సాక్షి, హైదరాబాద్: రైతులకు 3 గంటల కరెంట్ చాలు అనుకుంటూ కుడితిలో పడ్డ ఎలుక మాదిరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొట్టుకుంటున్నారని మంత్రి హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తన నిజ స్వరూపాన్ని బయటపెట్టుకొని ప్రజాగ్రహానికి గురవుతోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో కరెంట్ లేక జనం ఇబ్బందులు పడ్డారని గుర్తుచేసిన హరీష్ రావు.. ఆ రోజు కాంగ్రెస్ పాలన ఎలా ఉందో అందరికి తెలుసని అన్నారు. ప్రస్తుతం దేశంలో నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు.
బషీర్ బాగ్ కాల్పులకు కేసీఆర్ కారణం అంటూ స్టేట్‌మెంట్ ఇస్తున్నారు. ఇంత కంటే పెద్ద జోక్ ఉండదు. నాటి సీఎం చంద్రబాబు కరెంట్ బిల్లులు పెంచితే తీవ్రంగా వ్యతిరేకించింది కేసీఆర్‌యే. ఉద్యమం పుట్టిందే విద్యుత్‌లో నుంచి అయితే.. కాల్పులకు కేసీఆర్ కారణం అనడం సరికాదు. విద్యుత్ విషయంలో కేసీఆర్‌ను, బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తే సూర్యుడి మీద ఉమ్మేసినట్టే.
2000 ఆగష్టు 28న బషీర్ బాగ్‌లో కాల్పులు జరిగితే కేసీఆర్ రైతు హృదయంతో స్పందించారు. అధికార పార్టీలో కొనసాగుతూ.. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని కోరారు. అదే రోజు కేసీఆర్ డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉండి చంద్రబాబుకు లేఖ రాశారు. విద్యుత్ చార్జీలు తగ్గించకపోతే తెలంగాణ జెండా ఎత్తి పోరాడాల్సి వస్తుందని హెచ్చరించారు. నాడు చంద్రబాబు రైతులను కాల్చి చంపితే.. కడుపు రగిలి మా రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పి, బిల్లులు తగ్గించాలని లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని లేఖలో పేర్కొన్నారు. కరెంట్ కోసం పోరాడింది కేసీఆర్ కాదా. ఆయన మీద అభాండాలు వేస్తున్నారు( ఆగ్రహం వ్యక్తం చేశారు.
డిప్యూటీ స్పీకర్, కేంద్ర మంత్రి పదవి, ఎంపీ పదవులను కేసీఆర్ గడ్డిపోచల్లా మాదిరిగా కేసీఆర్ వదిలేశారు. మీరేమో పదవుల కోసం చొక్కాలను మార్చినట్టు పార్టీలను మారుతున్నారు. కానీ కేసీఆర్ ప్రజల కోసం పదవులను వదులుకున్నారు. ఇవాళ కేసీఆర్‌ను ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ప్రజలు సహించరు. కరెంట్ వస్తలేదని అంటున్నారు కదా.. డైరెక్ట్ వెళ్లి కరెంట్ తీగలను పట్టుకుంటే, కరెంట్ స్వీచ్ బోర్డులో వేలు పెడ్తే తెలుస్తుంది’ అని హరీష్ రావు చురకలంటించారు.
Comments
Please login to add a commentAdd a comment