ప్రముఖ నటుడు, చలనచిత్ర అభివృద్ది సంస్థ అధ్యక్షుడు పోసాని కృష్ణ మురళిపై మాజీ మంత్రి, యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న టీడీపీ నేత నారా లోకేష్ పరువు నష్టం దావా వేశారు. అమరావతి రాజధాని గ్రామంలో ఒక చోట భూమి కొన్నారని ఆరోపించినందుకు ఈ ఆరోపణ చేశారు. నిజంగా లోకేష్ ఇలా చేస్తే ఎవరైనా ఏమనుకుంటాం. ఆయన ఇతరుల విషయంలో కూడా పద్దతిగా ఉంటారని కదా!. ఎవరిపైనా అడ్డగోలు ఆరోపణలు చేయరేమో అని కదా?. కానీ, లోకేష్ తన పాదయాత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపైన, పలువురు ఎమ్మెల్యేలపైనా నోటికి వచ్చిన ఆరోపణలు చేస్తూ సభలలో మాట్లాడుతున్నారు. మరి వీటిపై ఎన్ని పరువు నష్టం దావాలు వేయవలసి ఉంటుంది?.
అసలు లోకేష్ చదివిందేమిటి?. ఆయన భాష ఏంటి?. ఆయన చదివిన యూనివర్శిటీ ప్రతిష్ట ఏమిటి?. లోకేష్ బట్టలూడదీసే భాష మాట్లాడుతూ ఆ యూనివర్శిటీ పరువు తీస్తున్న తీరేమిటి?. లోకేష్ కంతేరు అనేచోట పద్నాలుగు ఎకరాల భూమి కొన్నారని కృష్ణ మురళి ఆరోపించారట. దానిపై ఏకంగా లోకేష్ కోర్టుకే ఎక్కారట. వినడానికే విడ్డూరంగా లేదు. దానికి పోసాని బదులు ఇస్తూ లోకేష్ తల్లి, భార్య డైరెక్టర్లుగా ఉన్న హెరిటేజ్.. భూమి కొంటే ఆయనకు సంబంధం ఉండదా అని ప్రశ్నించారు. అదే సందర్భంలో తనపైన కోపానికి కారణాన్ని వివరిస్తూ లోకేష్ యువతులతో విలాసంగా గడుపుతున్న ఫోటోలను చూపినందుకేనని పోసాని అభిప్రాయపడ్డారు.
అది చెప్పే దమ్ముందా..
నిజం చెప్పాలంటే భూమి కొనుగోలు చేస్తే పరువు పోదు. కానీ, ఇలాంటి పనులు చేయడం పరువు తక్కువ పని అవుతుంది. అందుకు లోకేష్ బాధపడాల్సిందిపోయి, వాటిని సమర్ధించే విధంగా మాట్లాడి మరింతగా నష్టం చేసుకున్నారు. ఒకవేళ లోకేష్ అవి తన ఫోటోలు కాదని, మార్ఫింగ్ ఫోటోలని, వాటిని ప్రదర్శించడం వల్ల తన పరువుకు భంగం వాటిల్లిందని ఆయన కోర్టుకు వెళ్లగలిగి ఉంటే అది అందరి మన్ననలు పొందగలిగేది. ఆ పని ఆయన అలా చేయలేకపోయారు. అంతేకాక తాను స్కూల్‌లో, కాలేజీలో వెధవ పనులు చేశానని చమత్కారంగా అన్నట్లు మాట్లాడిన వీడియో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మరి రాజకీయాల్లోకి వచ్చింది అలాంటి వాటి గురించా అన్న ప్రశ్న వస్తుంది.
ఇంతగా పరువు గురించి ఆలోచించే వ్యక్తి ముఖ్యమంత్రిని పట్టుకుని ఎలా దూషిస్తున్నారు. ఆయన ఇసుక తింటారని, రోజూ మూడు కోట్ల రూపాయల ఇసుక స్కామ్ చేస్తున్నారని ఆరోపించడానికి ఆయన వద్ద ఉన్న ఆధారాలు ఏమిటి?. అంతేకాదు.. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీలను ఉద్దేశించి ఎంతలేసి మాటలు అన్నారు!. అధికారంలోకి వచ్చాక గుడివాడ రోడ్డులో అండర్ వేర్‌పై ఆయనను తిప్పుతారట. గన్నవరం ఎమ్మెల్యేకి భయం ఏమిటో చూపిస్తారట. అందరి సంగతి చూస్తారట.
పవన్ వ్యాఖ్యలు మర్చిపోయవా..
లోకేష్ నిజంగానే పరువు గురించి బాధపడుతుంటే గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేరుగా లోకేష్‌పై ఎన్ని అవినీతి ఆరోపణలు చేశారు!. పవన్‌పై అప్పట్లో లోకేష్ ఎందుకు కేసు పెట్టలేదు?. రెడ్ బుక్‌లో పేర్లు రాసుకుంటున్నారట. ఎవరు ఎవరికి సలహా ఇచ్చారో కానీ, తెలంగాణలో కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా రెడ్ బుక్ గురించే చెబుతుండటం విశేషం. ఎన్ని కేసులు ఉంటే అంత గుర్తింపు అట. వారికి పదవులట. ఈయన తన విధానాల గురించి చెప్పడం లేదు. మంచి విషయాలు అసలే మాట్లాడడం లేదు. కేవలం తన పార్టీ కార్యకర్తలను ఉసికొల్పడానికి, రెచ్చగొట్టడానికి మాత్రమే మాట్లాడుతున్నారు. దీనిని బట్టి అర్ధం అవుతున్నది ఏమిటంటే పార్టీలో ఏర్పడిన నిరుత్సాహాన్ని ఏదో రకంగా పోగొట్టాలంటే తాము మళ్లీ అధికారంలోకి వస్తామని నమ్మబలకాలని చంద్రబాబు, లోకేష్ భావిస్తున్నారన్నమాట.
అందుకే ముఖ్యమంత్రి జగన్‌ను, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను పరిపరివిధాలుగా దూషిస్తూ వీరు ప్రచారాలు చేస్తున్నారు. సైకో అని, మరొకటని, గతంలో ఏ ముఖ్యమంత్రిని కూడా ఇలా ప్రతిపక్ష నేతలు బూతులు తిట్టి ఉండలేదు. కేవలం తమను ఎవరు ఏమీ చేయలేరులే అన్న ధీమాతోనో, లేక కోర్టులలో తాము ఎలాగైనా నెగ్గుకు రాగలమన్న నమ్మకంతోనో ఇలా చేస్తున్నారనిపిస్తుంది.
అన్నమయ్య జిల్లా అంగళ్లు వద్ద చంద్రబాబు వాడిన భాష కూడా ఇలాగే ఉంది. గన్నవరం వద్ద నియమాలను ఉల్లంఘించి మాట్లాడుతున్నారని లోకేష్‌కు పోలీసులు నోటీసులు ఇవ్వబోతే టీడీపీ కార్యకర్తలు అడ్డుపడ్డారట. అంత ధైర్యవంతుడైన లోకేష్ వాటిని తీసుకుని సమాధానం ఇచ్చి ఉండవచ్చు కదా!. ఇదే సమయంలో మరో మాట చెప్పారు. గన్నవరం నియోజకవర్గానికి తాను పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఎక్కువ నిధులు ఇవ్వబట్టే వంశీ గెలిచారని ఆయన అంటున్నారు. తాను టీడీపీ గెలవలేని మంగళగిరిని ఎంపిక చేసుకున్నానని చెబుతున్నారు. అంటే తను పోటీచేయదలసిన నియోజకవర్గానికి నిధులు ఇచ్చుకోలేకపోయారా? ఇచ్చినా జనం పట్టించుకోలేదా?.
నీ కంటే వంశీ సమర్దుడు కదా..
ఈ లెక్కన లోకేష్ కన్నా వంశీ సమర్ధుడని తేలుతుంది కదా!. చెప్పేదానిలో హేతుబద్దత ఉండాలి కదా!. అయ్యన్నపాత్రుడు, దేవినేని ఉమా, బుద్దా వెంకన్న వంటి నేతలు మరింతగా రెచ్చిపోయి బూతులు మాట్లాడడం తెలుగుదేశంలో ఏర్పడిన వికృత సంస్కృతికి నిదర్శనంగా కనిపిస్తుంది. దానికి వారి భాషలోనే కొడాలి నాని సమాధానం చెప్పారు. దీనిని కూడా సమర్దించలేం కానీ, ఏపీలో టీడీపీ నేతల అరాచకపు భాష, వ్యవహార శైలిని ఎదుర్కోవాలంటే కొడాలి నాని వంటివారే కరెక్టేమో అన్న భావన ఏర్పడుతోంది.
చంద్రబాబు రెచ్చగొడితే రెచ్చిపోయి అంగళ్లు, పుంగనూరుల వద్ద టీడీపీ కార్యకర్తలు ఎలా కేసులలో ఇరుక్కున్నారో గమనించాలి. లోకేష్, మరో నేతనో ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే అది నమ్మి, ఎక్కడైనా రెచ్చిపోయినా, దౌర్జన్యాలకు దిగినా, జైలుపాలు కావల్సింది వారేనన్న విషయాన్ని మర్చిపోకూడదు. చంద్రబాబు, లోకేష్‌లు ధనవంతులు, పరపతి కలవారు కాబట్టి కోర్టుల చుట్టూ తిరగకుండా తప్పించుకోగలరు. అందరికి అలాంటి అవకాశం ఉండదు. ఆ విషయాన్ని టీడీపీ కార్యకర్తలైనా, మరెవరైనా గుర్తెరగాలి.
లోకేష్ పదేపదే తన పాదయాత్రకు ప్రభుత్వం అడ్డుపడుతోందని ప్రచారం చేస్తుంటారు. ఎవరు అడ్డుపడతారు? అడ్డుకుంటే దండయాత్ర చేస్తారట. ఏమిటో ఆయన గోల అర్ధం కాదు. ఇదేదో కాటా కుస్తీ మాదిరిగా టీడీపీ కార్యకర్తలు ఫీల్ కావాలన్నది ఆయన ఉద్దేశమేమో తెలియదు. తన తల్లిని అవమానించారంటూ మళ్లీ అదే గాత్రం. నిజంగా పదేపదే ఆ ప్రస్తావన చేస్తుండటం దిక్కుమాలిన రాజకీయం కోసం వారిని రోడ్డుమీదకు ఇలా తీసుకు రావాలా?. మరి అదే సమయంలో ముఖ్యమంత్రి సతీమణితో సహా పలువురు వైఎస్సార్‌సీపీ మహిళా నేతల గురించి తన అధీనంలోని సోషల్ మీడియాలో ఎంత నీచంగా పోస్టింగ్‌లు పెట్టిస్తున్నారో మర్చిపోకూడదు.
నిజంగా లోకేష్ పద్దతిగా రాజకీయం చేయాలనుకుంటే అలాంటి వాటిని పార్టీ పరంగా కట్టడి చేయాలి. అలా కోరడం అత్యాశే అవుతుందేమో!. లోకేష్ అప్పడప్పుడూ తెలుగు భాష సరిగా పలకలేక ఇబ్బంది పడుతుంటారు. అవి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంటాయి. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఆయనను పప్పు అని ఎద్దేవా చేస్తుంటారు. వారి సంగతేమో కానీ, వర్ల రామయ్య వంటి నేతలు కొందరు టీడీపీ సభలలో తమ నేతను పప్పు అంటారా? అంటూ ఆయన సమక్షంలోనే పలుమార్లు ప్రస్తావించి మరింత అపహాస్యం పాలు చేస్తున్నారు.
చంద్రబాబు, లోకేష్ లక్ష్యం అదే..
కొడాలి నాని, వంశీ పార్టీ మారితే ద్రోహం అట. ఆయన మాత్రం వేరే పార్టీల వారిని టీడీపీలో చేర్చుకుంటే గొప్ప అట. తన తండ్రి ఏకంగా 23 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినప్పుడు దాన్ని ఏమంటారో కూడా లోకేష్ చెప్పాలి. పోసాని మీద లోకేష్ వేసినట్లుగా ఆయనపై కూడా పరువు నష్టం కేసులు వేయడం మొదలుపెడితే ప్రతీ నియోజకవర్గానికి ఎన్ని కేసులు పడతాయో ఊహించుకోవచ్చు. ఎందుకంటే వైఎస్సార్‌సీపీవారిని లోకేష్ దారుణంగా దూషిస్తూ యాత్ర సాగిస్తున్నారు. కాకపోతే లోకేష్‌కు అంత ప్రాధాన్యత లేదని భావించి వైఎస్సార్‌సీపీ నేతలు ప్రెస్ మీట్స్ పెట్టి ప్రతి విమర్శలు చేసి వదలివేస్తున్నారు. చంద్రబాబు, లోకేష్‌ల లక్ష్యం ఒకటే అనిపిస్తుంది. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో ఏదో విధంగా శాంతిభద్రతల సమస్య సృష్టించి రాజకీయం చేయాలన్నది వారి ఉద్దేశం అయి ఉండవచ్చు. కానీ, ముఖ్యమంత్రి జగన్ ఎంతో సంమయనంతో ఉంటూ వారికి ఆ అవకాశం ఇవ్వడం లేదు. అదే అసలు నిస్పృహకు కారణం అని చెప్పాలి.
కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్.
Comments
Please login to add a commentAdd a comment