పెద్ద నోట్ల రద్దు వ్యవహారం రెండో రోజు కూడా పార్లమెంటును కుదిపేసింది. లోక్ సభ రేపటికి వాయిదా పడింది.
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు వ్యవహారం రెండో రోజు కూడా పార్లమెంటును కుదిపేసింది. లోక్ సభ రేపటికి వాయిదా పడింది. లోక్ సభలో ఈ అంశంపై చర్చ జరగాల్సిందేనంటూ విపక్షాలు పట్టుబట్టాయి. సున్నితమైన సమస్యను పట్టించుకోకుండా, సభకు రాకుండా ప్రధాని మోదీ ఏం చేస్తున్నారని నిలదీశాయి. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీ, వామపక్షాలు ఈ అంశంపై ఒకతాటిపై నిలబడి సభలో గందరగోళ పరిస్థితిని సృష్టించాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర నిరసన నినాదాలు చేశాయి.
నోట్ల రద్దుపై చర్చ చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించినప్పటికీ వెంటనే ఆ చర్చ ప్రారంభించాలని, ఆ చర్చలో ప్రధాని తప్పకుండా ఉండాలని, ఆయన సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేశాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కమల్ నాథ్ మాట్లాడుతూ సామాన్యుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని, దీనిని ఖండిస్తూ చర్చించేందుకు నోటీసులు ఇస్తే స్పీకర్ చర్చకు అనుమతించడం లేదని, ఆయన అనుమతి ఇచ్చే వరకు పరిస్థితి ఇలాగే ఉంటుందని చెప్పారు. దీంతో తొలుత 12.30 వరకు వాయిదా పడిన లోక్ సభ అనంతరం పరిస్థితి మారకపోవడంతో రేపటికి వాయిదా పడింది. మరోపక్క, రాజ్యసభ మూడోసారి కూడా 2.00గంటల వరకు వాయిదా పడింది.