టీ గ్లాస్‌లో తుఫాన్ వచ్చిందట. అదేనండి.. గాజు గ్లాస్ పార్టీ.. కాకినాడ జిల్లాలో ఉన్నదే గుప్పెడు మంది. అందులోనూ ముఠాలు.. కుమ్ములాటలు జోరుగా సాగుతున్నాయి. ఉన్న ఇద్దరి మధ్యే వార్ నడుస్తుంటే.. మరో నేత ఎంట్రీ ఇవ్వబోతున్నారట. ఇక మూడు ముక్కలాట ఆడుకోవడమే అంటున్నారు ఆ పార్టీ కార్యకర్తలు.
పిఠాపురంలో మూడు ముక్కలాట
పార్టీ నిర్మాణం అనే మాటే వినిపించని జనసేనలో అక్కడక్కడా ఒకరిద్దరు నాయకులు కనిపిస్తారు. అలా కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ఇద్దరు నేతలు ఎవరికి వారే అన్నట్లు వ్యవహరించడంతో కార్యకర్తలుగా చెప్పుకునేవారికి తలనొప్పులు ప్రారంభమయ్యాయట. ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం జనసేన ఇన్‌ఛార్జ్‌గా కాకినాడ నగరంలోని మాజీ టిడిపి కార్పోరేటర్ మాకినీడి శేషుకుమారి వ్యవహరిస్తున్నారు.
2017లో కాకినాడ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో టిడిపి కార్పోరేటర్‌గా గెలిచిన శేషుకుమారి మేయర్ పదవి ఆశించి భంగ పడ్డారు. వెంటనే టిడిపికి స్వస్తి చెప్పి గాజు గ్లాస్ పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో పిఠాపురం నుంచి జనసేన తరపున పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ తిరిగి కాకినాడ వెళ్ళకుండా పిఠాపురంలోనే రాజకీయాలు చేస్తున్నారు శేషుకుమారి. పిఠాపురానికే చెందిన జనసేన పిఎసి సభ్యుడు పంతం నానాజీతో శేషుకుమారికి కోల్డ్ వార్ సాగుతోంది.
డాక్టర్ పాలిట్రిక్స్
ఇక ఇటీవలే పిఠాపురంకు చెందిన ప్రముఖ వైద్యుడు పిల్ల శ్రీధర్‌తో పాటుగా ఆయన సతీమణీ డా.పిల్ల దీపిక కూడా జనసేనలో చేరారు. వీరికి పార్టీ పెద్దల అండదండలు ఉండడంతో ..శేషుకుమారితో సంబంధం లేకుండా నియోజకవర్గంలో కార్యక్రమాలు చేసుకుపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో సీటు ఆశిస్తున్న డాక్టర్ శ్రీధర్ నియోజకవర్గంలో పట్టు సాధించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.
అప్పుడప్పుడు ఉచిత వైద్య శిభిరాలు నిర్వహిస్తూ గత ఎన్నికల అభ్యర్థి శేషుకుమారి క్యాడర్ ను తనవైపు రప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక శేషుకుమారి కాకినాడకు చెందిన నేత కావడంతో ఆమెపై నాన్ లోకల్ అనే ముద్ర ఉంది. ఇలా నియోజకవర్గంలో రెండు వర్గాలుగా చీలిపోగా.. మాజీ ఎమ్మెల్యే వర్మ జనసేనలో చేరేందుకు సిద్దమైయ్యారు. 2004 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా గెలిచి టిడిపిలో చేరిన వర్మ..2019 ఎన్నికల్లో ఓటమి చెందారు.
ఐతే నియోజకవర్గంలో టిడిపిపై ఉన్న వ్యతిరేకత 2024 ఎన్నికల్లో కూడా కొనసాగుతుందన్న అంచనాతో వర్మ జనసేనలో చేరేందుకు పావులు కదుపుతున్నారు. ఒకవేళ అదే జరిగితే పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీలో మూడు ముక్కలాట తప్పదని అంటున్నారు.
- పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment