చంద్రబాబు కోసం పవన్‌ ఏ గడ్డయినా తింటారు: మంత్రి జోగి రమేష్‌ | Minister Jogi Ramesh Comments On Pawan Kalyan And Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు కోసం పవన్‌ ఏ గడ్డయినా తింటారు: మంత్రి జోగి రమేష్‌

Published Sun, Dec 31 2023 11:46 AM | Last Updated on Sun, Dec 31 2023 2:29 PM

Minister Jogi Ramesh Comments On Pawan Kalyan And Chandrababu - Sakshi

సాక్షి, తాడేపల్లి:  రాష్ట్రంలో పేదల ఇళ్ల స్థలాల సేకరణ, ఇళ్ల నిర్మాణాల్లో అవినీతి జరిగినట్లు ప్రధాని మోదీకి జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ లేఖ రాయటంపై మంత్రి జోగి రమేశ్ మండిపడ్డారు. ఆ లేఖలో సీబీఐతో పాటు ఈడీ ఎంక్వైరీ చేయాలని పవన్ కల్యాణ్‌ కోరారు.  అసలు జనసేన అధ్యక్షుడు ఏ ఆధారాలతో లేఖ రాశారని జోగి రమేశ్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా జోగి రమేశ్ ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణాలపై వివరాలను వెల్లడించారు. 30.65 లక్షల అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను, ఇళ్ల నిర్మాణ ప్రక్రియను ప్రతిపక్షాలు అడ్డుకోవాలని చూస్తున్నాయని అన్నారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణాల పేద అక్కచెల్లెమ్మలకు ఇస్తున్న ఇళ్లలో స్కాం జరిగిందంటూ ప్రధానికి లేఖ రాయటం సరికాదు. ప్రధాని మోదీకి పవన్ కల్యాణ్‌ రాసిన 13 అంశాలపై మీడియా ద్వారా పూర్తి వివరాలతో సమాధానాన్ని పంపిస్తున్నానని జోగి రమేశ్ తెలిపారు.  ఒక్క రూపాయి అవినీతి జరగలేదు. అంతా ఆన్‌లైన్‌ పేమెంట్లు. మరి, అవినీతికి ఆస్కారం ఎక్కడ పవన్‌?, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పవన్ కల్యాణ్‌కు ఇళ్లు ఉందా? ఆధార్ కార్డు ఉందా? డోర్ నెంబర్ ఉందా? కనీసం ఓటు అయినా ఉందా? ఎంత దుర్మార్గులు మీరు. పచ్చి దుర్మార్గుడు అయిన చంద్రబాబు తాబేదారు పవన్ కల్యాణ్‌ ఏ గడ్డి అయినా కరవటానికి సిద్ధపడతాడు. 75 ఏళ్ల దేశ చరిత్రలో ఇప్పటి వరకు జరగనటువంటి అభివృద్ధి, సంక్షేమం నాలుగేళ్ల ఎనిమిది నెలల్లో ఇంత అభివృద్ధి జరుగుతోంది. 

జగనన్న ముఖ్యమంత్రి కాగానే.. పాదయాత్రలో కష్టాలు, కన్నీళ్లు పడ్డ అక్కచెల్లెమ్మలు, నిరుపేదలు గూడులేక నిరాశ్రయులుగా ఉన్న వారికి సీఎం జగన్ అడ్రస్ ఇచ్చారు. ఎప్పటి నుంచో కలలుగా మిగిలిపోయిన 30.65 లక్షల పేదింటి అక్కచెల్లెమ్మల సొంతింటి కలను సీఎం జగన్ నిజం చేశారు. అక్కచెల్లెమ్మలకు పట్టాలు ఇవ్వటంతో పాటు ఇప్పటికే వారిలో 21.75 లక్షల మందికి గృహ నిర్మాణం చేపట్టారు. కొన్ని లక్షల అక్కచెల్లెమ్మలు గృహ ప్రవేశాలు చేసుకుని జయహో జగనన్న అని నినదిస్తున్నారు. మరి, ఇందులో స్కాం జరుగుతోందా? ఇంటి నిర్మాణానికి చేతికి డబ్బులు ఇవ్వట్లేదు. ప్రతి ఒక్కటీ ఆన్‌లైన్ పేమెంట్ జరుగుతోంది. బుర్ర లేకుండా స్కాం అని పవన్ కల్యాణ్‌ అనటం ఏమిటి? ఎక్కడ ఏమి జరుగుతుందో తెలియకుండా పేదల గృహాల మీద స్కాం అని లేఖ రాయటమా? 

గతంలో చంద్రబాబు నెరవేర్చని హామీలను ఏనాడైనా ప్రశ్నించావా పవన్‌
గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌, బీజేపీ కలిసే పోటీ చేశారు. ఇళ్ల స్థలం లేని అక్కచెల్లెమ్మలకు మూడు సెంట్ల స్థలం ఇస్తామని ఆనాడు హామీలు ఇచ్చారు. మరి, ఆ హామీలు నెరవేర్చారా? దానిపై ఏనాడైనా చంద్రబాబును పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించాడా? రైతు రుణమాఫీ అంటూ రైతుల్ని చంద్రబాబు నట్టేట ముంచాడు. ఆ పాపంలో భాగస్వామిగా ఉన్న పవన్ ఏనాడైనా ప్రశ్నించాడా? డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల్లో వాగ్ధానం చేశామని ఎందుకు చేయలేదని చంద్రబాబును ఎప్పుడైనా పవన్ కల్యాణ్‌ ప్రశ్నించాడా? ఇంటికో ఉద్యోగం ఇస్తామని చంద్రబాబు మోసం చేశారు. దానిపైన చంద్రబాబును ఏనాడైనా పవన్ కల్యాణ్‌ ప్రశ్నించాడా? 14 ఏళ్ల పాటు సీఎంగా చేసిన చంద్రబాబు ఇళ్లస్థలాలు ఇవ్వలేని దద్దమ్మ. కానీ ఈనాడు సీఎం జగన్ ఇళ్ల స్థలాలు ఇవ్వటమే కాకుండా, ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. ఇంత మంచి చేస్తున్న సీఎం జగన్ మోహన్ రెడ్డికి పవన్ కల్యాణ్‌ సెల్యూట్ చేయకుండా స్కాం జరుగుతోందంటూ లేఖలు రాయటం ఏమిటి? 

రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా సీఎం జగన్ మార్క్ కనిపిస్తుంది. మరి, చంద్రబాబు తన మార్క్ చూపించగలడా?,చంద్రబాబు, పవన్ కల్యాణ్‌, లోకేశ్‌లు కోరుకున్న గ్రామానికి వెళ్దాం. వారి మార్క్‌ ఏ ఒక్కటి ఉన్నా చెప్పండి. ఈరోజున రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా వైఎస్ జగన్ మార్క్ కనపడుతుంది. ఇదిగో.. సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్‌నెస్‌ సెంటర్, నాడు-నేడు ద్వారా రూపురేఖలు మారిన స్కూల్స్, 108, 104.. ఇలా సీఎం జగన్ ముద్ర ప్రతి గ్రామంలో స్పష్టంగా కనపడుతుంది. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించటమే కాదు.. చూపిస్తున్నారు. కుప్పంలో ఏ గ్రామానికి అయినా వెళ్దాం. అంతెందుకు నారావారిపల్లెకు వెళ్లినా జగనన్న మార్క్ కనపడుతుంది. మరి, రాష్ట్రంలో  చంద్రబాబు మార్క్‌ ఎక్కడ ఉందో చూపించండి. 

ఇంత కడుపు మంట మీకు ఎందుకు రా బాబూ. 
రాష్ట్రంలో శరవేగంగా ఇళ్ల నిర్మాణం జరుగుతూ.... జయహో జగనన్న అంటుంటే.. కడుపుమంట, కడుపు ఉబ్బరంతో ప్రతిపక్ష నాయకులు ఉడికి పోతున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, అగ్రవర్ణ నిరుపేదలపై ప్రతిపక్షాలు ఎందుకు విషం చిమ్ముతున్నాయి. చంద్రబాబు, పవన్, లోకేశ్‌ ఎక్కడికంటే అక్కడకి పోదాం. ప్రజలను అడుగుదాం. ఎవరు మేలు చేశారో ప్రజలే చెబుతారు. ఇప్పుడు చంద్రబాబు కుప్పంలో ఎయిర్‌పోర్టు కడతారంట. కుప్పంలో ఎయిర్‌పోర్టా? 14 ఏళ్లలో సీఎంగా ఉన్నప్పుడు ఏం చేశావు చంద్రబాబు. కుప్పంలో పంటలు పండిస్తే.. అంతర్జాతీయ మార్కెట్‌లో అమ్ముతారంట. కనీసం కుప్పం ప్రజలకు గుక్కెడు మంచినీళ్లు చంద్రబాబు ఇవ్వలేదు. ఆర్‌డీఓ ఆఫీసు తెచ్చుకోలేదు. రెవిన్యూ డివిజనల్ ఆఫీసు జగన్ గారు కుప్పం ప్రజలకు ఇచ్చారు. పేద ప్రజలు ఇళ్లు కట్టుకుని సంతోషంగా ఉన్నా విషం కక్కుతున్నారు. 

పవన్‌ కల్యాణ్‌ లేఖపై చర్చకు సిద్ధం. పవన్‌ కల్యాణ్‌ సిద్ధమా?
పవన్‌ కల్యాణ్‌ లేఖలో ప్రతి అంశం మీద చర్చించటానికి సిద్ధంగా ఉన్నాను. చర్చకు పవన్‌ కల్యాణ్‌ రావాలి. ఎక్కడైనా ఒక్క రూపాయి తేడా ఉందో చూపించండి. ఎన్నికలు వస్తున్నాయని రాష్ట్రానికి రావటం హోటల్‌లో పడుకోవటం. ఒక గంట కార్యకర్తలతో మాట్లాడి.. 23 గంటలు పడుకోవటం పవన్ కల్యాణ్‌  చేస్తున్నారు. కాకినాడ చుట్టుప్రక్కల అభివృద్ధి ఎలా జరుగుతుందో వెళ్లి చూడు పవన్‌ కల్యాణ్‌. నేడు 17వేలకు పై చిలుకు జగనన్న కాలనీలు కడుతున్నాం. కట్టేవి ఇళ్లు కాదు. ఊళ్లకు ఊళ్లే వేగంగా శరవేగంగా నిర్మాణం జరుగుతున్నాయి. పేదల హృదయాల్లో చిరస్థాయిల్లో నిలబడాలని కోరుకుంటున్నాడు కాబట్టే.. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసి చూపిస్తున్నారు. రూ.2.50 లక్షల కోట్లు డీబీటీ ద్వారా సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు అందించారు. ప్రతి ఇంటిలో ఆనందం.. ప్రతి గ్రామంలో అభివృద్ధిని సీఎం జగన్ చేసి చూపిస్తున్నారు. ఇంతకన్నా ఏమి కావాలి? కళ్లు కుట్టి.. కడుపు మంటతో పచ్చ రోగుల్లా.. ప్రధానికి లేఖలు రాస్తున్నారు. 

పేదల ఇళ్లపై కాదు.. చంద్రబాబు అవినీతిపై ప్రధానికి లేఖ రాయి పవన్‌
పవన్‌ కల్యాణ్‌ లేఖ రాయాల్సింది గృహ నిర్మాణాల మీద కాదు.. స్కిల్‌ డెవలప్‌మెంట్ స్కాం మీదనో.. చంద్రబాబు మీద జరిగిన ఐటీ రైడ్స్‌ మీదనో లేఖలు రాయాలి. త్వరలో మేం కూడా చంద్రబాబు అవినీతి మీదన లేఖ రాయబోతున్నాం. చంద్రబాబు దోచేసిన స్కిల్ స్కాంలో పవన్‌ కల్యాణ్‌కు ఎంత ముట్టింది? పవన్‌ కల్యాణ్‌కు ఏ విధంగా మనీలాండరింగ్ జరిగింది. ఎంత ప్యాకేజీ తీసుకున్నాడో లేఖ రాస్తాం. చంద్రబాబు హయాంలో ఐటీ, ఈడీ రైడ్స్ చేస్తే తప్పు. పవన్‌ దృష్టిలో చంద్రబాబు నోట్లో వేలు పెడితే కొరకలేని వాడు. చంద్రబాబు అవినీతిపై పవన్‌ లేఖలు రాయడు. ఎందుకు అంటే.. చంద్రబాబు దగ్గర పవన్ ప్యాకేజీ తీసుకున్నాడు కాబట్టి. 

గతంలో గ్యాస్‌కు నెలకు రూ.100 సబ్సిడీ అని రూ.7200 చంద్రబాబు ఎగ్గొట్టాడు. రేపో మాపో ఎన్నికలకు వెళ్తాం. చంద్రబాబు, పవన్ చేసే దుర్మార్గాలు ప్రజలకు తెలియవా? ఇద్దరు కలసి సూపర్ 6 అని మేనిఫెస్టో పెడతారంట. సీఎం కాకముందు ప్రజలు అది ఇస్తా.. ఇది ఇస్తా అని చెబుతారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు ఫ్రీగా బస్సు ఎందుకు ఇవ్వలేదు. గ్యాస్ బండ్లు ఎందుకు ఇవ్వలేదు. 2014లో గ్యాస్ సిలిండర్‌కు నెలకు రూ.100లు చొప్పన ఐదేళ్లకు రూ.7200 ఇస్తానని చెప్పి నయాపైసా అక్కచెల్లెమ్మల అకౌంట్లలో వేయలేదు. ఇవాళ గ్యాస్ సిలిండర్లు అంటే అక్కచెల్లెమ్మలు నమ్ముతారా? ఆ గ్యాస్ సిలిండర్లతోనే మిమ్మల్ని కొడతారు. 

2024 ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీదే విజయం
ప్రతిపక్ష పార్టీలు పొత్తులు.. ఎంతమందితో పెట్టుకున్నా.. వైఎస్ఆర్‌సీపీని ఇంచు కూడా కదిపించలేరు. 2024 ఎన్నికల్లో మళ్లీ వైఎస్ఆర్‌సీపీ విజయదుందిభి మోగించబోతోంది. జగన్ మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. దీన్ని ఎవ్వరూ ఆపలేరు. 

ఇళ్ల స్థలాలుపై వివరాలు ఇవిగో పవన్..
ప్రభుత్వ ఎంత ఇచ్చామో, ప్రైవేటు వ్యక్తుల నుంచి ఎంత భూమి కొనుగోలు చేశామో వివరాలు పంపిస్తున్నాము. ఎక్కడా కూడా నయాపైసా తేడా ఉండదు. పేపర్, పెన్ను ఉందని ఇంగ్లీషులో నాలుగు మాటలు రాసి ప్రధాని మోడీకి పంపించటం కాదు. ప్రధాని మోడీని ఏమి అడగాలి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం, రైల్వే జోన్‌ ఇవ్వమని అడగాలి. కేంద్రంలో బీజేపీతో రాష్ట్రంలో టీడీపీతో లింకులు. గృహ నిర్మాణానికి ఇస్తున్న డబ్బులు సరిపోవట్లేదు. ఇంకా పెంచమని మోడీని పవన్‌ కల్యాణ్‌ అడిగితే ప్రజలు హర్షిస్తారు. గృహాలు కట్టుకుని సంతోషంగా ఉన్న పేదింటి అక్కచెల్లెమ్మలపై కడుపు మంట ఎందుకు? గృహాలు, ఇళ్ల స్థలాల వివరాలను పవన్‌ కల్యాణ్‌కు పంపిస్తున్నాం. 

మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సామాజిక సాధికార యాత్ర చూసిన తరువాత చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. చంద్రబాబు పార్టీలో ఏ ఒక్క బీసీలు మిగల్లేదు. గత ఎన్నికల ముందు కూడా జయహో బీసీ అని రాజమండ్రిలో చంద్రబాబు సభ పెట్టాడు. అది అట్లర్‌ ప్లాఫ్ అయిపోయింది. ఈరోజు బీసీలు ఎవ్వరూ టీడీపీలో లేరు. చంద్రబాబు ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా.. ఎన్ని పనికిమాలిన వాగ్ధానాలు చేసినా టీడీపీని బీసీలు ఎవ్వరూ నమ్మరు. ఒకప్పుడు బీసీలు టీడీపీని నిలబెడితే వారిని చంద్రబాబు తన్ని తరిమేశారు. నేడు బీసీలు అంతా సీఎం జగన్‌ వెంట అడుగులో అడుగు వేస్తున్నారు. రాష్ట్రంలో టీడీపీ భూస్థాపితం కావటం ఖాయం.

ఇదీ చదవండి: 2023 సుభిక్షం.. సంతోషం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement