ఈనాడు మొసలికన్నీరు కారుస్తోంది. ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కడ లేని ప్రేమ ఉన్నట్లు నటిస్తోంది. అదంతా దేనికోసం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై తన ద్వేషాగ్నిని వెదజల్లడం కోసం. అంతే తప్ప వాస్తవాలు రాయాలని కాదు. రాష్ట్ర విభజన హామీలపై ఈ పత్రిక ఒక స్టోరీ ఇచ్చింది. ప్రతి రోజూ ప్రభుత్వంపై దుష్ప్రచారం సాగించడంలో బాగంగా ఈ కథనాన్ని వండిందని అర్దం చేసుకోవచ్చు. కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ విభజన హామీలకు సంబంధించి ఏదో సమాధానం ఇచ్చారు. దానిని అడ్డంపెట్టుకుని ఏపీ ప్రభుత్వంపైన, వైఎస్సార్‌సీపీ పైనా అడ్డమైన రాతలు రాసేసింది.
విభజన హామీలు నెరవేర్చవలసింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. కాని ఆ వార్తలో ఎక్కడా మోదీ పేరే ఎత్తలేదు. అది వీరి ధైర్యం. ముఖ్యమంత్రి జగన్ హామీలను సాధించలేకపోతున్నారని రాశారు.ఓకే. అలా రాయడం కరెక్టే అని కాసేపు అనుకుందాం. మరి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఏమి చేసినట్లు?. ఆయన గురించిగాని, ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం వైఖరి గురించిగాని ఒక్క ముక్క రాయలేదు. ఈ బ్యానర్ కథనం అంతా చదివితే ఏమి అనిపిస్తుందంటే.. ‘ఏపీకి ఇలాగే జరగాలి’ అనే వారి విషపు భావనలు కనిపిస్తాయి. ఏపీకి హామీలు నెరవేరలేదని చెబుతూనే దానికి కారణం అంతా జగన్ అయినట్లు,కేంద్రానికి ఏమీ బాధ్యత లేనట్లు రాయడమే వీరి నీచ జర్నలిజానికి నిదర్శనం.
ఇటీవలికాలంలో పోలవరం ప్రాజెక్టుకు 13 వేల కోట్ల రూపాయల మేర నిధులు విడుదలకు కేంద్రం అంగీకరించందంటే.. అది ఎవరి ప్రయత్నం? జగన్ ది కాదా? దానిని పోరాటం అనుకోండి. రాయబారాలు చేసి సాధించారని అనుకోండి ..ఏమన్నాకాని జగన్ సఫలం అయినట్లు కాదా? ఆ విషయాన్ని జనం మర్చిపోవాలన్నది వారి లక్ష్యం. అందుకే దాని గురించి రాయలేదు. అలాగే రెవెన్యూ లోటు కింద పదివేల కోట్ల రూపాయల మేర ఇవ్వడానికి కేంద్రం అంగీకరించింది కదా?అది జగన్ ఘనత కాదా? ఆ సంగతి రాయడానికి ఈనాడుకు చేతులు రాలేదా?. పార్లమెంటులో వైఎస్సార్‌సీపీ ఏమీ చేయడం లేదట.ఈ స్టోరీ వండిన రోజునే.. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ లోక్ సభలో ప్రధానమంత్రి సమక్షంలోనే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేసింది. అది వీరికి కనిపించలేదా? లేక ఈనాడు ధ్రుతరాష్ట్రుని మాదిరి అయిందా?. విభజన హామీల గురించి నిజాయితీగా వార్త ఇస్తే ఇవన్నీ రాయలి కదా? గత ఐదేళ్లలో జగన్ ఎన్నిసార్లు ఆయా అంశాలపై కేంద్రానికి విజ్ఞప్తి చేసింది చెప్పాలి కదా?.
✍️ నిజానికి జగన్ ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలోనే మోదీని కలిసి వీటి గురించి, ప్రత్యేకించి ప్రత్యేకహోదాపై మాట్లాడారు. ఆ వెంటనే మీడియాతో మాట్లాడుతూ బీజేపీకి పూర్తి స్థాయి మెజార్టీ రావడం మన ఖర్మ అని అన్నారు. ఎన్నికల ప్రచారంలో జగన్ చెప్పిందానిని ఈనాడు వక్రీకరిస్తోంది. కేంద్రం మెడలు వంచి హామీలను సాధిస్తానని అన్నారని పచ్చి అబద్దం రాసింది. కేంద్రంలో ఎవరికి మెజార్టీ రాకపోతే, వారిలో ఎవరు ప్రత్యేక హోదా ఇస్తానంటే వారికి వైఎస్సార్‌సీపీ ఎంపీలు మద్దతు ఇస్తారని ఆయన చెప్పారు. కానీ, కేంద్రంలో బిజెపికి పూర్తి మెజార్టీ వచ్చింది. అయినా జగన్ ఈ విషయాలను వదలిపెట్టకుండా అడుగుతూనే ఉన్నారు. దీనికి ఈనాడు సంతృప్తి చెందకపోతే వార్త ఇవ్వవచ్చు. తప్పు లేదు. అదే సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన నిర్వాకాల గురించి కూడా రాయాలి కదా!
ప్రత్యేక హోదా అక్కర్లేదని ,ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే చాలని ఆయన చెప్పినప్పుడు ఇదే ఈనాడు, ఇతర ఎల్లో మీడియా ‘అవునవును.. అదే గొప్ప’ అని ప్రచారం చేశాయే? ఆ తర్వాత రోజుల్లో ప్రజల సెంటిమెంట్ ను గమనించి చంద్రబాబు బీజేపీకి దూరం అయి మళ్లీ ప్రత్యేక హోదా పాట పాడినప్పుడు.. ‘అవునవును’ అని గంగిరెద్దుల మాదిరి తల ఊపింది కూడా ఈనాడు మీడియా కాదా?. ఆ రోజుల్లో ఏమైనా చంద్రబాబు తప్పు చేస్తున్నారని రాశారా? లేదంటే ప్రధాని మోదీ తన మాట నిలబెట్టుకోలేదని నిలదీశారా?.. లేదే!.
✍️నిజంగా ఏపీ ప్రజలపై అంత ప్రేమ ఉంటే విభజన హామీల అమలు చేయనందుకు నిరసనగా తనకు కేంద్రం ఇచ్చిన పద్మ భూషణ్ బిరుదును వెనక్కి ఇచ్చివేస్తున్నట్లు ప్రకటించి రాష్ట్రం అంతటా పేరు తెచ్చుకోవచ్చు కదా!.. చంద్రబాబు టైమ్ లోనే దుగరాజపట్నం పోర్టు అనువుకాదని కేంద్రం చెప్పిందే. అప్పుడు ఆయన ప్రభుత్వం ఏమి చేసింది?. దానికి బదులుగా రామాయపట్నం పోర్టును జగన్ చేపట్టి పనులు చేయిస్తున్నది వాస్తవం కాదా?. తెలిసినా కూడా కళ్లు మూసుకుని ఈనాడు మీడియా పిచ్చి రాతలు రాస్తోందే!. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టవలసిన కేంద్రాన్ని కాదని చంద్రబాబు ఎందుకు తీసుకున్నట్లు? అదే కేంద్రం ప్రాజెక్టును కట్టడం ఆరంభించి ఉంటే, మొత్తం నిర్వాసితుల సమస్య కూడా వారి పరిధిలోకి వచ్చి ఉండేది కదా!. అలాకాకుండా చేసింది చంద్రబాబా? జగనా?.
కడప స్టీల్ ప్లాంట్ రాకూడదన్నది వీరి ఆకాంక్ష. దానికి అనుగుణంగానే వీరి వ్యాఖ్యలు ఉంటున్నాయి. విశాఖ రైల్వేజోన్ కు ఓకే చేయాలని, నిధులు కేటాయించాలని ఎన్నిసార్లు వైఎస్సార్‌సీపీ ఎంపీలు పార్లమెంటులో కేంద్రాన్ని కోరలేదు?. వైఎస్సార్‌సీపీ ఎంపీలు అడగకపోతే తప్పే. కానీ.. వారు తరచుగా ఈ ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు. అదే టైమ్ లో తెలుగుదేశంకు ఉన్న నలుగురు ఎంపీలు ఏమి చేస్తున్నట్లు? కేంద్రాన్ని వదలివేసి, ఏపీలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నలు వేయడంలోనే తలమునకలు అయి ఉంటున్నారే.
✍️ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రనాథ్.. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎపికి ఎందుకు రావడం లేదని ప్రశ్నించడంలో ఆంతర్యం ఏమిటి?. దానికి కేంద్రం ఇచ్చిన సమాదానంతో వారు నోరు మూసుకోవాల్సి వచ్చింది కదా! ఏపీకి పెట్టుబడులు బాగానే వస్తున్నాయని కేంద్రం చెప్పిన విషయం తెలిసిందే. లోక్ సభలో కూడా టిడిపి ఎంపీలు.. కేంద్రాన్ని ప్రశ్నించడం మానివేసి వైఎస్సార్‌సీపీపైనా విమర్శలు చేయడంలోని ఆంతర్యం ఏమిటి?. పోనీ చంద్రబాబు ఏమైనా కేంద్రంపైన పోరాడుతున్నారా? విభజన హామీలు అమలు చేయని బిజెపితో అంటకాగడానికి చంద్రబాబు ఎందుకు ప్రయత్నిస్తున్నారు?. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ వీటి గురించి ఎన్నడైనా మాట్లాడుతున్నారా?. పైగా వీరు కేంద్రానికి వెళ్లి ఏపీకి నిధులు రాకుండా ఎలా చేయాలా అనే ధ్యాసతో ఉంటున్నారని ముఖ్యమంత్రి జగన్ స్వయంగా విమర్శించారే.
బలహీనవర్గాల ఇళ్ల నిర్మాణానికి నిధులు రాకుండా చేయడానికి టీడీపీ, కేంద్రంలో పైరవీ చేసిందని వైఎస్సార్‌సీపీ విమర్శిస్తోంది. దానికి ఏమైనా జవాబు ఇస్తారా?. ఈనాడు మీడియా ఎంతసేపు ఏపీ ప్రభుత్వంపై, ఏపీ ప్రజలపై రోదించడం కాకుండా దమ్ము ఉంటే మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించగలగాలి. లేదూ..అన్ని పార్టీల తీరుతెన్నులను విశ్లేషించి వార్తను ఇవ్వవచ్చు. కేవలం టీడీపీకే మేలు చేయాలన్న దుష్ట తలంపుతో ఇలాంటి చెత్త విశ్లేషణలు ఇస్తే జనం నమ్ముతారని ఈనాడు భ్రమ పడుతోంది. దీనివల్ల రామోజీరావుకు అప్రతిష్ట మరింత పెరుగుతుందే తప్ప వైఎస్సార్‌సీపీకి పోయేదేమీ లేదు. ఎందుకంటే వీరందరిని కలిపి దుష్టచతుష్టయంగా జగన్ ఎప్పుడో ప్రకటించేశారు కనుక.
::: కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment