ఈ మధ్యకాలంలో భారత రాష్ట్ర సమితి అనూహ్యమైన ఒత్తిడికి గురి అవుతున్నట్లు కనిపిస్తుంది. కొందరు ముఖ్యనేతలు పార్టీని వీడడం కాస్త ఇబ్బందే అని చెప్పాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఇలాంటి సన్నివేశాలు కొన్ని జరిగినా పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వాటిని ఎదుర్కోగలిగారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తొమ్మిదేళ్ల పాలన తదుపరి పార్టీ నుంచి కొందరు సీనియర్లు వెళ్లిపోవడం ఆశ్చర్యంగానే ఉంటుంది. రాజకీయాలలో ఇలాంటివి తప్పకపోవచ్చు. ఇప్పటికే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు కొందరు పార్టీని వీడారు. తాజాగా మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు తిరిగి ఎన్నికలలో పోటీచేయడానికి టిక్కెట్ లభించినా, దానిని తిరస్కరించి పార్టీని వీడడం బీఆర్‌ఎస్‌కు కొంత అప్రతిష్ట అని చెప్పకతప్పదు.
పార్టీ టిక్కెట్లు ప్రకటించేనాటికే మైనంపల్లి తిరుగుబాటు బాటలో ఉన్నారని తెలిసినా, ఆయనకు టిక్కెట్ ప్రకటించడం తప్పిదం అనిపిస్తుంది. ఏ వ్యూహంతో ఆయనకు టిక్కెట్ ఇచ్చారో కాని, అది ఫలప్రదం కాలేదని అర్దం అవుతుంది. మైనంపల్లి కొన్నాళ్ల క్రితం మంత్రి హరీష్ రావుపై తీవ్ర విమర్శలు చేశారు. దానికి కారణం తన కుమారుడు మెదక్ నుంచి పోటీచేయాలని భావిస్తుంటే హరీష్ అడ్డుపడుతున్నారన్నది ఆయన భావన. తన కుమారుడితో పాటు తనకు మల్కాజిగిరి టిక్కెట్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. కాని పార్టీ నాయకత్వం ఆయనకు మాత్రమే ఇచ్చింది. దాంతో ఆయన అసంతృప్తికి గురి అయ్యారు.
✍️మైనంపల్లి మొదటి నుంచి రఫ్ అండ్ టఫ్ లీడరుగానే గుర్తింపు పొందారు. టీడీపీ పక్షాన తొలిసారిగా ఆయన 2008 లో రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికలో గెలుపొందారు. డీ లిమిటేషన్ లో ఆ నియోజకవర్గం రద్దు కావడంతో మెదక్ నియోజకవర్గానికి మారి మరోసారి 2009 లో గెలిచారు. తెలంగాణ ఉద్యమం దశలో ఆయన టిఆర్ఎస్ తో పలుమార్లు వివాదపడ్డ చరిత్ర ఉంది. తెలంగాణ ఏర్పాటు జరిగిన తర్వాత 2014లో ఆయన మల్కాజిగిరి నుంచి టీడీపీ టిక్కెట్ ఆశించారు. కానీ, బీజేపీతో పొత్తు కారణంగా టీడీపీ ఆ టిక్కెట్ ఇవ్వలేదు. దాంతో ఆయన అలిగి కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసి ఆ పార్టీలో చేరారు. కాని అక్కడ కూడా మొండి చేయి చూపడంతో ఆ పార్టీని రెండు రోజులలోనే వీడి టిఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. మల్కాజిగిరి ఎమ్.పి టిక్కెట్ ఇవ్వడంతో పోటీచేశారు కాని ఓటమి చెందారు. అయినా టిఆర్ఎస్ అధికారంలోకి రావడంతో మైనంపల్లికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అనంతరం మల్కాజిగిరి అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వడంతో మూడోసారి గెలిచారు.
✍️సొంత అనుచర బలగం కలిగిన మైనంపల్లి ఆ ప్రాంతంలో కొంత పట్టు సాధించారు.ఆ బలంతో ఇప్పుడు పార్టీపై తిరుగుబాటు చేశారు. సాధారణంగా అధికార పార్టీ టిక్కెట్ వచ్చాక ఇలా తిరస్కరించడం అరుదుగా జరుగుతుంటుంది. ఆ విధంగా చూస్తే మైనంపల్లి రిస్కు తీసుకున్నట్లు అనిపిస్తుంది. త్వరలో కాంగ్రెస్ పార్టీ లో ఆయన చేరబోతున్నారని వార్తలు వస్తున్నాయి. వారి నుంచి రెండు టిక్కెట్ల హామీ పొందినట్లు చెబుతున్నారు. అలాకాకుంటే మళ్లీ సమస్య మొదటికి వస్తుంది. గతంలో రెండు రోజులే కాంగ్రెస్ లో ఉన్నా, రాజకీయ పరిణామాలలో వారు కాస్త బలం ఉన్న నేతలను తిరిగి చేర్చుకుంటారు. మైనంపల్లి తన భవిష్యత్తు కన్నా తన కుమారుడి రాజకీయ భవిష్యత్తుపైనే ఎక్కువ ఆశాభావంతో ఉన్నారనుకోవాలి. అందుకోసమే రాజకీయంగా తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. ఆయన సంగతి ఎలా ఉన్నా బీఆర్ఎస్ ఇటీవల పార్టీలో జరుగుతున్న కొన్ని పరిణామాలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
✍️కొద్ది రోజుల క్రితమే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బీఆర్‌ఎస్‌ను వదలి కాంగ్రెస్ లో చేరారు. కొంతకాలం క్రితం ఆయన పార్టీ మారే అవకాశం ఉందని, అలకలో ఉన్నారని తెలిసి మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కె.తారక రామారావు స్వయంగా ఖమ్మం వెళ్లి బుజ్జగించి వచ్చారు. అయినా తుమ్మలకు పార్టీ టిక్కెట్ రాలేదు. నిజానికి టీడీపీలో ఉన్న తుమ్మలను స్వయంగా కేసీఆర్ ఆహ్వానించి పార్టీలో చేర్చుకున్నారు. 2014లో పోటీచేసి ఓడిపోయిన తుమ్మల పార్టీలోకి రావడం ద్వారా ఒక సామాజికవర్గంలో ఎక్కువ ఉపయోగం ఉంటుందని అంచనా వేశారు. ప్రత్యేకించి అప్పట్లో హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కూడా పార్టీలోకి తెచ్చారని చెబుతారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇచ్చి, మంత్రి పదవి ఇచ్చి గౌరవించారు. తదుపరి పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే మరణించడంతో జరిగిన ఉప ఎన్నికలో తుమ్మల గెలిచారు. కాని అక్కడే 2018 లో జరిగిన సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్ది ఉపేందర్ రెడ్డి చేతిలో ఓటమి చెందారు. దాంతో తుమ్మలకు రాజకీయ గ్రహణం పట్టినట్లయింది. అప్పటి నుంచి పార్టీ పెద్దగా పట్టించుకోలేదు. ఈలోగా ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరడంతో తుమ్మల అవకాశాలకు గండి పడింది. మొత్తం మీద బిఆర్ఎస్ లో తనకు అవమానం జరిగిందని భావించిన ఆయన ఇప్పుడు కాంగ్రెస్ లో చేరారు.
✍️తుమ్మల చేరికతో ఖమ్మంలో కాంగ్రెస్ బలపడే అవకాశం ఉంది. ఆయన పాలేరు టిక్కెట్ ఆశిస్తున్నారు. ఆ ప్రకారం కాంగ్రెస్ ఇచ్చే అవకాశం ఉంటేనే.. ఆ పార్టీలో చేరి ఉండాలి. ఎన్.టి.ఆర్. క్యాబినెట్ లోనూ, చంద్రబాబు క్యాబినెట్ లోనూ, తదుపరి కేసీఆర్ మంత్రివర్గంలోనూ పదవులు నిర్వహించిన తుమ్మల.. తనకంటూ ఒక ముద్రవేసుకున్నారు. అయినా రాజకీయంగా ఒడిదుడుకులు ఎదుర్కున్నారు. మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కుటుంబానికి ఆయన ప్రత్యర్దిగా మారిపోయి.. టీడీపీలో చేరిన తర్వాత సొంత వర్గాన్ని తయారు చేసుకోగలిగారు. రాష్ట్ర స్థాయిలో కూడా గుర్తింపు పొందిన నేత అయినా.. నోటి దురుసుతనం ఆయనకు నెగిటివ్ అని చెప్పాలి.
✍️మరో నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి 2014 లో ఖమ్మం నుంచి వైఎస్ ఆర్ కాంగ్రెస్ అభ్యర్ధిగా లోక్ సభకు ఎన్నికయ్యారు. రాష్ట్ర విభజన జరిగినా ఆయన గెలవగలిగారు.కాని తదుపరి రాజకీయ పరిణామాలలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తన రాజకీయ కార్యకలాపాలను తగ్గించుకుంది. దానికి తోడు టీ(బీ)ఆర్ఎస్ నాయకత్వం ఆహ్వానించడంతో ఆయన ఆ పార్టీలో చేరారు. కానీ 2019 లో పార్లమెంటు ఎన్నికలలో ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు. దాంతో హతాశుడయ్యారు. అయినా అలాగే ఓపికగా పార్టీలో ఉన్నా ప్రభుత్వపరంగా ఆయనకు కొన్ని ఇబ్బందులు వచ్చాయని చెబుతారు. చివరికి ఆయన చేసిన కాంట్రాక్ట్ ల బిల్లులు కూడా పెండింగులో పడ్డాయని ప్రచారం జరిగింది. అయినా పార్టీపరంగా కేటీఆర్ సంప్రదింపులతో కొంత మెత్తబడ్డా, ఆశించిన రీతిలో రాజకీయం లేకపోవడంతో పొంగులేటి కాంగ్రెస్ లో చేరిపోయారు. అక్కడ పార్టీపరంగా ఒక పదవి కూడా ఇచ్చేశారు.
✍️తుమ్మల, పొంగులేటిల చేరిక బీఆర్ఎస్‌కు ఖమ్మం జిల్లాలో బాగా దెబ్బ అన్నది విశ్లేషణగా ఉంది. వీరిద్దరి తో పాటు మరికొందరు ప్రముఖులు కూడా ఆయా చోట్ల కాంగ్రెస్ లో చేరబోతున్నారని సమాచారం వస్తోంది. బీఆర్ఎస్ టిక్కెట్ రాని ఎమ్మెల్యేలు రేఖా నాయక్, బాపూరావు వంటివారు ఈ జాబితాలో ఉన్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే వీరేశం కూడా పార్టీలో చేరవచ్చు. ఈ మాత్రానికే బీఆర్ఎస్కు పూర్తి నష్టం జరుగుతుందని చెప్పజాలం. కానీ.. ప్రత్యేకించి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలలో కాంగ్రెస్ బలం పుంజుకోవడానికి ఈ పరిణామాలు ఉపయోగపడవచ్చు.
✍️కాగా మైనంపల్లి రాసిన లేఖలో బీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడం పార్టీ కార్యకర్తలకు ఇష్టం లేదని వ్యాఖ్యానించారు. ఇందులో కొంత వాస్తవం ఉండవచ్చు. కేసీఆర్ ఏ కారణంతో పార్టీ పేరు మార్చినా, తెలంగాణ పేరు పార్టీలో లేకపోవడం కార్యకర్తలకు అంతగా నచ్చలేదన్నది ఒక వాదన. కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశ్నించే పరిస్థితి లేదు కనుక ఎవరికి వారు సర్దుకు పోయారు. ఇతర రాష్ట్రాలలో కూడా పార్టీని విస్తరించాలన్న కేసీఆర్ ఆలోచనకు ఈ ఎన్నికల కారణంగా బ్రేక్ పడుతుంది. మళ్లీ గెలిస్తే అప్పుడు ఆ వ్యవహారాలు చూసుకుంటారు.
✍️కేసీఆర్ అందరికన్నా ముందుగా 115 మంది టిక్కెట్లను ప్రకటించడంతో లుకలుకలు బయటకు వస్తున్నాయి. దీని వల్ల పార్టీకి కొంత నష్టం జరిగినా, దానిని సర్దుబాటు చేసుకోవడానికి తగు సమయం ఉందన్న విశ్వాసం పార్టీలో ఉంది. మరో వైపు కేటీఆర్ ఆయా చోట్ల నేతల తగాదాలను తీర్చి రాజీలకు యత్నిస్తున్నారు. ఆ క్రమంలో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్యకు, మాజీ మంత్రి కడియం శ్రీహరిలకు మధ్య రాజీకుదిర్చారు. రాజయ్యకు ఎమ్మెల్సీ లేదా మరో పదవి ఇస్తామని హామీ ఇచ్చారట. అలాగే జనగామ నియోజకవర్గంలో పల్లా రాజేశ్వరరెడ్డికి టిక్కెట్ ఇవ్వాలని అనుకున్నారు. కానీ సిటింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తనకే టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారు. వీరి మధ్య రాజీ కూడా కుదర్చడానికి నాయకత్వం తంటాలు పడుతోంది. రాజకీయాలలో తగాదాలు, రాజీలు సర్వసాధారణమే. ఎందుకంటే ఎవరికి వారికి పదవి కావాలి కనుక.
:::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment