కాంగ్రెస్‌ కుల గణన డిమాండ్‌పై ప్రధాని మోదీ నిప్పులు  | Trying To Divide Country: PM Modi On Bihar Caste Survey Report | Sakshi
Sakshi News home page

హిందువులను విభజించే కుట్ర.. కుల గణన డిమాండ్‌పై ప్రధాని మోదీ నిప్పులు 

Published Wed, Oct 4 2023 8:28 AM | Last Updated on Wed, Oct 4 2023 8:31 AM

Trying To Divide Country: PM Modi On Bihar Caste Survey Report - Sakshi

జగ్దల్‌పూర్‌: జాతీయ స్థాయిలో కులగణన చేపట్టాలన్న కాంగ్రెస్‌ డిమాండ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. ఆ వంకతో హిందువులను విభజించేందుకు, తద్వారా దేశాన్ని నాశనం చేసేందుకు ఆ పార్టీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ‘కుల గణన చేపట్టి జనాభా ఆధారంగా వనరులను పంచాలనడంలో కాంగ్రెస్‌ ఉద్దేశం ఏమిటి తద్వారా ముస్లింలు, మైనారిటీల హక్కులను తగ్గించాలనుకుంటోందా? దేశంలో ఎవరి జనాభా ఎక్కువగా ఉంది? అత్యధిక జనాభాగా ఉన్న హిందువులే ముందుకొచ్చి హక్కులన్నీ తమకే కావాలని డిమాండ్‌ చేయాలా? కాంగ్రెస్‌ ఆశిస్తున్నదేమిటి?‘ అని మండిపడ్డారు.

‘పేదలే నా తొలి ప్రాథమ్యం. కుల మతాలతో నిమిత్తం లేకుండా వనరులపై తొలి హక్కు వారికే చెందాలన్నది నా అభిమతం. కానీ కాంగ్రెస్‌ మాత్రం కేవలం ఓటు బ్యాంక్‌ రాజకీయాల కోసం కులం, మతం ఆధారంగా సమాజాన్ని విడదీయాలని చూస్తోంది‘ అని దుయ్యబట్టారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఛత్తీస్‌గడ్‌లో మంగళవారం జగ్దల్‌పూర్‌లో పరివర్తన్‌ మహా సంకల్ప ర్యాలీలో మోదీ మాట్లాడారు.

బిహార్‌లో సీఎం నితీశ్‌ కుమార్‌ తాజాగా కుల గణన వివరాలు వెల్లడించడం, దాన్ని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ అభినందించడం తెలిసిందే. అంతేగాక ప్రజలకు జనాభాలో వారి శాతానికి అనుగుణమైన నిష్పత్తిలో హక్కులు కల్పించేందుకు వీలుగా దేశమంతా కుల గణన చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో మోదీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 
చదవండి: ఆసుపత్రి డీన్‌తో టాయ్‌లెట్‌ శుభ్రం చేయించిన ఎంపీ

కాంగ్రెస్‌తో జాగ్రత్త 
కాంగ్రెస్‌ పార్టీ ఒక విదేశంతో రహస్య ఒప్పందం కుదుర్చుకుందని ఈ సందర్భంగా ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడంలో చాలా ఆనందం పొందుతోందన్నారు. ‘దేశంలోకెల్లా అతి పురాతన పార్టీ అయిన కాంగ్రెస్‌ను దాని నాయకులు కాకుండా, దేశ వ్యతిరేక గ్రూపులతో చేతులు కలిపిన తెర వెనక శక్తులు నడుపుతున్నాయి. అందుకే ఆ పారీ్టతో జాగ్రత్తగా ఉండాలి‘ అని ప్రజలను హెచ్చరించారు.

దేశానికి కాంగ్రెస్‌ కేవలం పేదరికం మాత్రమే ఇచి్చందని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కుటుంబ స్వామ్యంగా, అవినీతికి మార్గంగా మార్చిన ఘనత ఆ పారీ్టదేనన్నారు. 2014కు ముందు కాంగ్రెస్‌ సారథ్యంలోని యూపీఏ పాలనలో ఎంతెంత పెద్ద కుంభకోణాలు జరిగాయో తెలుసుకోవాలని కొత్త ఓటర్లకు సూచించారు. అవినీతిలో, నేరాల్లో కాంగ్రెస్‌ పాలిత రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌ పోటీ పడుతున్నాయని ఎద్దేవా చేశారు.  

కింది స్థాయి నుంచి ప్రగతి...
భారత్‌ అభివృద్ధి చెందాలన్న అందరి స్వప్నం సాకారం కావాలంటే గ్రామాలు, జిల్లాలు, రాష్ట్రాలు పూర్తిగా ప్రగతి సాధించినప్పుడే సాధ్యమని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. దేశం అభివృద్ధి చెందాలంటే భౌతిక, డిజిటల్, సామాజిక తదితర మౌలిక వనరులన్నీ భావి అవసరాలకు అనుగుణంగా రూపొందాల్సి ఉందన్నారు. అందుకే మౌలిక సదుపాయాలకు కేటాయింపులను తాజా బడ్జెట్‌లో బాగా పెంచి ఏకంగా రూ.10 లక్షల కోట్లకు చేర్చామన్నారు. ఉక్కు ఉత్పత్తిలో దేశాన్ని ఆత్మ నిర్భర్‌గా మార్చేందుకు గత తొమ్మిదేళ్లలో పలు చర్యలు తీసుకున్నట్టు వివరించారు.

త్వరలో ఎన్నికలు జరగనున్న కాంగ్రెస్‌ పాలిత ఛత్తీస్‌గఢ్‌లో రూ.27,000 కోట్ల పైచిలుకు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన మంగళవారం శంకుస్థాపన చేశారు. జగ్దల్‌పూర్‌ లో ఎన్‌ఎండీసీ ప్లాంటును జాతికి అంకితం చేశారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడారు. ఈ ప్లాంటు పరిసర జిల్లాల్లో కనీసం 50 వేల మందికి ఉపాధి కల్పిస్తుందన్నారు. రాష్ట్ర ప్రజల జీవితాలను మరింత మెరుగు పరచాలన్నదే తన ఉద్దేశమన్నారు. అందుకు కేంద్రం ఎన్నో చర్యలు చేపడుతోందని చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement