నలబై ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతటా ఆత్మగౌరవ నినాదం మారుమోగుతుండేది. అప్పట్లో కాంగ్రెస్ ఐ ప్రభుత్వం ఉండేది. ఆ పార్టీకి చెందిన నేతలు, మంత్రులు, ముఖ్యమంత్రులు సైతం ప్రతిదానికి ఢిల్లీ పార్టీ నాయకత్వంపై ఆధారపడవలసి వచ్చేది. వారి అపాయింట్‌మెంట్ కోసం వేచి ఉండవలసి వచ్చేది. దాంతో ఈనాడు వంటి పత్రికలు ఈ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ నడి వీధులలో ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెడుతున్నారని ప్రచారం చేసేవి. కాంగ్రెస్ ఐ ముఖ్యమంత్రులు చెన్నారెడ్డి, అంజయ్య, భవనం వెంకట్రామ్‌రెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డిలు కూడా ఈ విమర్శలను ఎదుర్కోవలసి వచ్చేది. తమ పార్టీ నేతలను తాము కలుస్తానని వేచి ఉంటే అది ఆంధ్రుల ఆత్మగౌరవ సమస్య ఎలా అవుతుందో అర్దం కాక కాంగ్రెస్ వారు తలలు పట్టుకునేవారు. అయినా ఆ విమర్శలను సరిగా తిప్పికొట్టలేకపోయేవారు. సరిగ్గా అదే టైమ్‌లో ప్రముఖ సినీ నటుడు ఎన్‌టీరామారావు ఆత్మగౌరవ నినాదంతోనే పార్టీని స్థాపించి దానిని ప్రజలలోకి బలంగా తీసుకువెళ్లారు. ప్రజలంతా ఆయన గ్లామర్‌తో పాటు ఈ నినాదానికి బాగా ఆకర్షితులయ్యారు. కాంగ్రెస్ సీఎంలను మార్చడం వల్ల కూడా నష్టపోయింది. అది చరిత్ర...
అప్పట్లో ఒకే పార్టీవారు ఢిల్లీలోను, ఉమ్మడి ఏపీలోను పాలనలో ఉన్నా... తెలుగు ప్రజలు ఆత్మగౌరవ సమస్యను ఎదుర్కున్నారు. మరి ఇప్పుడు అదే సూత్రాన్ని ప్రామాణికంగా తీసుకుంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రుల పరువును ఢిల్లీ వీధులలో తీసివేశారని చెప్పాలి. తెలుగుదేశం, జనసేన కార్యకర్తల పరువును మంట కలిపారని అంగీకరించాలి. ఈ ఇద్దరు నేతలు ఆత్మాభిమానం వదలుకుని, కేవలం పదవులపై యావతో ఎలాంటి అవమానాన్ని అయినా భరించడానికి సిద్దపడి రోజుల తరబడి పడిగాపులు పడ్డారంటే ఏమని అనాలి..! 1978-83 మధ్య కాలంలో ఆత్మగౌరవం సమస్యపైన ఈనాడు దినపత్రిక ఎన్ని కధనాలు ఇచ్చేదో తలచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. అదే పత్రిక ఇప్పుడు ఎలా రాస్తోంది చూస్తుంటే ఊసరవెల్లి కూడా సిగ్గుతో తలవంచుకోవలసిందే.
రాష్ట్ర ప్రయోజనాలకోసం చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ డిల్లీలో కూర్చున్నారట. బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి టీడీపీ, జనసేనలు నానా పాట్లు పడితే, అదేదో బీజేపీనే వెయిటింగ్‌లో ఉన్నట్లు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 వంటి మీడియా సంస్థలు ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేసే యత్నం చేశాయి. గత ఐదేళ్లలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడైనా ఢిల్లీ వెళ్లినప్పుడు ప్రధాని మోదీ, హోంమంత్రి అధికారిక అపాయింట్‌మెంట్ కాస్త లేటు అయితే చాలు.. ఇంకేముంది.. అంత అవమానం.. ఇంత అవమానం.. అని ప్రచారం చేసిన ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణలు ఇప్పుడు చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు ఇంత పరువు తక్కువగా ఢిల్లీలో కళ్లు కాయలు కాచేలా మూడు రోజుల పాటు అమిత్‌షాతో భేటీ కోసం ఎదురు చూస్తే మాత్రం మొత్తం అన్ని మూసుకుని కూర్చున్నారు.
ఐదేళ్ల క్రితం తానే ప్రధాని మోదీ కంటే సీనియర్‌ని అంటూ డంబాలు పలికి, మోదీని అనరాని మాటలు అన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఢిల్లీలో కిక్కురుమనకుండా కూర్చుని టీడీపీ కార్యకర్తల, అభిమానుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ యమునా నదిలో కలిపారు. పవన్‌కళ్యాణ్ పెద్దగా ఆత్మాభిమానం గురించి పట్టించుకోరు కాబట్టి ఆయన సంగతి అనవసరం. టీడీపీని, బీజేపీని కలపడానికి తాను అవమానాలకు గురి కావాల్సి వచ్చిందని, చివాట్లు తిన్నానని పవన్‌కళ్యాణ్ చెప్పడం ద్వారా బీజేపీకి టీడీపీ అంటే ఎంత చీత్కారమో చెప్పకనే చెప్పారు. ఆ మాట విన్నప్పుడైనా చంద్రబాబు నాయుడు కాస్త అయినా ఆత్మాభిమానం ప్రధర్శిస్తారనుకుని ఆశించిన టీడీపీ కార్యకర్తలకు తీవ్ర ఆశాభంగం కలిగించారని చెప్పాలి. దానిని పట్టించుకోకుండా అమిత్‌షా అపాయింట్‌మెంట్ దొరికితే చాలు అన్న చందంగా ఆయన ఢిల్లీలో పడిగాపులు పడ్డారు.
బీజేపీ గురించి కూడా మాట్లాడుకోవాలి... 2019 ఎన్నికల ముందు ప్రధాని నరేంద్ర మోదీని టెర్రరిస్టు అని, ముస్లింలు, క్రిస్టియన్‌లను బతకనివ్వడని, అవినీతి పరుడని, భార్యనే ఏలుకోలేని వాడని... ఇలా అనేక దూషణలకు చంద్రబాబు పాల్పడ్డాడు. వాటన్నిటిని మర్చిపోయి ఇప్పుడు అదే చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ సిద్దపడిందంటే వారికి ఉన్న ఆత్మగౌరవం ఇదేనా అని అనుకోక తప్పదు. మోదీ చాలా ఆత్మాభిమానంతో ఉంటారని ఆశించడం తప్పు అన్న భావనకు అవకాశం ఇచ్చారు. సరే పొత్తు కుదిరిందని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర ప్రకటించారు. మామూలుగా అయితే చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లు ఎగిరి గంతేసినంత పనిచేసేవారు. మరి వారు ఇంకా పూర్తిగా అన్ని అంశాలు సెటిల్ కాకపోవడం వల్ల మీడియా ముందుకు రాలేదేమో తెలియదు. మూడు పార్టీలు కలిసి ప్రకటన చేస్తారని కనకమేడల తెలిపారు. ఇదంతా రాష్ట్ర ప్రయోజనాల కోసం నమ్మబలికే యత్నం చేస్తున్నారు.
ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రానికి ఏదో అన్యాయం చేస్తున్నారంట.. వీరు వచ్చి బాగు చేస్తారంట.. అప్పుడే మళ్లీ ప్రజలను మోసం చేయడానికి తయారైపోయారు. అసలు వీరు ఏ ప్రాతిపదికన పొత్తు పెట్టుకుంది తెలపడం లేదు. ప్రత్యేక హోదా, తదితర విభజన హామీలు అన్ని అప్రస్తుతమని ఆయన వ్యాఖ్యానించడం ద్వారా రాష్ట్రంపై వారికి ఉన్న శ్రద్ద ఏమిటో చెప్పకనే చెప్పారు. అధికారంపై యావతో సిద్దాంతాలు, విధానాలు.. వేటితో సంబంధం లేకుండా పొత్తు పెట్టుకోవడమే కాకుండా మళ్లీ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. 2019లో ప్రత్యేక హోదాను కేంద్రం ఇవ్వనందుకే కదా ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చామని చెప్పింది. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఇస్తానంటోందని కదా మీరు చెప్పింది.. కాంగ్రెస్ ఇప్పటికీ అదే మాట మీద ఉంది కదా! అయినా కాంగ్రెస్‌ను వదలి బీజేపీతో ఎందుకు అంటకాగుతున్నారు! ఇది ఫక్తు అధికార కాంక్ష కాకుండా మరేమవుతుంది? అసలు సమస్య వేరే ఉంది.
చంద్రబాబు నాయుడుకు రాష్ట్రంలో ఒంటరిగా పోటీచేస్తే తుక్కు-తుక్కుగా ఓడిపోతామన్న భయం ఉంది. అందుకే ఆరుశాతం ఓట్లు ఉన్న జనసేన వెంటబడి పొత్తు పెట్టుకున్నారు. అక్కడితో ఆగకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని శరణు వేడుకున్నారు. ఒక్కశాతం ఓట్లు కూడా గత ఎన్నికలలో తెచ్చుకోలేకపోయిన బీజేపీకి ఆరు ఎంపీ సీట్లు ఇవ్వడానికి సిద్దమయ్యారని వార్తలు వచ్చాయి. అంటే దాని అర్ధం బీజేపీని అడ్డం పెట్టుకుని తనపై ఎలాంటి కేసులు రాకుండా చూసుకోవడానికే అన్న సంగతి తెలుస్తూనే ఉంది కదా! ఆదాయపన్ను శాఖ ఇప్పటికే పంపిన నోటీసులు తన మెడపై వేలాడుతూనే ఉన్నాయి. సీబీటీడీ ప్రకటించిన రెండువేల కోట్ల రూపాయల అక్రమాల భయం వెంటాడుతూనే ఉంది. ఏపీలో బయటపడ్డ స్కిల్ స్కామ్‌తో సహా పలు కుంభకోణాలు తనకు చుట్టుకున్నాయి. తాజాగా ఐఎమ్‌జీ భరతభూమి కుంభకోణంలో సీబీఐ విచారణ పడుతుందేమోనన్న ఆందోళన ఉంది. వీటన్నిటినుంచి తప్పించుకోవడానికి బీజేపీతో కాళ్ల బేరానికి వెళ్లడమే శరణ్యమని చంద్రబాబు భావించి ఉండాలి. ఈ క్రమంలో బీజేపీ చిత్తశుద్దిని కూడా శంకించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపధ్యంలో ఈ ఉదంతం అంతటిని పరిశీలిస్తే టీడీపీ, జనసేన, బీజేపీల పొత్తు ఆత్మగౌరవం లేని, పచ్చి అవకాశవాద పొత్తు అని ఇట్టే తేలిపోతోంది.
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment