున్నారని, రజాకార్లను తలపించేలా వాళ్లు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.
పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ముఖ్యమంత్రికి మాత్రం ఈ విషయం పట్టడం లేదని ఇతర పార్టీల నుంచి చేరికలపై తప్ప రైతుల గురించి ఆయనకు ఆలోచన లేదని దుయ్యబట్టారు. ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం రుణమాఫీపైనే పెడతానని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి.. అధికారంలోకి వచ్చి 100 పూర్తయినా దీనిపై నిర్ణయం తీసుకోలేదని విమర్శించారు. రైతులకు ఇచ్చిన 4 హామీలు ఇప్పటి వరకు అమలు చేయలేదని ఆరోపించారు.
చదవండి: హైదరాబాద్ ఎంపీ సీటు ఆయనకే.. బీఆర్‌ఎస్ అభ్యర్థుల లిస్ట్ ఇదే..
రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట ముంచిందని ధ్వజమెత్తారు హరీష్ రావు. కౌలు రైతులకు ఎకరానికి రూ. 15 వేలు, వ్యవసాయ కూలీలకు రూ. 12 వేలు, వరి పంటకు క్వింలాటల్‌కు రూ. 500 బోనస్ ఇస్తామమని చెప్పి అమలు చేయలేదని విమర్శించారు. రైతు రుణాలు తెచ్చుకోండి అధికారంలోకి రాగానే మాఫీ చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఎందుకు మాఫీ చేయలేదని ప్రశ్నించారు. ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ ప్రకటించాలని, లేదంటే రైతులు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కర్రుకాల్చి వాత పెట్టడం ఖాయమన్నారు.
‘నిన్నటి వరంగల్ పర్యటన లో రైతుల కన్నీళ్ళు కష్టాలు కనిపించాయి. అక్కడ కొంత మంది ఎన్ని బోర్లు వేసినా నీళ్ళు రావటం లేదని, లక్షలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితులు లేవు. ఇప్పుడు కనీసం మా తాండాల్లో తాగు నీరు కూడా రావటం లేదని ఆవేదన చెప్తున్నారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఉంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. ఓ సమీక్ష లేదు, పరామర్శ లేదు. అటెన్షన్ డైవర్షన్ చేస్తూ రాజకీయాలు చేస్తోంది ప్రభుత్వం. చేరికల మీద దృష్టి పెట్టిన ప్రభుత్వం ఒక్క రైతును కూడా పరామర్శించలేదు. పంటలు ఎండిపోయి, రైతుబంధు రాక, వడగళ్ల వానతో పంటలు నష్టపోతుంటే అప్పులు కట్టాలని బ్యాంకులు రైతులను వేధిస్తున్నారు. కేసులు పెడతామని బెదిరిస్తున్నారు.
రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం. అప్పులు కట్టొద్దు.. రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది. అధికారులు వేధిస్తే.. మా దృష్టికి తీసుకొస్తే మీకు అండంగా ఉంటాం. రుణమాఫీ కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ పోరాడుతోంది. రేపటి నుంచి బీఆర్‌ఎస్ నేతలు, శ్రేణులు రైతుల పంట పొలాలకు వెళ్లి పంట నష్టం, రైతుల కష్టాలు రిపోర్ట్ తయారు చేసి పార్టీ కార్యాలయానికి పంపండి. రైతుల గోస ప్రభుత్వానికి తెలియజేయాలి’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment