
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు అవినీతి కేసులో అరెస్టై జైలులో ఉంటే.. పవన్ కల్యాణ్ పరామర్శకు వెళ్లి పొత్తులు మాట్లాడుకున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. బీజేపీతో సంసారం చేస్తూనే టీడీపీతో పవన్ కలిశారని విమర్శించారు. స్కిల్ స్కాంలో పవన్ పాత్ర కూడా ఉందని.. చంద్రబాబు తన అవినీతిలో పవన్‌కు ఎంత వాటా ఇచ్చారని ప్రశ్నించారు. చంద్రబాబు చేసిన అవినీతి, అక్రమాల్లో పవన్ భాగస్వామి కాదా? అని నిలదీశారు.
పవన్, బాబులు కలిసే ఉన్నారని.. ఇప్పుడు కొత్తగా కలవడం ఏంటని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేసిన అవినీతి ప్రజలందరికీ తెలుసు అని.. చేసిన పాపాలు పండి బాబు జైలుపాలయ్యారని దుయ్యబట్టారు. వైఎస్ జగన్‌తో యుద్ధమంటే 5 కోట్ల మంది ప్రజలతో యుద్ధం చేయడమేనని అన్నారు. కోటిమంది డ్వాక్రా అక్కచెల్లెళ్ళపై, 66 లక్షల మంది అవ్వాతాతలు, వితంతువులు, వికలాంగుల మీద యుద్ధం చేయటమేనని పేర్కొన్నారు. సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమం, అభివృద్ధి జరుగుతోందని తెలిపారు.
చదవండి: అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లపై మంత్రి బుగ్గన సమీక్ష
‘ఇద్దరు మెంటల్ కేసుల మధ్యలో ఒక పీకే కనిపించాడు. పవన్ సినిమా తీయాలనుకుంటే ఇదే పేరు పెట్టుకోవచ్చు. ట్యాగ్ లైన్ కింద బొక్కలో బాబు, 7691 అని పెట్టుకోవచ్చు. చంద్రబాబు పరామర్శకి పవన్ వెళ్లినప్పుడు ఆయన బాగోగులు అడగాలి. జైలులోకి పవన్ వెళ్లేటప్పుడు బీజేపీతో ఉండి.. అక్కడ చంద్రబాబుతో తాళి కట్టించుకుని టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. బయటకు వచ్చాక పొత్తు ప్రకటన చేశారు.
రాజకీయాల్లోకి వచ్చాక సినిమా డైలాగులు వేస్తే కుదరదు. తండ్రి జైల్లో ఉంటే కొడుకు స్పెషల్ ఫ్లైట్‌లో ఢిల్లీ వెళ్లటానికి సిగ్గుండాలి. తన తండ్రి నిజ స్వరూపాన్ని లోకేష్ జాతీయ స్థాయిలో చెప్తాడంట. ఢిల్లీలో అందరి కాళ్లు పట్టుకోవటానికే లోకేష్ ఢిల్లీ వెళ్లారు. ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోచుకున్నారు. గంటకి కోటిన్నర చొప్పున లాయర్లకి ఇచ్చి వాదించినా కోర్టులు నమ్మలేదు. చంద్రబాబు, పవన్ పొత్తుల గురించి ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా?. ఇవ్వాళ కొత్తగా పొత్తు గురించి చెప్పాలా? ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా గోదావరి, కృష్ణానదిలో కొట్టుకుపోవాల్సిందే’నని జోగి రమేష్ దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment