2014లో బీసీలకు 143 వాగ్దానాలిచ్చి అమలు చేయని ఘనుడు చంద్రబాబు
మంత్రులు చెల్లుబోయిన, జోగి రమేష్
సాక్షి, అమరావతి: బీసీ డిక్లరేషన్ అబద్ధాల వీరులు చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ మరో మోసానికి తెర తీశారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు, గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాసులు కాదు–బ్యాక్ బోన్ క్లాసులనే వైఎస్సార్‌సీపీని కాపీ కొట్టారని ధ్వజమెత్తారు. ఈ మేరకు వారిద్దరూ మంగళవారం ప్రకటన జారీ చేశారు.
బీసీలంటే బ్యాక్ బోన్ క్లాసులని వైఎస్సార్‌సీపీ 2019 ఎన్నికల ముందు ఏలూరు డిక్లరేషన్‌లో చెప్పిన మాటల్ని గుర్తు చేశారు. 2014 ఎన్నికల సందర్భంగా బీసీలకు 143 వాగ్దానాలిచ్చిన టీడీపీ అందులో ఒకటి కూడా అమలు చేయలేదని గుర్తు చేశారు. ఇప్పుడు 50 ఏళ్లకే పెన్షన్, బీసీ సబ్‌ప్లాన్ ద్వారా ఐదేళ్లలో రూ.లక్షన్నర కోట్లు ఖర్చు సహా పలు కల్లబొల్లి హామీలు గుప్పిస్తున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో ఏ ఒక్క బీసీ వర్గం ప్రజలు బాబు, పవన్‌ను నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. వీరు ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌కు ఎలాంటి విలువ లేదన్నారు. 40 ఏళ్ల బాబు రాజకీయ జీవితంలో బీసీల్ని బాగా వాడుకుని చివరికి కత్తెర్లు, ఇస్త్రీ పెట్టెల కులాలుగా అవమానించే సంస్కృతి నుంచి బయటపడలేదన్నారు.
రూ.2.55 లక్షల కోట్ల జమ
గడచిన 57 నెలల పాలనలో తమ ప్రభుత్వం డీబీటీ ద్వారా పేదల ఖాతాల్లోకి రూ.2.55 లక్షల కోట్లు జమ చేసిందని మంత్రులు చెల్లుబోయిన, జోగి రమేష్ గుర్తు చేశారు. అందులో బీసీలకు డీబీటీ, నాన్ డీబీటీ కలిపి రూ.1.71 లక్షల కోట్ల మేర మేలు చేశామన్నారు. బాబు అధికారంలోకి వస్తే ఐదేళ్లలో రూ.లక్షన్నర కోట్ల మేర మేలు చేస్తామంటున్నారని, ఈ లెక్కన పరిశీలిస్తే తమ ప్రభుత్వం చేసిన దానికంటే రూ.25 వేల కోట్లు తక్కువే చేస్తామని అంటున్నారని పేర్కొన్నారు.
2014లో బీసీలకు ఏటా రూ.10 వేల కోట్లు బడ్జెట్ లో కేటాయిస్తానని, చివరకు రూ.19 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసి బాబు దగా చేశారన్నారు. నిరుపేదలైన బీసీల పిల్లలకు ఇంగ్లిష్ మీడియం విద్య, ఇళ్ల పట్టాలు పంపిణీపై కోర్టులకు వెళ్లి అడ్డుకున్నారన్నారు. బీసీలకు అమరావతిలో ఇళ్ల పట్టాలు ఇస్తే డెమోగ్రఫిక్ ఇంబ్యాలన్స్ వస్తుందన్న ఘనుడు బాబు అన్నారు. బీసీ అక్కచెల్లెమ్మలకు ఈ రోజు ఇస్తున్న చేయూత వంటి పథకం 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన బాబు ఏ ఒక్క రోజైనా అమలు చేశారా అని నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment