ప్రతిపక్షాల ప్రవర్తన బాధించింది | Indefinite adjournment of the Legislature | Sakshi
Sakshi News home page

ప్రతిపక్షాల ప్రవర్తన బాధించింది

Published Fri, Feb 9 2024 5:17 AM | Last Updated on Fri, Feb 9 2024 5:17 AM

Indefinite adjournment of the Legislature - Sakshi

సాక్షి, అమరావతి: శాసనసభలో ప్రతిపక్షాల ప్రవర్తన తనను బాధించిందని స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆవేదనను వ్యక్తంచేశారు. ప్రస్తుతం జరుగుతున్న 15వ అసెంబ్లీ సమావేశాల ముగింపు సందర్భంగా ప్రతిపక్షాల ప్రవర్తనపై స్పీకర్‌ తమ్మినేని మాట్లాడారు. గురువారం సభను నిరవధికంగా వాయిదా వేసే ముందు సభ్యులతో తన ఆవేదనను పంచుకున్నారు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నో మంత్రి పదవులను నిర్వహించానని, కానీ రాజ్యాంగబద్ధమైన స్పీకర్‌ పదవిని ఐదేళ్లపాటు నిర్వర్తించడం ఆనందంగా ఉందన్నారు. రాజకీయాలకు అతీతంగా తన విధులను కర్తవ్యదీక్షతో నిర్వర్తించానని, అన్ని పార్టీల సభ్యులకు మాట్లాడటానికి అవకాశం కల్పించినట్లు తెలిపారు.

ముఖ్యంగా తొలిసారి సభకు వచ్చిన ఎమ్మెల్యేలు, మహిళా సభ్యులను మాట్లాడించడానికి ప్రోత్సహించినట్లు తమ్మినేని చెప్పారు. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌ ద్వారా సభ్యుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడానికి కృషి చేశానన్నారు. తాను స్పీకర్‌గా ఉన్న సమయంలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధికరణ బిల్లు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు బిల్లు, మహిళా రక్షణకు ఉద్దేశించిన దిశ బిల్లు వంటి అనేక కీలక బిల్లులు ఆమోదం పొందడం ఆనందంగా ఉందని తెలిపారు. కానీ, అదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు తమ పరిధిని దాటి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా, ప్రతిష్టాత్మక వ్యవస్థకు మచ్చతెచ్చే విధంగా ప్రవర్తించారన్నారు.

సభలో భిన్న వాదనలు ముఖ్యమని, అయితే పరిధి దాటి స్పీకర్‌ పోడియం మీదకు వచ్చి కాగితాలు, ఫైళ్లు విసిరారని, ఇది తనకు జరిగిన అవమానం కాదని, గౌరవ ప్రదమైన స్పీకర్‌ స్థాయిని, శాసనసభ స్థాయిని తగ్గించడమేనని తమ్మినేని అన్నారు. సభను హుందాతనంగా నడపడానికి కొన్ని కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. డిప్యూటీ స్పీకర్లుగా వ్యవహరించిన కోన రఘుపతి, కోలగట్ల వీరభద్రస్వామి, స్పీకర్‌ కార్యాలయ సిబ్బందికి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

15వ అసెంబ్లీ సమావేశాలు మూడు రోజులపాటు 10 గంటల రెండు నిమిషాలు జరిగాయని, ఇందులో 9 బిల్లులను ఆమోదించగా, 20మంది సభ్యులు మాట్లాడినట్లు తెలిపారు. ఫిబ్రవరి 8 నాటికి సభలో వైఎస్సార్‌సీపీకి 151 మంది, టీడీపీకి 22 మంది, జనసేనకు ఒకరు చొప్పున సభ్యులు ఉన్నారని, ఒక స్థానం ఖాళీగా ఉందని స్పీకర్‌ వెల్లడిస్తూ సభను నిరవధికంగా వాయిదా వేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement