
సాక్షి, విశాఖపట్నం : జనసేన అధినేత, సినిమా హీరో పవన్ కల్యాణ్ స్పష్టత లేని రాజకీయాలు చేస్తున్నారని మంత్రి కన్నబాబు అన్నారు. చంద్రబాబునాయుడు, నారా లోకేష్ బాబు హైదరాబాద్‌కే పరిమితమయ్యారని వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సత్తా ఏమిటో ఈ ఎన్నికల ద్వారా తెలిసింది. గత పంచాయతీ ఎన్నికల్లో 84 శాతం గెలుచుకుంటే ఈ ఎన్నికల్లో 98 శాతం వైఎస్సార్ సీపీ గెలిచింది. చంద్రబాబుకు ప్రజలు సరైన బుద్ధి చెప్పారు. ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్. పరిపాలనా రాజధానికి ప్రజలు మద్దతు తెలిపారు. చంద్రబాబు స్టీల్ ప్లాంట్‌పై తప్పుడు ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదు. బాబు తప్పుడు ప్రచారం వలన గాజువాకలో కొంత గట్టి పోటీ ఎదుర్కొన్నాము’’ అని అన్నారు.
రాష్ట్ర చరిత్రలో ఇదో సువర్ణ అధ్యాయం : ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్
శ్రీకాకుళం : ‘‘ రాష్ట్ర చరిత్రలో ఇదో సువర్ణ అధ్యాయం. ప్రజలు స్పష్టమైన తీర్పు చెప్పారు. ఎన్నికలు ఎలాంటివైనా సరే వైఎస్సార్ సీపీదే విజయం అని తేలిపోయింది. 20 నెలల్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన సంక్షేమ పాలనతో గొప్ప సీఎంగా నిలిచిపోయారు. మూడు రాజధానులకి ప్రజలంతా మద్దతు పలికారు. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర మూడు ప్రాంతాల్లోనూ వచ్చిన ఫలితాలే అందుకు నిదర్శనం. టీడీపీ కంచుకోటలు బద్దలయ్యాయి. చంద్రబాబు ఇప్పటికైనా తన ఓటమిని హుందాగా అంగీకరించాలి. కుయుక్తులతో రాజకీయాలు నడపాలి అనుకునేవారికి ప్రజలు తమ ఓటుతోనే చావు దెబ్బ కొట్టారు.’’