సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సంఘం అజమాయిషిలోనే పోలీసులు, ప్రభుత్వ అధికారులు, సిబ్బంది పనిచేయాల్సి ఉన్నా... బీఆర్‌ఎస్ సర్కార్ కనుసన్నల్లోనే వారంతా పనిచేశారని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. పోలింగ్ సందర్భంగా అనేక ప్రాంతాల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి డబ్బులు, మద్యం పంపిణీ చేశాయని విమర్శించారు. ముఖ్యంగా పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించలేదని ధ్వజమెత్తారు.
పలు ప్రాంతాల్లో వారి కళ్లముందే వేల రూపాయలు ఓటర్లకు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు పంపిణీ చేసినా చూస్తుండిపోయారని మండిపడ్డారు. గురువారం పోలింగ్ ముగిశాక పార్టీ నేతలు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, డా. కాసం వెంకటేశ్వర్లు యాదవ్, డా.బూర నర్సయ్యగౌడ్, మాజీ డీజీపీ కృష్ణప్రసాద్‌తో కలిసి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇలాంటి వ్యవహారాలపై ఈసీ మరింత కఠినంగా వ్యవహరించి ఉండాల్సిందని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఓటర్లను భయపెట్టాయి
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పోటీపడి డబ్బు, ఇతరరూపాల్లో ప్రలోభాలకు దిగినట్లు, అనేక ప్రాంతాల్లో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసినట్టు తమకు నివేదికలు అందాయని కిషన్‌రెడ్డి చెప్పారు. ఇంత ఒత్తిడి ఉన్నా, యువత, ఇతరవర్గాల ప్రజలు ధైర్యంగా బీజేపీ పక్షాన నిలిచి పార్టీ అభ్యర్థుల విజయం కోసం పనిచేశారన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల గూండాయిజానికి వెరవకుంగా రాష్ట్రవ్యాప్తంగా మొక్కవోని ధైర్యంతో పోరాడిన బీజేపీ కార్యకర్తలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామన్నారు.
గత వారం రోజులుగా చూస్తే కొన్ని చోట్ల బీఆర్‌ఎస్ నేతలు బీజేపీ అభ్యర్థులు, కా ర్యకర్తలపై భౌతికదాడులకు సైతం దిగారని, పోలింగ్ సందర్భంగా కూడా బీజేపీ కార్యకర్తలపై దాడి చేసి దొంగ ఓట్లు వేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. దీక్షాదివస్ పేరిట బీఆర్‌ఎస్ తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేయగా, కాంగ్రెస్ పార్టీ పోలింగ్ రోజు కూడా పత్రికా ప్రకటనలతో బీజేపీపై బురదజల్లే ప్రయత్నం చేసిందని ధ్వజమెత్తారు.
మంచి ఫలితాలు సాధిస్తామన్న నమ్మకముంది
బీజేపీ శక్తి మేరకు సమర్థవంతంగా పోరాడిందని, ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధిస్తుందనే ధీమా, విశ్వాసం తమకు ఉందని కిషన్‌రెడ్డి చెప్పారు. కాగా, పోలింగ్ నాడే నాగార్జునసాగర్ వద్ద రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీయడంపై కేంద్రం జోక్యం చేసుకోవాలని లేఖ రాస్తానని కిషన్‌రెడ్డి చెప్పారు.
బీఆర్‌ఎస్‌తో ఒప్పందం ఉండదు
తెలంగాణలో బీజేపీ అధిక సీట్లు గెలుస్తుందని, అధికారాన్ని సొంతం చేసుకునేంత స్థాయిలో ఫలితాలు వస్తాయనే ఆశాభావాన్ని కిషన్‌రెడ్డి వ్యక్తం చేశారు. గురువారం ఆయన టీవీ చానళ్ల ప్రతినిధులతో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌తో ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పందం కుదుర్చుకునే పరిస్థితి ఉండదని తేల్చిచెప్పారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలోని 24 సీట్లలో ముఖ్యంగా విద్యావంతులు ఎక్కువగా ఉన్న చోట్ల పోలింగ్ శాతం తక్కువగా ఉండడం మంచి పరిణామం కాదన్నారు. తక్కువ ఓటింగ్ శాతం (50 శాతం కంటే తక్కువ ఉన్నచోట్ల) కారణంగా పట్టణ ప్రాంతాల్లో కొద్దిమేర బీజేపీకి నష్టం జరిగే అవకాశం ఉండొచ్చని అంచనా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment