సాక్షి, ఢిల్లీ: కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) నాయకుడు, జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కన్హయ్య కుమార్ మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని, కాంగ్రెస్ రాజకీయ పార్టీనే కాదు.. అంతకంటే గొప్పదైన సిద్ధాంతం అని పేర్కొన్నారు. దేశంలో గొప్ప ప్రజాస్వామిక పార్టీ అని, కాంగ్రెస్ లేకుండా దేశంలో పరిపాలన సరైన రీతిలో సాగదని అన్నారు.
చదవండి: Charan Singh Channi: సిద్ధూ రాజీనామాపై నాకు సమాచారం లేదు
కాంగ్రెస్ పార్టీ చాలా మంది ఆశయాలను నిలబెడుతూ ఉందని తెలిపారు. మహాత్మాగాంధీలోని ఏకత్వం, భగత్సింగ్లోని ధైర్యం, బీఆర్ అంబేద్కర్‌లోని సమానత్వం అన్నింటిని కాంగ్రెస్ పార్టీ రక్షిస్తోందని పేర్కొన్నారు. అందుకోసమే తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. కాంగ్రెప్ పార్టీతోనే భారతదేశం రక్షించబడుతుందని కోట్లాది మంది యూవత భావిస్తున్నారని అన్నారు. 2019 సాధారణ ఎన్నికల్లో కన్హయ్య కుమార్ సీపీఐ పార్టీ తరఫున బిహార్‌లోని బెగూసరయ్ లోక్‌సభ స్థానం నుంచి ఓడిపోయిన విషయం తెలిసిందే.
అదే విధంగా రాష్ట్రీయ దళిత అధికార మంచ్ (ఆర్‌డీఏఎమ్) ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని ఈ రోజు కాంగ్రెస్ చేరాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల చేరలేదు. తాను అధికారికంగా కాంగ్రెస్ పార్టీ చేరలేదని జిగ్నేష్ మేవాని తెలిపారు. తాను స్వతంత్ర ఎమ్మెల్యేనని, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నమ్ముతానని తెలిపారు. గుజరాత్‌లో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తానని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన గుజరాత్‌లోని వడ్గామ్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment