దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటనలో ఏమి సాధించినట్లు? తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై ఆరోపణలు , ప్రభుత్వంపై విమర్శలు చేయడం మినహాయించి ఆయన కొత్తగా ఏమి చెప్పారన్నది ప్రశ్న. గతంలో వరంగల్‌లో కోచ్ ఫ్యాక్టరీని ప్రతిపాదించారు. అది కార్యరూపం దాల్చలేదు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వ్యాగన్ యూనిట్‌ను మంజూరు చేసింది.
దీంతో పాటు కొన్ని జాతీయ రహదారులకు శ్రీకారం చుట్టారు.ఇంతవరకు సంతోషమే. ఈ సందర్భంగా పార్టీపరంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, ఎప్పటిమాదిరే కుటుంబ రాజకీయాలు, అవినీతిపై మాటల తూటాలు పేల్చారు. ఇవి వినడానికి బాగానే ఉన్నా, ఆచరణలో బీజేపీకి, ఇతర పార్టీలకు తేడా లేదని పలు అనుభవాలు తెలియచేస్తున్నాయి.
అవి కుటుంబ పార్టీలు కాదా?
తెలంగాణలో వచ్చే శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఈ సభను ఏర్పాటు చేశారు. కేసీఆర్‌పై ,ఆయన కుటుంబంపై నేరుగానే విమర్శనాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లను ఒకే గాటన కడుతూ వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు పార్టీలు కుటుంబ పార్టీలని ఆయన అన్నారు. ఇదేమి మొదటిసారి కాదు ఇలా అనడం. వివిధ రాష్ట్రాలలో పర్యటనల సందర్భంగా కూడా ఇవే విషయాలు చెబుతున్నారు.
కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడుతున్నప్పుడు కొన్ని రాష్ట్రాలలో ఇవే కుటుంబ పార్టీలతో బీజేపీ ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నదో కూడా చెప్పాలి కదా! ఉదాహరణకు ఎపీలో 2018 వరకు పొత్తులో ఉన్న టీడీపీకాని, హర్యానాలో పొత్తులో ఉన్న చౌతాల మనుమడి పార్టీకాని, గత ఎన్నికల వరకు మిత్రుడుగా ఉన్న శివసేన కానీ కుటుంబ పార్టీలు కాదా? భారతీయ జనతా పార్టీ లో ఎందరు నేతలు తమ వారసులను రాజకీయాల్లోకి తీసుకు రావడం లేదు .
సోనియాగాంధీతో విబేధాల కారణంగా బయటకు వచ్చిన మేనకాగాంధీ, ఆమె కుమారుడు వరుణ్ గాంధీ కుటుంబ రాజకీయాల కిందకు వస్తారా? రారా? మేనక కేంద్ర మంత్రిగా, వరుణ్ ఎమ్.పీగా బీజేపీ పక్షానే ఉన్నారు. రాజస్తాన్ లో రాజకుటుంబం అయిన వసుందర రాజే బీజేపీముఖ్యమంత్రిగా పనిచేశారు కదా? మరోసారి ఎన్నికల గోదాలోకి ప్రవేశిస్తున్నారు కదా? ఇలా రాష్ట్రాలవారీగా చూస్తే బిజెపిలో సైతం కుటుంబ రాజకీయాలకు తక్కువేమీ కాదు.
కాకపోతే ప్రధాని మోదీ వరకు తన కుటుంబీకులను ఎవరినీ రాజకీయాలలోకి తీసుకు రాలేదు. అదే సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడు క్రికెట్ బోర్డులో ఎలా ప్రముఖ పాత్రకు రాగలిగారు? కనుక మోదీ చేస్తున్న కుటుంబ రాజకీయాలు అన్న విమర్శకు అంత హేతుబద్దత కనిపించదు.
ఇదీ చదవండి: అవసరమైతే గాండీవం ఎత్తాలి.. బ్రాహ్మణులను హేళన చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు
కవితను ఈడీ అరెస్టు చేయలేదెందుకు?
ఇక అవినీతి గురించి కూడా ఘాటైన విమర్శలే చేస్తుంటారు. అటు కాంగ్రెస్ ను కానీ, ఇటు బీఆర్ఎస్ ను కాని ఈ విషయంలో దునుమాడుతుంటారు. కేసీఆర్ కుటుంబ అవినీతి రాష్ట్రాన్ని దాటి ఢిల్లీ వరకు పాకిందని ఆయన అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత పాత్రపై ఈడీ చేసిన ఆరోపణలను పురస్కరించుకుని మోదీ ఈ వ్యాఖ్య చేశారు.
ఢిల్లీలో ఆమ్ ఆద్మి పార్టీ ప్రభుత్వంలోని మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తదితరులు ఈ స్కామ్ లో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఈ రకంగా అవినీతి ఢిల్లీవరకు వచ్చిందని ఆయన అన్నారు. అది అంత సీరియస్ విషయం అయితే కేసీఆర్ కుమార్తెను ఎందుకు ఈడీ అరెస్టు చేయలేదని కాంగ్రెస్ ప్రశ్నిస్తుంటుంది. బీజేపీ, బీఆర్ఎస్ లు ఒకటేనని, అందుకు ఇదే నిదర్శనమని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు.
మరో సంగతి చెప్పాలి. వేల కోట్ల రూపాయల మేర బ్యాంకుల రుణాలు ఎగవేసిన పెద్దలు కొందరు బీజేపీలో చేరి రక్షణ పొందుతున్నారన్న విమర్శలకు ప్రధాని సమాధానం చెప్పవలసి ఉంటుంది. అదెందుకు గత ఎన్నికలకు ముందు ఏపీకి వచ్చి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును ఎటీఎమ్ మాదిరి వాడుకుంటూ అవినీతికి పాల్పడుతున్నారని మోదీ ఆరోపించారు. కాని ఆ తర్వాత కేంద్రం ఆ ఊసే పట్టించుకోలేదు.
అలాగే చంద్రబాబు పీఎస్ ఇంటిలో సోదాలు చేసి రెండువేల కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని సీబీటీడీ ప్రకటించింది. ఇది జరిగి నాలుగేళ్లు అయినా ఇంతవరకు అదేమైందో అదీగతీ లేదు. అలాగే ఆయా రాష్ట్రాలలో ఎన్నికల సమయంలో బిజెపియేతర ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతుంటారన్న విమర్శను బీజేపీఎదుర్కుంటోంది. ఎన్నికల సమయంలోనే ప్రధాని ఇలాంటి రాజకీయ ఉపన్యాసాలు చేయడం కాకుండా, ఆచరణలో కూడా అలాగే ఉంటున్నారన్న భావన కలిగించగలిగితే దేశానికి మంచిది. కానీ దురదృష్టవశాత్తు ఆ దిశగా మోదీ ఆలోచనలు ఉన్నట్లు కనిపించవు.
తెలంగాణలో అవినీతి పైన,ప్రాజెక్టులలో అక్రమాలపై కూడా మోదీ తన అభిప్రాయాలు చెప్పినా, ఎక్కువ సందర్భాలలో అవన్నీ ఉత్తమాటలుగానే మిగులుతుంటాయి. నిజంగానే ఏదైనా రాష్ట్ర ప్రభుత్వంలో భారీగా అవినీతి జరుగుతోందని కేంద్రం లేదా ప్రధాని నమ్మితే దానిని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలి. అలాకాని పక్షంలో ఎన్నికల స్పీచ్ గానే మిగిలిపోతుంది.ఒకవేళ అవినీతి అధికంగా జరిగిందని మోదీ నమ్ముతుంటే బండి సంజయ్‌ను పార్టీ పదవి నుంచి ఎందుకు తొలగించారన్న ప్రశ్న వస్తుంది. కేసీఆర్ కుటుంబంపైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుండే బండిని తొలగించడంలో మర్మమేమిటని కొందరు విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
అది ఒకరకమైన బెదిరింపే..
తెలంగాణకు బీఆర్ఎస్ ,కాంగ్రెస్‌లు ప్రమాదకరమని మోదీ అన్నారు. అది ఎలా ప్రమాదమో , బీజేపీ రావడం ఎలా ప్రమోదమో ఆయన చెప్పినట్లు అనిపించదు. కర్నాటకలో బీజేపీ ఓటమి పాలు కావడానికి అవినీతి ఆరోపణలు కూడా కారణమని అంటారు. కర్నాటక ఎన్నికలలో ఎంతసేపు మతపరమైన అంశాలపైనే బీజేపీమాట్లాడింది కానీ, బీజేపీ ప్రభుత్వ పాలన గురించి అవినీతి అబియోగాల గురించి సమాధానం ఇవ్వలేకపోయింది. దానివల్ల కూడా ఆ పార్టీ ఓటమి చెందింది.
ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తున్నా, వాటిని చాలాకాలంగా జనం వింటూనే ఉన్నారు. కేసీఆర్ అవినీతిపై దర్యాప్తు సంస్థలు గురి పెట్టాయని అనడం కూడా ఒకరకంగా బెదిరింపే అవుతుందేమో!మోదీ స్థాయి నేత మున్సిపల్ ఎన్నికలను ప్రాతిపదికగా తీసుకుని దానిని ట్రయల్అ నడం ఆశ్చర్యమే. ఒక్క మున్సిపాల్టీలో కూడా గెలవలేదు. కాకపోతే హైదరాబాద్ లో 45 డివిజన్‌లలో బీజేపీ విజయం సాధించింది. అంతవరకు బీజేపీకి క్రెడిట్టే. కాని దాని ఆధారంగానే రాష్ట్రంలో బీజేపీఅదికారంలోకి వస్తుందని మోదీ నమ్మితే అది భ్రమే అవుతుంది.
ఇదీ చదవండి: JP Nadda: బీజేపీ, బీఆర్‌ఎస్ ఎప్పుడూ ఒకటి కాబోవని చెప్పండి.. రాష్ట్ర బీజేపీ నేతలకు నడ్డా సీరియస్ క్లాస్
బలహీనపడిందా..?
నిరుద్యోగ సమస్య, యూనివర్శిటీలలో నియామకాల గురించి మోదీ మాట్లాడినదానికి ఇతరత్రా విమర్శలకు మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ లు గట్టి కౌంటరే ఇచ్చారు. ఈ తొమ్మిదేళ్లలో తెలంగాణలో ఏమీ జరగలేదని ప్రధాని అనడం కూడా సరికాదు. ఇంకా ఫలానా అభివృద్ది చేయాలని అడిగితే తప్పులేదు. లేదా బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణకు ఏమి చేస్తారో సూచనప్రాయంగా అయినా చెప్పి ఉండాల్సింది. కర్నాటక ఎన్నికలలో బీజేపీఓడిపోయిన తర్వాత తెలంగాణలో ఆ పార్టీ గ్రాఫ్ పడిపోవడం మోదీకి పెద్ద సవాలుగా మారింది.ఒక దశలో తెలంగాణలో బీజేపీబాగా పుంజుకుంటుందని ప్రజలలో నాటుకుంది.
కాని ఆ తర్వాత పరిణామాలలో ఈ పార్టీ బాగా వీక్ అయినట్లుగా ఉంది. కాంగ్రెస్ పార్టీనే బిఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యర్ధి అన్న భావన బలపడుతోంది. కేసీఆర్‌కు పోటీగా నిలబడే నేత ప్రస్తుతానికి తెలంగాణ బీజేపీలో లేరనే చెప్పాలి. అందువల్ల తన ఇమేజీపైనే మోదీ తెలంగాణ శాసనసభ ఎన్నికలలో బిజెపిని నడిపించవలసి ఉంది. లోక్ సభ ఎన్నికలలో ఆయన గ్లామర్ పనిచేస్తుందేమో కాని, అసెంబ్లీ ఎన్నికలలో ఎంతవరకు ఉపకరిస్తుందన్నది చెప్పలేం.ఈ నేపథంలో ప్రస్తుతం మోదీ ఎంత ఘాటు విమర్శలు చేసినా దాని ప్రభావం ఏ మేరకు ఉంటుందన్నది సందేహమే.
-కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
ఇదీ చదవండి: గులా'బీ టీమ్' గందరగోళం ఎట్లా? అధ్యక్షుడు జేపీ నడ్డాతో రాష్ట్ర నేతల మొర
Comments
Please login to add a commentAdd a comment