మిషన్ 90 అంటూ ఊదరగొడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే అంటున్నారు. ఢిల్లీ పెద్దల రాకపోకలు ఊపందుకుంటున్నాయి. ఈ నెలలోనే ప్రధాని, హోం మంత్రి రాబోతున్నారు. మరి ఆ పార్టీకి అనేక జిల్లాల్లో అభ్యర్థులే దొరకడంలేదా? ఉమ్మడి నల్గొండ జిల్లాలో అయితే పరిస్థితి మరీ ఇబ్బందికరంగా ఉందని తెలుస్తోంది. ఇంతకీ ఆ పార్టీ ఏదో ఈపాటికే అర్థం అయ్యే ఉంటుంది? కమలానికి పక్క పార్టీ నుంచి వచ్చే నాయకులే దిక్కా?
ఎన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులున్నారు?
ఈ ఏడాది ఆఖరులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 90 స్థానాలు గెలుచుకుని తెలంగాణలో అధికారంలోకి రావడానికి కమలం పార్టీ ప్లాన్ చేసింది. క్షేత్రస్థాయిలో కేడర్ను కూడా అందుకు సిద్ధం చేసే విధంగా కార్యాచరణ రూపొందిస్తోంది. ఇదే సమయంలో చాలా నియోజకవర్గాల్లో సరైన నాయకత్వం లేక కమలం పార్టీ తీవ్ర వడిదుడుకులు ఎదుర్కొంటోంది. అందులో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఎక్కువ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది. కనీసం కౌన్సిలర్లుగా గెలిచే సత్తా ఉన్న నేతలు కూడా ఆ పార్టీలో కనిపించడం లేదా అంటే అవుననే సమాధానం వస్తోంది. అలాంటి నియోజవర్గాల్లో కోదాడ ఒకటి. ఇక్కడ బీజేపీ గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది అన్నట్లుగా పరిస్థితి తయారైంది. కేడర్ ఉన్నా నడిపించే నాయకత్వం లేకపోవడంతో చతికిల పడుతోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ నుంచి ఈ సీటులో ఎవరు పోటీ చేస్తారు అనే చర్చ తీవ్ర స్థాయిలో జరుగుతోంది.
కోదాడ లైన్లో ఎవరెవరు?
ప్రస్తుతం కోదాడ బీజేపీలో కనగాల నారాయణ, నూనె సులోచన, సంపత్, వేలంగి రాజు లాంటి నేతలు ఉన్నారు. కానీ వీరిలో ఎవరికీ కనీసం రెండు వేల ఓట్లు కూడా సాధించే సత్తా లేదనేది కాదనలేని వాస్తవం. గతంలో ఓసారి పోటీ చేసిన నూనె సులోచనకు వచ్చిన ఓట్లే అందుకు ఉదాహరణగా చొప్పొచ్చు. 2009 లో కోదాడ నుంచి పోటీ చేసిన ఆమెకు వచ్చిన ఓట్లు 1810 మాత్రమే. మరి ఇలాంటి నేతలను పెట్టుకుని అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడటం అంటే నాటు పడవతో సముద్రంలో ప్రయాణించినట్లే అవుతుందని ఆ పార్టీ భావిస్తున్నట్లు టాక్.
అందుకే సొంత పార్టీ నేతలను నమ్ముకుని నట్టేట మునిగే కంటే..ఇతర పార్టీల్లో ప్రజల్లో పట్టున్న నేతలపైన ఎక్కువగా దృష్టి పెట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికార బీఆర్ఎస్లోని వర్గ విభేదాలను తమకు అనుకూలంగా మలచుకోవాలని బీజేపీ చూస్తోంది. సిటింగ్ ఎమ్మెల్యేపై గత కొంతకాలంగా అసంతృప్తితో నిరసన గళం వినిపిస్తున్న ఇద్దరు ముగ్గురు నేతలను టార్గెట్ గా చేసుకుని పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నట్లు కోదాడ రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. అందులో ఈసారి ఎలా అయినా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకుంటున్న నేతతో పాటు కోదాడ పట్టణానికే చెందిన మరో కీలక నేతను కూడా బీజేపీ టచ్ చేసినట్లు కోదాడలో టాక్ నడుస్తోంది. వారు కూడా ఆలోచించుకుని చెప్తామని అన్నారట.
చదవండి: (మాకు నమ్మకం లేదయ్యా.. నాకు నువ్వు, నీకు నేను అంతే!)
అమెరికా నుంచి తీసుకురావాల్సిందే..!
ఇదే సమయంలో ఆర్థికంగా బలంగా ఉన్న ఓ ఎన్నారైని కూడా పార్టీలోకి తీసుకొచ్చేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరంగా చేసినట్లు తెలుస్తోంది. ప్రయత్నిస్తున్న వారిలో ఎవరు పార్టీలో చేరకున్నా.. ప్లాన్ బీని అమలు చేసేందుకు కూడా కమలం పార్టీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జాన్పూర్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్‌గా కొనసాగుతున్న కీసర శ్రీకళా రెడ్డిని కోదాడ నుంచి పోటీ చేయించేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం పథకం రచించిందట. ఆమె నియోజకవర్గానికే చెందిన నేత కావడం.. అందులోనూ మాజీ ఎమ్మెల్యే కీసర జితేందర్ రెడ్డి కూతురు కావడంతో పాటు ఆర్థికంగా కూడా బలమైన నేత కావడంతో రంగంలోకి దించేందుకు ఇప్పటికే శ్రీకళతో మాట్లాడినట్లు కూడా తెలుస్తోంది. మెట్టినింట్లో రాజకీయంగా నిరూపించుకున్న ఆమె పుట్టినింట్లో నిరూపించుకోవడంతో పాటు తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించాలన్న ఉద్దేశంతో కోదాడకు వచ్చేందుకు ఒప్పుకున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. అధికారంలోకి రావాలనుకుంటున్న పార్టీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కోసమే ఆపసోపాలు పడుతోంది. చూద్దాం.. కోదాడలో బరిలో కమలం పార్టీ ఎవరిని దించుతుందో..?
- పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment