తెలంగాణ రాజకీయాలలో జనసేన అధినేత, ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ ప్రభావం ఎంత ఉంటుంది?. ఏపీలోనే సంక్షోభంలో ఉన్న తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఏమి చేయగలుగుతుంది. జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఈ రెండు పార్టీలు తెలంగాణ రాజకీయాలను అడ్డు పెట్టుకుని ఏపీ రాజకీయాలను ప్రభావితం చేయాలని ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది.
నిజానికి జనసేనకు ఏపీలోనే బలం పెద్దగా లేదు. గత ఎన్నికలలో కేవలం ఆరు శాతం ఓట్లే వచ్చాయి. తెలంగాణలో అయితే అసలు పోటీలోనే లేదు. కానీ, ఈసారి తెలంగాణలో పోటీచేస్తామని ప్రకటించడం అందరిని ఆశ్చర్యపరచింది. ఏం బలముందని వీరు పోటీ చేస్తున్నారన్న ప్రశ్న వచ్చింది. ముప్పై రెండు సీట్లలో పోటీచేస్తామని ఆ నియోజకవర్గాల వివరాలు కూడా వెల్లడించారు. దాంతో ఆయన ఆశించిన ఫలితం కొద్దిగా వచ్చినట్లే అనిపిస్తుంది. అదేమిటంటే మిత్రపక్షమైన బీజేపీ తెలంగాణ నాయకులు పవన్ వద్దకు వెళ్లి తమకు తెలంగాణ శాసనసభ ఎన్నికలలో మద్దతు ఇవ్వాలని కోరారు. పవన్ కోరుకుంటుంది ఇవే కావచ్చు. తద్వారా ఏపీలో తెలుగుదేశంతో బీజేపీ పొత్తు పెట్టుకోవాలని, పార్టీ అధిష్టానం ద్వారా ఒత్తిడి చేయించడానికి ఇది ఒక అవకాశంగా ఆయన అనుకుని ఉండవచ్చు.
పవన్ చేసింది ఒక విధంగా బ్లాక్ మెయిల్ రాజకీయం. దీనికి బీజేపీ లొంగుతుందా? లేదా? అన్నది చెప్పడానికి మరికొంత సమయం పట్టవచ్చు. తెలంగాణలో టీడీపీతో పొత్తు ఉండదని గతంలోనే బీజేపీ కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. అలాగే ఏపీలో కూడా పొత్తు విషయంలో ఆసక్తి కనబరచడం లేదు. కానీ, పవన్ ఇప్పటికే టీడీపీతో పొత్తు ఉంటుందని ఏపీకి సంబంధించినంతవరకు ప్రకటించారు. తెలంగాణలో టీడీపీతో పొత్తు గురించి ఆయన మాట్లాడకపోవడం గమనించవలసిన అంశమే. ఏపీలో పొత్తు ఉన్నప్పుడు తెలంగాణలో ఎందుకు పొత్తు ఉంటుందని చెప్పలేదు?. పైగా సొంతంగా పోటీచేస్తానని డాంభికంగా పార్టీ నేతలు ఎందుకు ప్రకటించారు. అంటే ఇదంతా ఉత్తుత్తి వ్యవహారమేనని, బీజేపీ నేతలను కొంతమేర తాము అనుకుంటున్న లైన్‌లోకి తీసుకురావడానికి ఒక ప్రయత్నమని అర్దం అవుతూనే ఉంది.
ఇక్కడ బీజేపీ నేతలకు ఒక ఇబ్బంది ఉంది. ఎంత కాదన్నా జనసేన.. ఏపీకి సంబంధించిన పార్టీగానే ఉంటుంది. దానితో నేరుగా పొత్తు పెట్టుకుంటే అధికార బీఆర్ఎస్ దానిని తెలంగాణ సెంటిమెంట్‌తో ముడిపెట్టి బీజేపీపై విమర్శలు చేయవచ్చు. కిందటిసారి కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశంతో నేరుగా పొత్తు పెట్టుకుని భారీగా నష్టపోయిన అనుభవం ఉంది. అదే తరహా ప్రభావం బీజేపీపై పడితే చేటు కావచ్చు. కాకపోతే నేరుగా పొత్తు కాకుండా పవన్ మద్దతుదారులు కానీ, ఏపీ నుంచి ఇక్కడ నివసిస్తున్న జనసేన అభిమానులు కానీ, ప్రత్యేకించి ఒక సామాజికవర్గం వారి ఓట్లను పొందడానికి వీలుగా సపోర్టు కోరవచ్చు. అందుకు పవన్ ఏ రకంగా అంగీకరిస్తారన్నది చూడాల్సి ఉంటుంది.
ఏపీలో బీజేపీతో పొత్తుకు ససేమిరా అంటే పవన్ తెలంగాణలో బీజేపీకి అండగా నిలబడతారా?. అలా చేయకపోతే ఏపీలో జనసేనతో బీజేపీ సంబంధాలు ఎలా ఉంటాయి? మొదలైన సమస్యలన్నీ ప్రస్తావనకు వస్తాయి. ఇక్కడ ముఖ్యంగా మూడు, నాలుగు విషయాలు తేలాల్సి ఉంది. జనసేన సొంతంగా పోటీ చేస్తుందా? దాని వల్ల ఏ పార్టీకి అయినా కొద్దిగా అయినా నష్టం కలుగుతుందా? జనసేనతో పొత్తు వల్ల బీజేపీకి లాభమా? నష్టమా? అన్న అంచనాకు కూడా రావల్సి ఉంఉంది. ఇదంతా పవన్ కల్యాణ్ బెదిరింపు రాజకీయమని, చంద్రబాబు తరపునే ఆయన పనిచేస్తున్నారని బీజేపీ ఫీల్ అయితే అప్పుడు ఎదురయ్యే పరిణామాలేంటి?. ఒకవేళ పవన్ కోరుకున్నట్లు తెలుగుదేశంతో కూడా బీజేపీ పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుంది. ఇప్పటికైతే ఈ అవకాశం తక్కువే అని చెప్పాలి.
ఎందుకంటే టీడీపీని భుజనా వేసుకున్నట్లు చెబుతున్న కమ్మ సామాజికవర్గం కొంత బీఆర్ఎస్ వైపు నుంచి కాంగ్రెస్ వైపు మళ్లిందన్న అభిప్రాయం ఉంది. ఈ వర్గం ఓట్ల కోసం కొన్ని నియోజకవర్గాలలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పోటీ పడుతున్నాయి. కానీ, ఆ వర్గం ఓట్ల కోసం టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఇతర వర్గాలలో వ్యతిరేక ప్రభావం పడవచ్చు. టీడీపీ తెలంగాణలో 119 సీట్లకు పోటీచేస్తుందని, నటుడు బాలకృష్ణ తెలంగాణలో ప్రచారం చేస్తారని ఆ పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించారు. ఒకవైపు టీడీపీ మొత్తం ఖాళీ అయిపోతే, అసలు వీరికి అభ్యర్ధులు దొరకడమే కష్టం అయితే అన్ని సీట్లు పోటీచేస్తామని చెప్పడం ఆయా రాజకీయ పార్టీలను బ్లాక్ మెయిల్ చేసే ఉద్దేశం కావచ్చు. ప్రత్యేకించి బీజేపీతో ఎలాగోలా కలవడానికి టీడీపీ పడుతున్న తంటాలలో ఇది ఒకటి కావచ్చు.
తెలంగాణ ఎన్నికలను బూచిగా చూపించి, ఏపీలో రాజకీయ లబ్ది పొందాలన్నది వారి యోచన అన్నది అర్దం అవుతూనే ఉంది. తాజాగా పార్టీ సీనియర్ నేత రావుల చంద్రశేఖరరెడ్డి కూడా టీడీపీకి గుడ్ బై చెప్పారు. ఆయన ఎన్టీరామారావు కాలం నుంచి పార్టీలో ఉన్నారు. వివిధ పదవులు నిర్వహించారు. చంద్రబాబుకు అత్యంత విధేయుడుగా పేరొందారు. అయినా ఆయనే పార్టీ వీడటం, అది కూడా చంద్రబాబు అవినీతి కేసులో చిక్కి రాజమహేంద్రవరం జైలులో ఉన్న తరుణంలో చేశారు. ఆయన తర్వాత పార్టీలో ఆ స్థాయిలో చెప్పుకోదగిన నేత మరొకరు లేరనే చెప్పాలి. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జ్ఞానేశ్వర్ కొత్తగా పార్టీలోకి వచ్చిన వ్యక్తి రియల్ ఎస్టేట్ రంగంలో బాగా సంపాదించారు.
ఈయన ఒకసారి ఎమ్మెల్సీగా పోటీచేసినప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఓట్లను ఆకర్షించిన తీరుతో వెలుగులోకి వచ్చారు. సొంతంగా ఒక పార్టీని కొంతకాలం నడిపారు. ఆ దుకాణం మూసివేసి చంద్రబాబు వద్దకు చేరి పార్టీ అధ్యక్షుడు అయ్యారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో టీడీపీకి అసలు ఉనికే దాదాపు కోల్పోయింది. అయినా ఏపీ రాజకీయాల కోసం తెలంగాణ శాసనసభ ఎన్నికలలో పోటీ అంటూ డ్రామాకు తెరదీశారు. ఒకవైపు పవన్, మరో వైపు చంద్రబాబు నాయుడు ఇద్దరూ ఒకే తరహా గేమ్ ఆడటం ద్వారా తెలంగాణ రాజకీయాలలో తమ వంతు విదూషక పాత్ర పోషిస్తున్నారని భావించవచ్చు.
కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment