రహదారుల నిర్మాణంలో ప్రపంచ రికార్డు  | India holds world record for fastest road construction : Nitin Gadkari | Sakshi
Sakshi News home page

రహదారుల నిర్మాణంలో ప్రపంచ రికార్డు 

Published Sat, Apr 3 2021 12:44 PM | Last Updated on Sat, Apr 3 2021 2:33 PM

India holds world record for fastest road construction : Nitin Gadkari - Sakshi

సాక్షి, ఢిల్లీ: వేగవంతంగా రహదారుల నిర్మాణంలో భారత్‌ గడచిన ఆర్థిక సంవత్సరం (2020-21) ప్రపంచ రికార్డు సాధించిందని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ శుక్రవారం పేర్కొన్నారు. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ  2020 ఏప్రిల్‌ నుంచి 2021 మార్చి వరకూ 13,394 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం జరిపిందనీ, రోజూవారీ సగటు 37 కిలోమీటర్లని ఆయన వివరించారు. తాను రహదారుల మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టే నాటికి రోజుకు 2 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం మాత్రమే ఉండేదని మంత్రి పేర్కొన్నారు.  

గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు... 
వేగవంతమైన రహదారుల నిర్మాణంతోసహా మొత్తం మూడు అంశాల విషయంలో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులను భారత్‌ నమోదుచేసినట్లు మంత్రి పేర్కొన్నారు. ‘ఢిల్లీ-వడోదర-ముంబై ఎనిమిది వరుసల ఎక్‌ప్రెస్‌వే ప్రాజెక్టులో భాగంగా కేవలం 24 గంటల్లో 2.5 కిలోమీటర్ల నాలుగు వరుసల కాంక్రీట్‌ రోడ్డును నిర్మాంచాం. అలాగే 24 గంటల్లో సోలాపూర్‌–బీజపూర్‌ మధ్య 25 కిలోమీటర్ల బిటుమెన్‌ రోడ్డును నిర్మించాం. ఈ అంశాలు రహదారుల నిర్మాణంలో భారత్‌ శక్తిసామర్థ్యాలను నిరూపిస్తున్నాయి’’ అని మంత్రి పేర్కొన్నారు. కోవిడ్‌–19 మహమ్మారి సవాళ్ల నేపథ్యంలోనూ రహదారుల మంత్రిత్వశాఖ ఈ రికార్డులను సృష్టించిందని గుర్తుచేశారు. 

ఇంకా ఆయన ఏమన్నారంటే... 
► 2014 ఏప్రిల్‌ నాటికి భారత్‌ రహదారుల నిర్మాణం 91,287 కిలోమీటర్లు ఉంటే, 2021 మార్చి 20 నాటికి ఈ పొడవు 1,37,625 కిలోమీటర్లకు చేరింది. అంటే గడచిన ఏడేళ్లలో రహదారుల నిర్మాణం 50 శాతంపైగా పురోగతి సాధించింది.  
►  2014–15లో రహదారుల నిర్మాణానికి కేటాయింపులు రూ.33,414 కోట్లు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి ఈ నిధుల పరిమాణం 5.5 రెట్టు పెరిగి రూ.1,83,101 కోట్లకు ఎగసింది.  
► 2014లో (గడ్కరీ రహదారుల మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు) దాదాపు రూ.3.85 లక్షల కోట్ల విలువైన 406 ప్రాజెక్టులు నిలిచిపోయాయి. అయితే అటు తర్వాత తీసుకున్న పలు చర్యలు ఫలితాన్ని ఇచ్చాయి. దాదాపు రూ.3 లక్షల కోట్లు మొండిబకాయిలుగా మారకుండా బ్యాంకింగ్‌కు ప్రయోజనం చేకూరింది.  
► రహదారుల ప్రాజెక్టుల్లో స్తబ్దత తొలగించడానికి అలాగే పనులు వేగవంతం కావడానికి పలు చొరవలు తీసుకోవడం జరిగింది.  ఇందులో భాగంగా రూ.40,000 కోట్ల విలువైన ప్రాజెక్టులూ రద్దయ్యాయి. వెరసి ఫాస్ట్‌ట్రాకింగ్‌ ప్రాతిపదికన పనులు జరిగాయి.  
► భారత్‌మాల పరియోజన బృహత్తర ప్రణాళిక కింద దాదాపు రూ.5.35 లక్షల కోట్లతో 34,800 కిలోమీటర్ల నిర్మాణం కేంద్రం లక్ష్యం.  
► రానున్న ఐదు సంవత్సరాల్లో భారత్‌ మౌలిక రంగంలో గణనీయమైన మార్పు, పురోగతి రాబోతోంది. అమెరికా, యూరోపియన్‌ దేశాలకు ఏ మాత్రం తక్కువకాకుండా భారత్‌ ఆవిర్భవిస్తోంది. 


అత్యాధునిక వసతులు... 
మరోవైపు ప్రయాణీకుల సౌకర్యం కోసం దేశంలోని జాతీయ రహదారుల వెంట ఆధునిక వసతులను కల్పించడానికి నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) ప్రణాళికలు రూపొందిస్తోంది. వచ్చే ఐదేళ్లలో 22 రాష్ట్రాల్లో హైవే మార్గాలలో 600కు పైగా ప్రాంతాల్లో ప్రపంచ స్థాయి సౌకర్యాలను అభివృద్ధి చేయాలన్నది ఈ ప్రణాళికల ఉద్దేశం.  వీటిలో 130 ప్రాంతాల్లో 2021–22లో అభివృద్ధి చేయాలని లకి‡్ష్యంచినట్లు ఎన్‌హెచ్‌ఏఐ తెలిపింది. ఇప్పటికే 120 ప్రాంతాల్లో సౌకర్యాల అభివృద్ధికి బిడ్లను ఆహ్వానించినట్లు వివరించింది. ప్రస్తుతం ఉన్న ఎన్‌హెచ్‌లు, భవిష్యత్తులో రాబోయే రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వే మార్గాలలో ప్రతి 30–50 కి.మీ.లకు ఈ సౌకర్యాలుంటాయని పేర్కొంది. పెట్రోల్‌ బంక్‌లు, ఎలక్ట్రిక్‌ చార్జీంగ్‌ సదుపాయాలు, ఫుడ్‌ కోర్ట్‌లు, రిటైల్‌ షాపులు, బ్యాంక్‌ ఏటీఎంలు, మరుగుదొడ్లు, పిల్లల ఆట స్థలాలు, క్లినిక్‌లు, స్థానిక హస్తకళల కోసం విలేజ్‌ హట్‌లు, ట్రక్‌ మరియు ట్రెయిలర్‌ పార్కింగ్, ఆటో వర్క్‌షాప్స్, దాబా, ట్రక్కర్‌ వసతి గృహాలు వంటి సౌకర్యాలను అభివృద్ధి చేయనున్నట్లు వివరించింది. దేశవ్యాప్తంగా ఎన్‌హెచ్‌ఏకు ఉన్న 3 వేల హెక్టార్ల స్థలంలో ఆయా వసతులను అభివృద్ధి చేస్తుంది. దీంతో ఆయా మార్గాలలో పెట్టుబడిదారులు, డెవలపర్లు, ఆపరేటర్లు, రిటైలర్లకు భారీ అవకాశాలు వస్తాయని, అలాగే స్థానిక ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని పేర్కొంది. ప్రస్తుతం ఎన్‌హెచ్‌ఏఐ రహదారుల అభివృద్ధి, కార్యకలాపాల కోసం ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. భవిష్యత్తులో రాబోయే కొత్తగా నిర్మించే/విస్తరించే జాతీయ రహదారి ప్రాజెక్ట్‌ల వెంట ఆధునిక వసతులు, లాజిస్టిక్‌ పార్క్‌లు తప్పనిసరిగా ఉంటాయని తెలిపింది.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement