- మనకున్నది బలం కాదు వాపని తేల్చేసిన నాయకులు
- కాకినాడ సమీక్షలో పవన్ కు షాకిచ్చిన క్యాడర్
- టీడీపీతో కలిసి పని చేయలేమని స్పష్టీకరణ
మాకు బాగా పట్టున్న జిల్లాలివి.. ఇక్కడ ఎంతటి కొమ్ములు తిరిగిన నాయకుడిని అయినా ఓడిస్తాం.. మేము దిగనంతవరకే.. దిగితే ఆట మారిపోతుందన్న భ్రమల్లో ఉన్న పవన్ కళ్యాణ్ కు ఇప్పుడిప్పుడే వాస్తవ పరిస్థితి అవగతం అవుతోంది. వెక్కిరించేవాళ్ల ముందరే కాలు జారిపడిపోయే పరిస్థితులు గోచరిస్తున్నాయి. గోదావరి జిల్లాల్లో పవన్ ప్రభంజనం.. తుపాను రాబోతోంది.. మొత్తం ఈస్ట్.. వెస్ట్.. పవన్ ఈజ్ బెస్ట్ అన్నట్లుగా ఊదరగొట్టిన జనసైనికులు జనసేన ప్రధాన నాయకులుగా చెప్పుకున్నవాళ్లకు గత రెండు రోజులుగా వాస్తవాలు అర్థం అవుతున్నాయి.
జనాన్ని పోగేసి సభలు.. మీటింగులు పెట్టడం వేరు.. జనాన్ని తనవెంట నడిపించి వాళ్లతో ఓట్లు వేయించడం వేరు అన్నది అర్థం అర్థం అవుతోంది. కాకినాడ జిల్లాతో నియోజకవర్గం రివ్యూలు మొదలు పెట్టిన పవన్‌కు మొదట్లోనే గొంతులో అడ్డం పడిపోయింది. క్యాడర్ నుంచి.. ఓ మోస్తరు నాయకులవరకూ చెబుతున్న ఫీడ్ బ్యాక్ చూసి దిమ్మెత్తిపోయింది. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ను చెడ్డీ మీద కొట్టుకుంటూ నడిపిస్తాను అని అప్పట్లో వార్ణింగ్ ఇవ్వడం ఐతే ఇచ్చారు కానీ అక్కడ జనసేనకు అభ్యర్థే లేరు.
కాపులు మొత్తం చంద్రశేఖర్ వెంట ఉండడంతో పవన్ తరఫున పోటీ చేసి చేతులు కాల్చుకునేందుకు అభ్యర్థి కరువయ్యారు. రెండు జిల్లాల్లోని మొత్తం 34 స్థానాల్లో జనసేన దాదాపు పాతికపైగా సీట్లు గెలుస్తుంది అని భ్రమల్లో ఉంటూవచ్చిన వారికి ఇప్పుడు పట్టుమని పదిమంది అభ్యర్థులు కనిపించడం లేదు. ఎదురులేదని చెప్పుకున్న ఈస్ట్, వెస్ట్ గోదావరిలోనే ఇలా ఉంటె మిగతా జిల్లాల్లో పరిస్థితి ఏమిటన్నది పార్టీ పెద్దలకు అంతుపట్టడం లేదు.
వైఎస్సార్ కాంగ్రెస్ టికెట్ రాదని తెలుసుకున్న జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కూడా జనసేనలో చేరారు. ఈ క్రమంలోనే పవన్‌తో సమీక్షకు హాజరయ్యారు. అయన కూడా గ్రామ స్థాయిలో పార్టీకి ఏమీ బలం లేదని.. ఉన్నదంతా వాపేనని తేల్చి చెప్పారు. దీంతోబాటు తెలుగుదేశం కోసం సీట్లు త్యాగం చేసే పరిస్థితి లేదని, అలాగని టీడీపీతో పొత్తు పెట్టుకున్నా ఆ పొత్తు కలవదని, నిలవదని ఓట్ల బదలాయింపు జరగదని తేల్చి చెప్పేసారు. రెండు పార్టీల పొత్తు పొసగదని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా జిల్లా.. మండల కార్యవర్గాలను ఎందుకు వేయలేదని పవన్ ప్రశ్నించగా.. మీరెళ్ళి చంద్రబాబుకు ఊడిగం చేస్తుంటే మేము పార్టీని ఎలా మోస్తాం.. మేమెలా నిర్ణయాలు తీసుకుంటాం అని ఎదురు ప్రశ్నించడంతో పవన్ నోట మాట రాలేదని తెలిసింది.
చిత్తూరులో నాయకుల చిటపట
ఇదిలాఉంటే శనివారం కుప్పం పర్యటనకు వెళ్లిన చంద్రబాబు జనసేన జిల్లా సమావేశానికి హయారయ్యారు. చంద్రబాబును సీఎం చేసేందుకు అందరం కష్టపడాలి అని పార్టీ జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ చేసిన ప్రసంగం అక్కడ గలాటా రేపింది. కాసేపు ఉండి సమావేశం నుంచి చంద్రబాబు బయటకు వెళ్ళిపోగానే జనసైనికులు హరిప్రసాద్ మీద ప్రశ్నల దాడి చేశారు.
చంద్రబాబుకు మనం ఎందుకు ఊడిగం చేయాలి.. మనం పవన్ కోసం కదా పని చేస్తున్నాం. మీరు అలా మాట్లాడితే ఎలా అంటూ కుప్పం జనసైనికులు ప్రశ్నించేసరికి హరిప్రసాద్ నిరుత్తరుడయ్యారు. అధికారంలో సైతం జనసేనకు వాటా ఇవ్వాల్సిందేనని, ఆలాగైతేనే పొత్తు ఉంటుందని జనసైనికులు తేల్చి చెప్పేసారు.
- సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment