బెంగళూరు: ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా మూడు నెలలు గడవక ముందే కర్ణాటక కాంగ్రెస్‌లో ముసలం పట్టిందా..? బయటకు నేరుగా వెల్లడించకపోయినా.. నేతల్లో అసమ్మతి సెగలు రగులుతున్నాయా? సొంత నియోజకవర‍్గాల్లో పనులు చేయలేకపోతున్నామని 30 మంది ఎమ్మెల్యేలు సీఎంకు మొరపెట్టుకున్నారా?.. సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లు ఈ పుకార్లలో వాస్తవం లేదని చెబుతున్నా.. తాజా పరిణామాలు ఇవన్నీ నిజమేనా? అనే సందేహాలను కల్గిస్తున్నాయి.
కర్ణాటకాలో కాంగ్రెస్ ఘనవిజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. దేశవ్యాప్తంగా నీరుగారుతున్న కాంగ్రెస్ ఆశల్ని పైకిలేపింది. సిద్ధరామయ్య నేతృత్వంలో చక్కగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సిద్ధరామయ్య పీఠం అధిష్ఠించగానే ప్రజలపై వరాల జల్లులు కురిపించారు. అనేక సంక్షేమ పథకాలను ప్రకటిస్తూ శ్రేయోరాజ్య స్థాపన దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే.. ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు గడిచిందో లేదో.. ప్రభుత్వం కూలిపోనుందా? అనే పుకార్లు పుట్టాయి. పార్టీ నేతల్లో అసమ్మతి సెగలు కమ్ముకున్నట్లు వార్తలు వచ్చాయి. సొంత నియోజక వర్గాల్లో పనులు చేయలేకపోతున్నామని 30 మంది ఎమ్మెల్యేలు సీఎంకు మొరపెట్టుకున్నారని ఊహాగానాలు వచ్చాయి.
దానికి తోడు తమ ప్రభుత్నాన్ని కూల్చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని డీకే శివకుమార్ వ్యాఖ్యలు చేయడం ఈ పుకార్లకు మరింత బలాన్ని చేకూర్చినట్లయింది. అటు.. అభివృద్ధి పనులకు మంత్రులు సహకరించడం లేదని ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేసినట్లు ఆరోపణలు కూడా వచ్చాయి. సీఎంను ఎలా కిందకు దించాలో తనకు తెలుసంటూ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్ చేసిన వ్యాఖ‍్యలు.. ప్రభుత్వంలో నేతల మధ్య సఖ్యత దెబ్బతిందనే ఆరోపణలకు బలం చేకూర్చాయి.
ఇదీ చదవండి: HD Deve Gowda: జేడీఎస్ భవిష్యత్‌పై పార్టీ అధినేత దేవె గౌడ కీలక వ్యాఖ్యలు..
అయితే ఈ పుకార్లలో ఎలాంటి నిజం లేదని సీఎం సిద్ధరామయ్య తాజాగా స్పష్టం చేశారు. 30 మంది ఎమ్మెల్యేలు తనకు అసమ్మతి లేఖలు పంపలేదని వెల్లడించారు. ఈ వారం పార్టీ అసెంబ్లీ సభ్యుల సమావేశం ఉంటుందని చెప్పారు. గత వారం జరగాల్సిన మీటింగ్ పలు కారణాల వల్ల వాయిదాపడినట్లు చెప్పారు. అటు డీకే శివకుమార్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. పార్టీ ఎమ్మెల్యేల మధ్య సయోద‍్యతో పాటు ప్రభుత్వ అభివృద్ధి పనులపై చర్చించనున్నట్లు చెప్పారు. మంత్రులపై ఎలాంటి ఫిర్యాదులు రాలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు బెంగళూరుకు బయట కుట్ర జరుగుతోందని డీకే శివకుమార్ వ‍్యాఖ్యలపై స్పందించడానికి సిద్ధరామయ్య నిరాకరించారు.
అయితే.. రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాల అమలుకు నిధుల కొరత ఎదురవుతున్నట్లు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న పథకాల అమలుకు పలు నియోజకవర్గాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. ఒక్క తన నియోజక వర్గంలోనే రూ.300 కోట్ల వరకు అవసరమవుతున్నట్లు చెప్పారు. పథకాలను అలాగే కొనసాగించాలని ఎమ్మెల్యేలు కోరుతున్న విషయాన్ని డీకే తెలిపారు. అయితే.. ఈ విషయాలను మరిచి ప్రజలతో మమేకమై నేతలు ఉండాలని సూచించినట్లు డీకే తెలిపారు. వర్షాలు, వరదల్లో ప్రజలకు తోడుగా ఉండాలని చెప్పినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: మణిపూర్ అల్లర్లు.. అమరుని కుటుంబాన్ని రక్షించిన బీఎస్‌ఎఫ్..
Comments
Please login to add a commentAdd a comment