హుజూర్‌నగర్/చిలకలగూడ/ముషీరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అవినీతి, కుటుంబ పార్టీలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. ఆ రెండు పార్టీలు రాష్ట్రాన్ని భ్రషు్టపట్టిస్తుండటంతో అభివృద్ధి పూర్తిగా ఆగిపోయిందని విమర్శించారు. అందువల్ల ఆ పార్టీలను ఇంటికి పంపి బీజేపీకి పట్టం కట్టాలని ప్రజలను కోరారు. శనివారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభతోపాటు హైదరాబాద్‌లోని చిలకలగూడ, వారాసిగూడ, ముషీరాబాద్‌లలో చేపట్టిన రోడ్ షోలో ఆయన ప్రసంగించారు.
సకలజనులు ఏకమై కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఒక కుటుంబం చేతిలో బందీ కావడం బాధాకరమని వ్యాఖ్యానించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి కోసం ఎన్నో నిధులు పంపిస్తుంటే.. తెలంగాణ ప్రభుత్వం ఈ నిధులను దుర్వినియోగం చేస్తోందని నడ్డా ఆరోపించారు. ధరణి పోర్టల్ తెచ్చి నిరుపేదల అసైన్డ్ భూములను అందులో నమోదు చేయలేదని, ధరలు పెరిగాక వాటిని గుంజుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలు పెంచి కేసీఆర్ దోపిడీ చేశారని ఆరోపణలు గుప్పించారు. దళితబంధు పథకం సొమ్మును లబ్దిదారులకు అందించేందుకు ఎమ్మెల్యేలు 30 శాతం లంచాలు తీసుకుంటున్నారని స్వయంగా కేసీఆర్ చెప్పారని ఆయన గుర్తుచేశారు. పీఎం ఫసల్ బీమా యోజన, గ్రామీణ్ ఆవాజ్ యోజనను రాష్ట్రంలో అమలు చేయకపోవడం వల్ల రైతులకు రూ. వేలల్లో నష్టం జరిగిందని నడ్డా పేర్కొన్నారు.
కాంగ్రెస్ హయాంలో ఎన్నో స్కామ్‌లు...
కాంగ్రెస్ అంటే అవినీతికి నిలువుటద్దమని, కాంగ్రెస్ హయాంలో అనేక స్కామ్‌లు జరిగాయని నడ్డా ఆరోపించారు. అటువంటి పార్టీని, నాయకులను నమ్మొద్దని, గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మరోమారు మోసం చేసేందుకు సిద్ధమైందని ఆయన దుయ్యబట్టారు.
‘డబుల్ ఇంజిన్’తో మరింత అభివృద్ధి..
మోదీ పాలనలో ఒక్క స్కామ్ కూడా జరగలేదని నడ్డా చెప్పారు. దేశ సుస్థిరత, సమగ్రత, ప్రజాసంక్షేమం బీజేపీతోనే సాధ్యమన్నారు. తెలంగాణలో బీజేపీని గెలిపిస్తే డబుల్ ఇంజిన్ సర్కార్‌తో రాష్ట్రం మరింత అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. యువతకు, మహిళలకు, రైతులకు మేలు కలగాలంటే అది బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు.
ఏడాదికి నాలుగు సిలిండర్లు ఫ్రీ..
తెలంగాణలో బీజేపీని గెలిపిస్తే బీసీని సీఎం చేస్తామని, ఏటా ఉచితంగా 4 గ్యాస్ సిలిండర్లు, వరి క్వింటాల్‌కు రూ. 3,100 మద్దతు ధర ఇస్తామని, ఎరువులకు సబ్సిడీ పెంచుతామని నడ్డా హామీ ఇచ్చారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను పారదర్శకంగా 6 నెలల్లోగా భర్తీ చేస్తామని, ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ కింద రూ. 5 లక్షల బీమాను రూ. 10 లక్షలకు పెంచుతామని చెప్పారు. తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment