భారత ప్రధాని నరేంద్ర మోదీ బిహార్‌లో పర్యటిస్తున్నారు. ఈ రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలో మోదీపై విపక్ష కాంగ్రెస్ పార్టీ మాటల దాడిని ప్రారంభించింది. బిహార్‌లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ అక్కడి కుల ఆధారిత జనాభా గణన గురించి మాట్లాడే ధైర్యం చేస్తారా అని సవాలు విసురుతోంది.
ఈ మేరకు కాంగ్రెస్‌పార్టీ ప్రధాన కార్యదర్శి, కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జ్ జైరాం రమేష్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విటర్)లో ఒక పోస్టు చేశారు. ‘ఆయన (మోదీ) అక్కడ కూడా అపద్ధాలు, ప్రకటన వర్షం కురిపిస్తాడు. వీటితోపాటు కుల జనాభా గణన అనే ముఖ్యమైన సామాజిక -ఆర్థిక సమస్యపై కూడా ఆయన ధైర్యంగా మాట్లాడతాడని ఆశిస్తున్నాం’ అంటూ హిందీలో రాసుకొచ్చారు.
అలాగే ఈ పోస్టులో ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి నాలుగు ప్రశ్నలను సంధించారు. మోదీ ప్రభుత్వం ఎందుకు సాధారణ జనాభా గణను నిర్వహించడం లేదు? 2011లో నిర్వహించిన సామాజిక ఆర్థిక కుల గణనలో సేకరించిన కుల సంబంధిత డేటాను మోదీ ప్రభుత్వం ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. ‘బిహార్‌లో ‘ఇండియా’ సంకీర్ణ ప్రభుత్వం కుల గణనను చేపట్టి గణాంకాలను విడుదల చేసింది. జనాభా గణనలో వెల్లడైన వెనుకబడిన వర్గాల సామాజిక, ఆర్థిక న్యాయం కోసం ఇప్పుడు బిహార్‌లోని ‘కొత్త’ ఎన్‌డీఏ ప్రభుత్వం విజన్ ఏమిటి? దేశవ్యాప్త సామాజిక-ఆర్థిక కుల గణనకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది. ఈ అంశం బీజేపీ స్టాండ్ ఏమిటి?’ అని జైరాం రమేష్ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment