MLC Polls: సకుటుంబ సమేతంగా గో.. గోవా, బెంగళూరు | Karimnagar MLC Polls: TRS Party Sends Leaders Goa, Bangalore | Sakshi
Sakshi News home page

MLC Polls: సకుటుంబ సమేతంగా గో.. గోవా, బెంగళూరు

Published Sat, Nov 27 2021 10:46 AM | Last Updated on Sat, Nov 27 2021 10:56 AM

Karimnagar MLC Polls: TRS Party Sends Leaders Goa, Bangalore - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, కరీంనగర్‌: ఉమ్మడి జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. అధికార పార్టీ  వ్యూహాత్మకంగా స్థానిక ప్రజాప్రతినిధులందరినీ క్యాంపులకు పంపింది. ఇక్కడ నామినేషన్లు వేసిన వారిలో 14 మందిని తప్పించింది. ఇక మిగిలినవారిని ఎదుర్కొనేందుకు సిద్ధపడింది. వాస్తవానికి బరిలో ఉన్న 10 మందిలో అధికార పార్టీ అభ్యర్థులైన ఎల్‌.రమణ, టి.భానుప్రసాద్‌రావు కాకుండా ఎనిమిది మంది కూడా తప్పుకుంటే ఎన్నిక ఏకగ్రీవం అయిపోయేది. ఈ లెక్కన అధికార పార్టీల శిబిరం శుక్రవారంతో ముగిసేది.

కానీ, ఎనిమిది మంది అభ్యర్థులు నామినేషన్లు విత్‌డ్రా చేసుకోకపోవడంతో వీరి క్యాంపును డిసెంబరు 8 వరకు పొడిగించారు. ఇపుడు శిబిరానికి తరలిన నేతలను, ఇంకా ఇక్కడి నేతలను అందరినీ కలిపి గోవా, బెంగళూరుకు పంపేందుకు సిద్ధమయ్యారు. ఈ జాబితాలో పుణే కూడా ఉంది. కానీ, దూరం ఎక్కువవుతుందని వద్దనుకున్నారు.
చదవండి: ఎమ్మెల్సీ ఎన్నికలు: బీజేపీలో ఈటల ‘స్వతంత్రం’.. ఆదిలాబాద్‌లో షాక్‌! 

సకుటుంబ సమేతంగా..!
ఉమ్మడి జిల్లాలో మొత్తం 1,324 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉన్నారు. వీరిలో 581 మంది పురుషులు కాగా, 743 మహిళలు. టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు దాదాపు 990 పైగా ఉన్నారు. అందులోనూ సంఖ్యాపరంగా మహిళా ప్రజాప్రతినిధులదే పైచేయి. అందుకే, క్యాంపులకు మహిళా ప్రజాప్రతినిధులకు తోడుగా వారి భర్తలు, పిల్లలు వెంట వచ్చేందుకు పార్టీ అంగీకరించింది. ఇదే సమయంలో నాయకులు కూడా వీలున్న వారు తమ సతీమణులతో క్యాంపులకు బయల్దేరుతున్నారు. వయసు మీద పడ్డ వారు, ఆరోగ్య సమస్యలు ఉన్న వారు మాత్రం ఇంటి వద్దే ఉంటున్నారు.
చదవండి: కరీంనగర్‌లో కారుకు షాక్‌! ఆశలు గల్లంతు.. గులాబీకి ‘సింగ్‌’ బైబై

ఈ ఎత్తుగడతో అధికార పార్టీ ఒక్క దెబ్బకు రెండు పిట్టలను కొట్టింది. ఒకటి పార్టీ కేడర్‌ను కాపాడుకున్నారు. రెండు పోటీలో ఉన్న మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్, సారాబుడ్ల ప్రభాకర్‌రెడ్డి, ఇనుముల సత్యనారాయణ తదితరులకు ప్రచారం చేసే వీలు చిక్కకుండా అభ్యర్థులను దూరం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులంతా క్యాంపు ముగించుకుని నేరుగా పోలింగ్‌ కేంద్రాలకు వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నారని సమాచారం.

నేడు రవీందర్‌ సింగ్‌ కార్యాచరణ..
ఈ నేపథ్యంలో మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌ శనివారం తన కార్యచరణ ప్రకటించనున్నారు. వాస్తవానికి ఈయన తప్పుకుంటే మిగిలిన వారు కూడా తప్పుకునేవారన్న ప్రచారం జరిగింది. కానీ, రవీందర్‌సింగ్‌తోపాటు మరో నేత, రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు సారాబుడ్ల ప్రభాకర్‌రెడ్డి కూడా నామినేషన్‌ ఉపసంహరించుకోలేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement