సాక్షి, అమరాతి: ప్రజల్లో గుర్తింపు లేని చంద్రబాబు, ఎన్నికల కమిషన్ వద్ద గుర్తింపులేని పవన్ కళ్యాణ్.. వారిద్దరూ కలిసి వైఎస్సార్‌సీపీని ఏం చేయగలరని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. అన్ని స్థానాల్లో పోటీ చేసే దమ్ము జనసేనకు ఉందా అని పవన్‌ను నిలదీశారు. ఓటమికి కారణాలను ముందే వెతుక్కుంటున్నారని, ఎన్నికలకు ముందే అస్త్ర సన్యాసం చేశారని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉండగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర పూర్తయి ఐదేళ్ళు అయిన సందర్భంగా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్రం కార్యాలయంలో మంగళవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుకు ఓటమి ఖాయమని, కుప్పం ప్రజలు తరిమికొడతారని ఆయనకు తెలిసిపోయిందని అన్నారు. సీఎం వైఎస్ జగన్‌ను ఎదుర్కోలేమని తెలిసి ఇద్దరూ కలిసి ఎన్నికల కమిషన్ వద్దకు వెళ్లి వైఎస్సార్‌సీపీపై బురద చల్లుతున్నారని అన్నారు. ఒక రోజు లక్షల ఓట్లు తొలగించారని, మరో రోజు లక్ష ఓట్లు జోడించారని ఎల్లో మీడియాతో పచ్చి అబద్ధాలు రాయిస్తున్నారన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లేక ఎన్నికల కమిషన్‌కు తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని చెప్పారు. అసలు 175 నియోజకవర్గాలలో పోటీ చేయటానికి టీడీపీ, జనసేనకు అభ్యర్థులు ఉన్నారా అని ప్రశ్నించారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ... దళితులను అక్కున చేర్చుకున్న నేత సీఎం జగన్ అని అన్నారు.
చంద్రబాబు దళితులను అడ్డు పెట్టుకుని రాజకీయాలు మాత్రమే చేస్తారని, చేసే మేలేమీ ఉండదని విమర్శించారు. దళితులపై పవన్ ఆరోపణలు సరికాదన్నారు. కుప్పంలో చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే ముందుగానే దొంగ ఓట్లు అంటూ హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ అధికార ప్రతినిధులు నారాయణమూర్తి, రాజశేఖర్, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment