ప్రభుత్వంపై బురదజల్లడమే పచ్చపత్రికల పని | Kakani Govardhan Reddy And Nagireddy Fires On Yellow Media | Sakshi
Sakshi News home page

ప్రభుత్వంపై బురదజల్లడమే పచ్చపత్రికల పని

Published Fri, Dec 9 2022 4:06 AM | Last Updated on Fri, Dec 9 2022 4:06 AM

Kakani Govardhan Reddy And Nagireddy Fires On Yellow Media - Sakshi

నెల్లూరు (సెంట్రల్‌)/సాక్షి,అమరావతి: రాష్ట్రంలోని రైతులకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనేక సం­క్షేమ పథకాలను అమ­లు­­­చేస్తుంటే పచ్చపత్రికలు మాత్రం ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి, అగ్రిమిషన్‌ వైస్‌ చైర్మన్‌ నాగిరెడ్డి మండిపడ్డారు. నెల్లూరులో గురువారం మంత్రి కాకాణి, తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నాగిరెడ్డి  మీడియాతో మాట్లాడారు. వారేమన్నారంటే..

ధాన్యం సగటు ఉత్పత్తి గతంలో కంటే 13 లక్షల నుంచి 14 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు పెరిగిందని మంత్రి కాకాణి గుర్తుచేశారు. రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకు అమ్ముకుంటున్నారని.. ఎప్పుడైతే బయట మార్కెట్‌లో మద్దతు ధర లభించదో అప్పుడు రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలి­పారు.

ఈ కొనుగోలుకు ఎలాంటి లక్ష్యాలంటూ లేవని, రైతుల నుంచి ఎంత వచ్చినా కొనుగోలు చేస్తామన్నారు. కానీ, కొందరు ధాన్యం కొనడంలేదని అసత్య కథనాలు రాయడం సిగ్గుచేటన్నారు. ఇక నాబార్డు నుంచి రుణాలు పొంది సివిల్‌ సప్‌లైస్‌ కార్పొరేషన్‌ను పీకల్లోతు నష్టాల్లోకి నెట్టింది చంద్రబాబు కాదా?.. రైతులకు చెల్లించాల్సిన నాబార్డు రుణాలను చెల్లించకుండా పసుపు–కుంకుమ పేరుతో నిధులను దారిమళ్లించిన ఘనత చంద్రబాబుది కాదా? అని మంత్రి ప్రశ్నించారు.

అప్పటికీ రైతులకు చెల్లించాల్సిన బకాయిలను వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత రైతులకు చెల్లించారని గుర్తుచేశారు. కానీ, పచ్చపత్రికలు ఇవేమీ తెలుసుకోకుండా అడ్డగోలు వార్తలు రాస్తూ ప్రభుత్వంపై బురదజల్లుతున్నా­యని కాకాణి మండిపడ్డారు. 

ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగింది : నాగిరెడ్డి
ఇక రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీ­యంగా పెరిగిందని అగ్రి­మి­షన్‌ వైస్‌ చైర్మన్‌ నాగిరెడ్డి అన్నారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో సరాసరి 153.95 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తయితే.. గత మూడేళ్లలోనే (ప్రస్తుత ఖరీఫ్‌ మినహా) 167.24 లక్షల టన్నుల దిగుబడి వచ్చిందన్నారు. పచ్చ పత్రికలకు అభివృద్ధి కనిపించట్లేదని ఆయన మండిపడ్డారు.

అలాగే, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కపైసా కూడా రైతు నష్టపోకూడదని రవాణా, హమాలీ, గోనె సంచుల ఖర్చులు సైతం అందిస్తుంటే ఎల్లో మీడియా ఓర్వలేకపోతోందన్నారు. ఈ తరుణంలో వాతావరణ పరిస్థితులను సాకుగా చూపించి రైతులను భయభ్రాంతులకు గురిచేసి దళారులకు ధాన్యం విక్రయించేలా పిచ్చిరాతలు రాస్తున్నారని నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇకపోతే.. సన్న బియ్యానికి మంచి రేటు ఉండటంతో రైతులు వాటిని బయట మార్కెట్‌లో విక్రయించుకుంటున్నారన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement