తెలంగాణ ఎన్నికల యుద్ధానికి కాంగ్రెస్ కసరత్తులు చేస్తోంది. ఒక్కో జిల్లాలో చేరికల మీద దృష్టి సారిస్తోంది. కాంగ్రెస్ దూకుడుతో పలు జిల్లాల నుంచి అసంతృప్త నేతలు హస్తం గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారని టాక్. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కూడా పలు కీలక నేతల కారు దిగేందుకు రెడీ అవుతున్నట్లు చెబుతున్నారు. ఏయే నేతలు ఆ జాబితాలో ఉన్నారో తెలుసుకుందాం..
ఒకప్పుడు గ్రేటర్ సిటీ చుట్టూ విస్తరించి ఉన్న రంగారెడ్డి జిల్లా ఇప్పుడు మూడు జిల్లాలుగా విడిపోయింది. మూడు జిల్లాల్లోనూ గులాబీ పార్టీ బలమైన కోటలు నిర్మించుకుంది. మూడు జిల్లా పరిషత్‌లు బీఆర్‌ఎస్ చేతిలోనే ఉన్నాయి. ఇప్పుడు గులాబీ కోటల్ని స్వాధీనం చేసుకోవడానికి హస్తం పార్టీ ప్లాన్ వేస్తోంది.
కారు, కమలం పార్టీల్లో సీట్లు రావని ఫిక్స్ అయినవారిని, అసంతృప్తితో ఉన్నవారిని హస్తం గూటికి చేర్చేందుకు రేవంత్ టీమ్ వ్యూహ రచన చేస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచే ఎంపీగా గెలిచిన రేవంత్‌కు ఇక్కడ పట్టు సాధించడం కష్టంగా మారింది. గ్రేటర్ ఎన్నికల్లో కారు, కమలం పార్టీలకు హస్తం పార్టీ కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. అందుకే వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పట్టు సాధించేందుకు ప్లాన్ చేస్తున్నారాయన.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ముగ్గురు జడ్పీ ఛైర్ పర్సన్లు అధికార పార్టీలోనే ఉన్నప్పటికీ నాయకత్వం మీద అసంతృప్తితో రగిలిపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో తమ వారికి టికెట్లు దక్కని పక్షంలో కారు దిగి వెళ్ళేందుకు రెడీ అవుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గా ఉన్న తీగల అనితారెడ్డి.. తన మామ తీగల కృష్ణారెడ్డికి మహేశ్వరం టికెట్ దక్కని పక్షంలో కాంగ్రెస్ గూటికి వెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటున్నారనే టాక్ నడుస్తోంది. ఇక మేడ్చల్ జడ్పీ ఛైర్మన్‌గా ఉన్న శరత్ చంద్రారెడ్డి.. తన తండ్రి సుధీర్ రెడ్డికి గులాబీ పార్టీలో టికెట్ కన్ఫర్మ్ కాకపోతే.. కారు దిగేందుకు రెడీ అవుతున్నారట.
(చదవండి: ఖాళీగా ఉన్న పదవులకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు?: హైకోర్టు)
వికారాబాద్ జడ్‌పీ ఛైర్ పర్సన్‌గా ఉన్న పట్నం సునీతారెడ్డి.. తన భర్త పట్నం మహేందర్ రెడ్డికి తాండూరు టికెట్ ఆశిస్తున్నారు. టిక్కెట్ రాకపోతే కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారని ప్రచారం జరుగుతోంది. ఈ ముగ్గురు జడ్పీ ఛైర్మెన్లకు కాంగ్రెస్ పార్టీ వల విసిరినట్లు తెలుస్తోంది.
అయితే ముగ్గురు జడ్పీ ఛైర్మన్లు పార్టీ మారకుండా.. అధికార బీఆర్ఎస్ కట్టడి చేసేందుకు సిద్ధమవుతోంది. జడ్పీ ఛైర్మన్ల కాలపరిమితిలో నాలుగేళ్లు పూర్తికావస్తున్నందున గీత దాటితే అవిశ్వాస తీర్మానంతో వేటు వేయడానికి గులాబీ పార్టీ సిద్ధమవుతోంది.
జడ్‌పీ చైర్‌పర్సన్స్ కుటుంబాలు మాత్రమే కాకుండా ఇంకొంతమంది నేతలు కూడా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో టచ్ లోకి వెళ్లినట్లు ప్రచారం సాగుతోంది. బీజేపీలో అసంతృప్తితో రగిలిపోతున్న మాజీ మంత్రి చంద్రశేఖర్ కాంగ్రెస్ నాయకత్వంతో చర్చించి పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
చంద్రశేఖర్ చేవెళ్ల నుంచి హస్తం పార్టీ తరపున బరిలో దిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారట. ఆగస్టు తొలివారంలోనే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఆపరేషన్ ఆకర్ష్ పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారట. మరి వీరంతా హస్తం పార్టీకి చిక్కుతారా? కారులోనే ఉండిపోతారా? అనేది ఆసక్తికరంగా మారింది.
(చదవండి: ఈసారి పక్కా ప్లాన్‌తో ఎర్రన్నలు.. అందుకే ఈ మౌనం.. 30 సీట్లలో ముందుంటే చాలు)
Comments
Please login to add a commentAdd a comment