పవన్ కళ్యాణ్ తన నటనా కౌశలాన్ని వెండితెరపై నుంచి రాజకీయాలకు కూడా విస్తరించినట్లుంది. రాజకీయాల్లో నటన, వంచనా చాతుర్యం వంటివి జనాలకు పరిచయం చేసిన ఘనత చంద్రబాబుదైతే.. పవన్ ఆయన అడుగుజాడల్లో.. అతని కంటే ఘనుడు అనిపించుకునేలా నడుస్తున్నాడు. ‘స్వర్ణాంధ్ర2047’ డాక్యుమెంట్ ఆవిష్కరణ సభలో ఆయన ప్రసంగాన్ని గమనిస్తే ఎవరికైనా ఇలాగే అనిపిస్తుంది. గతంలో ఆయన ఉపన్యాసాలకు, ఇప్పుడు చెబుతున్న సుద్దులకు ఎంత తేడా ఉందో అర్థమవుతుంది. పదవి వస్తే అంతా సుభిక్షంగా ఉందని నేతలు ఫీల్ అవుతారట. పవన్ ప్రస్తుతం ఆ దశలో ఉన్నారు.
పాతికేళ్లపాటు ఏపీలో రాజకీయ స్థిరత్వం ఉండాలని చంద్రబాబు నేతృత్వంలో పని చేస్తానని ఆయన చెప్పుకున్నారు. బాబును ఆకాశానికి ఎత్తేశారు. రాజకీయ అవసరాల కోసం పొగిడితే తప్పులేదు కానీ.. అతిగా చేస్తేనే వెగటు పుడుతుంది. 2019లో చంద్రబాబును ఉద్దేశించి పవన్ మాట్లాడిందేమిటో ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ’2020 విజన్ అంట.. రెండు కోట్ల ఉద్యోగాలు అని చెప్పారు..అవి ఇచ్చారా? ఆ ఉద్యోగాలు లేవు. రాష్ట్రంలో దుశ్శాసన పర్వం సాగుతోంది.
చంద్రబాబు దృతరాష్ట్రుడి మాదిరిగా కొడుకు లోకేష్ కోసమే పనిచేస్తున్నారు.‘ అని ఆయన అప్పట్లో ధ్వజమెత్తారు ఇప్పుడు మాత్రం.. ’2020 విజన్ అంటే ఆనాడు అర్థం చేసుకోలేక పోయారు..వెటకారం చేశారు. ఇప్పుడు వారికి అదే భిక్ష పెడుతోంది. చంద్రబాబు గారి అనుభవం, అడ్మినిస్ట్రేషన్ కేపబిలిటీస్ అమోఘం...‘ అంటున్నారు. చంద్రబాబు తనకు రాజకీయ భిక్ష పెట్టారని పవన్ అనుకుంటూ ఉండవచ్చు కానీ.. ‘విజన్2020’తో ఒరిగిందేమిటో చెప్పకుండా ఒట్టిగా పొగిడితే చెవిలో పూలు పెడుతున్నారని జనం అనుకోరా?
పవన్ కళ్యాణ్ విజన్2020 డాక్యుమెంట్‌ను అసలు చూశారా? 2004 ఎన్నికలకు ముందు చంద్రబాబు ఈ డాక్యుమెంట్‌తో ప్రచారం నిర్వహించారు. అందులోని అంశాలు పరిశీలించిన వారు ఇదేదో కాలక్షేపం వ్యవహారమని, హైప్ క్రియేట్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుందని విమర్శించారు. ప్రజలు ఈ డాక్యుమెంట్‌ను అస్సలు పట్టించుకోలేదు అనేందుకు ఆ తరువాతి రెండు ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడమే నిదర్శనం. ఈ సమయంలో కానీ.. రాష్ట్ర విభజన తరువాత 201419 మధ్యకాలంలో కానీ చంద్రబాబు ఈ విజన్ పేరెత్తితే ఒట్టు! ఎప్పుడైతే ప్రధాని నరేంద్ర మోడీ వికసిత్ భారత్ పేరుతో 2047 విజన్ అన్నారో.. బాబుగారికి ఠక్కున గుర్తొచ్చింది. తాను వెనుకబడకూడదన్నట్టు ‘స్వర్ణాంధ్ర2047’ను వదిలారు.
పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో ఇంకో ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు.. ’కులాలు, మతాలు, ప్రాంతాల పరంగా కొట్టుకునే రోజులు పోయాయి. 21వ శతాబ్దంలో కూడా కులాలేమిటి..మతాలేమిటి ప్రాంతాలేమిటి?‘ అని ప్రశ్నించారు. ఆయన నిజంగానే ఇలా అనుకుంటూంటే... జనసేన తరపున తీసుకున్న మూడు మంత్రి పదవులలో ఇద్దరు కాపులు ఎందుకు ఉన్నారో చెప్పాలి కదా? మరో మంత్రి పదవిని కూడా కాపు వర్గానికి చెందిన తన సోదరుడు నాగబాబుకే ఎందుకు కట్టబెడుతున్నారు? కమ్మ వర్గానికి చెందిన నాదెండ్ల మనోహర్‌కు ఒక మంత్రి పదవి ఇచ్చారు. బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు, ఇతర వర్గాల వారికి పదవి ఇప్పించ లేకపోయారే అన్న ప్రశ్న వస్తే ఏం జవాబు ఇస్తారు? కొద్ది నెలల క్రితం వరకు కులం కావాలని, అందులోను కాపులు, బలిజలు అంతా ముందుకు రాకపోతే రాష్ట్రంలో మార్పు రాదని రెచ్చగొట్టే రీతిలో ఉపన్యాసాలు ఈయనే చేయడం విశేషం.
కాపులు తనకు ఓటు వేసి ఉంటే భీమవరం, గాజువాకల్లో ఎందుకు ఓడిపోతానని కూడా ఆయన వ్యాఖ్యానించారు. కుల భావన అన్నా ఉంటే రాష్ట్రం బాగుపడుతుందని కూడా అప్పట్లో సెలవిచ్చారు. పవన్ తమ కులం వాడని నమ్మి మద్దతిచ్చిన కాపులు, బలిజలు ఇప్పుడు కుల భావాన్ని వదులుకోవాలా? అందుకు వారు సిద్దం అవుతారా? లేక పవన్ కళ్యాణ్ అవకాశవాద రాజకీయాలు చేయడంలో నైపుణ్యం సాధించారని సరిపెట్టుకుంటారా? ఒక్క మాటలో చెప్పాలంటే ఎప్పుడు ఏది అవసరమైతే అది చెప్పి ప్రజలను మభ్య పెట్టడంలో ఆరితేరుతున్నారు.
కొద్ది నెలల క్రితమే కదా! ‘‘ఐయామ్ సనాతన్ హిందూ’’ అంటూ పెద్ద గొంతు పెట్టుకుని పవన్ అరిచింది? ఆ సందర్భంలో ముస్లింలతో పోల్చి హిందువులను రెచ్చగొట్టిన పవన్ కళ్యాణ్ సడన్‌గా ఇంకా మత భావన ఏమిటని అంటే ఏపీ జనం నోట్లో వేలేసుకుని వినాలన్నమాట. పవన్ అసలు మతం గురించి ఎప్పుడు ఏమి మాట్లాడారో వివరించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అవి వింటే ఇన్ని రకాలుగా మాటలు మార్చవచ్చా? అన్న భావన కలుగుతుంది. వాటి గురించి వివరణ ఇవ్వకుండా ఎప్పటికి ఏది అవసరమైతే అది మాట్లాడితే సరిపోతుందా?
మరో వ్యాఖ్య చూద్దాం. పార్టీ పెట్టి నలిగిన తర్వాత చంద్రబాబుపై గౌరవం అపారంగా పెరిగిందని పవన్ అన్నారు. చంద్రబాబు తనకు చాలా గౌరవం ఇస్తున్నారని, కలిసే పని చేస్తామని కూడా పవన్ అన్నారు. టీడీపీ, జనసేన కార్యకర్తలు కూడా అలాగే కలిసి ఉండాలని, చిన్ని, చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకోవచ్చని అన్నారు. తను కోరిన విధంగా సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి ఇస్తానని ప్రకటించినందుకు కృతజ్ఞతగా పవన్ ఈ మాట చెప్పినట్లుగా ఉంది. చంద్రబాబుపై నిజంగానే అంత నమ్మకం ఉంటే నాగబాబు పదవి గురించి ఎందుకు లిఖిత పూర్వక హామీ తీసుకున్నారో కూడా చెప్పగలగాలి. విభజన నాటి నుంచి చంద్రబాబే సీఎంగా ఉండాలని కోరుకున్నారట పవన్. మరి 2018లో చంద్రబాబుతో విడిపోయి, వేరే కూటమి ఎందుకు పెట్టుకున్నారు? అప్పట్లో చంద్రబాబు, లోకేష్ లు అత్యంత అవినీతిపరులని గుంటూరులో సభ పెట్టి మరీ గొంతు అరిగేలా చెప్పింది పవన్ కళ్యాణే కదా? ఈ విషయంలో ఈయన కచ్చితంగా చంద్రబాబునే ఫాలో అవుతున్నారు.
చంద్రబాబు కూడా ఎవరినైనా పొగడగలరు.. తేడా వస్తే అంతకన్నా తీవ్రంగా తిట్టగలరు. పరిస్థితి బాగోలేదనుకుంటే తగ్గిపోయి ఎంతకైనా పొగడుతారు. ప్రధాని నరేంద్ర మోడీని గతంలో ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా విమర్శించింది.. దూషణలు చేసింది.. గుర్తు చేసుకోండి. దేశ ప్రధానిని పట్టుకుని టెర్రరిస్టు అన్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. టీడీపీ ఓటమి తర్వాత పూర్తిగా రివర్స్ లో మోడి అంత గొప్పవాడు లేడని మెచ్చుకున్నది కూడా ఆయనే. పవన్ ఇప్పుడు అదే దారిలో ఉన్నారు. లోకేష్ సీఎం కావడం ఇష్టం లేకే చంద్రబాబు మరో పాతికేళ్లు అధికారంలో ఉండాలని పవన్ అభిలషిస్తున్నట్లు ఉందని విశ్లేషణలు వస్తున్నాయి.
ఇంతకుముందు మరో సదేళ్లు సీఎంగా ఉండాలని చెప్పిన ఈయన ఈసారి పాతికేళ్లు అని అంటున్నారు. అప్పటికి చంద్రబాబుకు 99 ఏళ్లు వస్తాయి. అంటే పవన్ తాను సి.ఎమ్. కావాలన్న ఆశను వదలుకున్నట్లేనా? ఇది వ్యూహాత్మక వ్యాఖ్యా? లేక టీడీపీతో లేకపోతే తనకు రాజకీయ భవితవ్యం ఉండదని భయపడుతున్నారా? ఇది అన్నది తేలడానికి మరికొంత సమయం పడుతుంది.
కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment